బాబు సర్కార్ 'ఉత్తమ' కక్కుర్తి
- ప్రతిభా అవార్డులు సాధించిన చిన్నారులకు మొండిచెయ్యి
- ఒక్కో విద్యార్థికి రూ. 20 వేలు ఇస్తామన్న సీఎం ప్రకటన గాలికి..
- ప్రశంసాపత్రాలు మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకున్న వైనం
సాక్షి, చిత్తూరు: ఉత్తమ విద్యార్థులకు అందించే నగదు పురస్కారాల్లో ప్రభుత్వం కక్కుర్తి చూపిస్తోంది. విద్యార్థులను ప్రోత్సహిస్తామంటూ గొప్పలు చెప్పిన ప్రభుత్వం ప్రశంసా పత్రాలు చేతిలోపెట్టి.. పైసలు ఇవ్వడం మాత్రం మర్చిపోయింది. సొంత జిల్లా చిత్తూరులో సాక్షాత్తు ముఖ్యమంత్రే బహిరంగ సభలో చెసిన వాగ్ధానం నీటిమూటలా మారింది.
2015 ఏడాదికి గాను రాష్ట్రవ్యాప్తంగా పదోతరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించిన 4,050 మంది ప్రతిభా అవార్డులకు ఎంపికయ్యారు. ఒక్కో విద్యార్థికి ప్రశంసాపత్రంతోపాటు రూ. 20 వేల నగదు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఈ లెక్కన మొత్తం రూ.8.10 కోట్లు ఇవ్వాల్సి ఉంది. అవార్డు సొమ్మును విద్యార్థుల బ్యాంకు ఖాతాలకే జమచేస్తామంటూ అకౌంట్ నెంబర్లు కూడా తీసుకున్నారు.
నవంబర్ 14న తిరుపతిలో అర్భాటంగా నిర్వహించిన సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా విద్యార్థులకు ప్రశంసాపత్రాలు, మెడల్స్ అందజేశారు. అవార్డుల కార్యక్రమం ముగిసి మూడు నెలలు కావస్తున్నా విద్యార్థులకు ఒక్కపైసా చెల్లించలేదు. దీంతో ప్రభుత్వ తీరుపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
డబ్బు ఇవ్వలేదు
గతేఏడాది చిత్తూరు క్యాంఫర్డ్ పాఠశాలలో చదివి పదవ తరగతిలో 10 పాయింట్లు సాధించాను. ప్రతిభ అవార్డుకు ఎంపికయ్యాను. తిరుపతిలో జరిగిన కార్యక్రమంలో ప్రశంసాపత్రం ఇచ్చారు. రూ 20 వేలను బ్యాంకుఖాతాలో వేస్తామన్నారు. ఇంతవరకూ జమ కాలేదు.
- జి. దివ్య, క్యాంఫర్డ్ పాఠశాల, చిత్తూరు
నగదు ఇవ్వనిమాట నిజమే
విద్యార్థులకు ప్రతిభా అవార్డుల కింద ఇచ్చే మొత్తం మంజూరు కాని మాట నిజమే. జిల్లాకు సంబంధించి 400 మంది విద్యార్థులకు డబ్బులు ఇవ్వాలి. అందరి బ్యాంకుఖాతాలు పంపమంటే పంపం. మాచేతుల్లో ఏమీ లేదు. రాష్ట్ర విద్యాశాఖ అధికారులు విద్యార్థుల ఖాతాలో డబ్బులు వేస్తుంది.
- నాగేశ్వరరావు, జిల్లా విద్యాశాఖాధికారి
అవార్డులిచ్చిన రోజే నగదు చెల్లించాలి
ప్రతిభా అవార్డులు ఇచ్చిన రోజే విద్యార్థులకు నగదు చెల్లించాల్సి ఉంది. మూడు నెలలు కావొస్తున్నా ఇంతవరకు అందజేయకపోవడం దారుణం. ఈ విషయాన్ని మా యూనియన్ తరఫున ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తాం. వారికి న్యాయం జరిగేలా చేస్తాం.
- కత్తినరసింహారెడ్డి, ఎస్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు