సాక్షి, మంచిర్యాల :
‘సాంకేతిక విద్య కోర్సులకు సంబంధించి.. జూన్ 30లోగా తొలి విడత అడ్మిషన్లు పూర్తి చేసి.. ఆగస్టు ఒకటో తేదీన ఇంజినీరింగ్ తరగతులు ప్రారంభించండి..’
- మే నెలలో సుప్రీం కోర్టు ఆదేశం.
‘జూన్ 28లోగా.. ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ నోటిఫికేషన్ , ఫీజుల నోటిఫై వివరాలు సమర్పించాలి.’
- జూన్ 26న ఏఎఫ్‌ఆర్‌సీ, ఉన్నత విద్యాశాఖ, ఎంసెట్ కన్వీనర్‌లకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నౌషద్ అలీ ఆదేశం.
‘రాష్ట్రంలో అడ్మిషన్ల ప్రక్రియ ఆలస్యమవుతోంది. ఆగస్టులో తరగతుల ప్రారంభించలేం. కొంత గడువు ఇవ్వండి..’
- గత నెల సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం ఎక్స్‌టెన్షన్ పిటీషన్.
ఆగస్టు మూడో తేదీ దాటింది.. అయినా.. ఇంత వరకు తొలి విడత అడ్మిషన్లు పూర్తి కాలేదు.. అసలు కౌన్సెలింగ్ తేదే ప్రకటించలేదు. ఇదీ మన సర్కార్ పనితీరు.
ఎంసెట్ పరీక్ష ఫలితాలు వెలువడి నేటికి 60 రోజులైంది. ఇప్పటికే కౌన్సెలింగ్ పూర్తయి.. ఇంజినీరింగ్ తరగతులు ప్రారంభం కావాల్సి ఉంది. కానీ ఇంత వరకు విద్యా సంవత్సరం ప్రారంభం కాలేదు.. కనీసం కౌన్సెలింగ్ షెడ్యూల్ కూడా విడుదల కాలేదు. కాలేజీల్లో మేనేజ్‌మెంట్ కోటా సీట్లు ఆన్‌లైన్ ద్వారా భర్తీ చేయాలని ప్రభుత్వం.. కాదు మేమే భర్తీ చేసి మీకు వివరాలు అందజేస్తామని కాలేజీ యాజమాన్యాలు భీష్మించుకుని కూర్చోవడంతో కౌన్సెలింగ్‌కు బ్రేక్‌పడింది. ప్రస్తుతం ఆ కేసు హైకోర్టులో పెండింగ్‌లో ఉంది. కోర్టు తీర్పు చెప్పాలంటే.. ప్రభుత్వం కోర్టుకు భర్తీ ఆవశ్యకత, నివేదిక సమర్పించాలి. కానీ ఇంత వరకు ప్రభుత్వం నుంచి ఒక్కరు కోర్టుకు హాజరుకాలేదు. దీంతో జిల్లాలో ఎంసెట్‌లో మంచి ర్యాంకులు సాధించిన వెయ్యికి పైగా మంది విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది.
విద్యార్థులకు ఎదురుచూపులే..!
మే నెల 10న ఎంసెట్ ప్రవేశ పరీక్ష నిర్వహించగా.. జిల్లా వ్యాప్తంగా ఇంజినీరింగ్ విభాగంలో 1,673 మంది పరీక్ష రాశారు. గత నెల 5న ఫలితాలు విడుదలయ్యాయి. వీరిలో వెయ్యికి పైగా విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు.. జూన్ నెల 30లోగా తొలివిడత అడ్మిషన్ల ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంది. దీనికి అదే నెల 16న కౌన్సెలింగ్ తేదీ ప్రకటించి.. 30లోగా పూర్తి చేయాలి. జూలై రెండో వారంలో తరగతులు ప్రారంభం కావాల్సి ఉంది. కానీ.. ఫలితాలు ప్రకటించి 60 రోజులు గడుస్తున్నా.. ఇంత వరకు ప్రభుత్వం కౌన్సెలింగ్ తేదీలు ప్రకటించలేదు. మరోపక్క.. కొందరు విద్యార్థులు మంచి ర్యాంకులు సాధించి ఉన్నారు. వీరికి ఇతర రాష్ట్రాల్లోనూ సీట్లు వచ్చాయి. కానీ.. మన రాష్ట్రంలోనే ఇంజినీరింగ్ చేద్దామనే ఆలోచనతో ఆ కాలేజీల్లో చేరలేదు. కౌన్సెలింగ్‌కు జరుగుతున్న ఆలస్యం వీరిని ఆందోళనకు గురిచేస్తోంది.
ఇప్పటికి రెండుసార్లు కోర్టుకు..!
నోటిఫికేషన్ విడుదలలో ప్రభుత్వ జాప్యాన్ని నిరసిస్తూ.. హైదరాబాద్‌కు చెందిన కార్తీక్‌రెడ్డి, నేహా, మీనా విద్యార్థులు జూన్ నెల 25న హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. స్పందించిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నౌషద్ అలీ జూన్ 28లోగా కౌన్సెలింగ్ నోటిఫికేషన్ , ఫీజుల నోటిఫై వివరాలు సమర్పించాలని ఏఎఫ్‌ఆర్‌సీ, ఉన్నత విద్యాశాఖ, ఎంసెట్ కన్వీనర్‌లను ఆదేశించారు. దీంతో ఫీజుల నోటిఫైపై కసరత్తు చేసిన ప్రభుత్వం ప్రైవేట్ కాలేజీల్లో ఫీజుల వివరాలు సమర్పించింది. కానీ మేనేజ్‌మెంట్ కోటా సీట్ల భర్తీకి సంబంధించి.. నేరుగా అడ్మిషన్లు చేపట్టాలా..? ఆన్‌లైన్ ద్వారా భర్తీ చేయాలా..? అనే వ్యవహారం ఇంకా తేల్చలేదు. దీంతో హైదరాబాద్‌కు చెందిన లీలాకృష్ణ అనే మరో విద్యార్థి మళ్లీ కోర్టును ఆశ్రయించాడు. స్పందించిన హైకోర్టు న్యాయమూర్తి రామమోహనరావు ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఁకౌన్సెలింగ్ నిర్వహిస్తే.. నిర్వహించండి లేదా తప్పుకోండి. విద్యార్థులే ప్రత్యామ్నాయం చూసుకుంటారని* ఘాటుగా స్పందించింది.
జీవో 66పై ‘స్టే’ ఎత్తివేయండి..!
ఈ విద్యా సంవత్సరం నుంచి.. వృత్తి విద్యా కాలేజీల్లో ఆన్‌లైన్ ద్వారానే మేనేజ్‌మెంట్ కోటా అడ్మిషన్లు చేపట్టాలని మూడు నెలల క్రితం ప్రభుత్వం జీవో 66 విడుదల చేసింది. జీవోపై సవాలు చేస్తూ.. ప్రైవేట్ యాజ మాన్యాలు హైకోర్టును ఆశ్రయించాయి. స్పందించిన కోర్టు జీవోపై స్టే విధించి.. కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ మేరకు ప్రభుత్వం జీవో 66పై స్టే ఎత్తివేయాలని కోర్టులో కౌంటర్ కూడా దాఖలు చేసింది. అయినా కోర్టు నుంచి ఇంత వరకు ఎలాంటి తీర్పు వెలువడలేదు. మేనేజ్‌మెంట్ కోటా కింద ప్రభుత్వం ప్రతి విద్యార్థికి రూ.90 వేల ఫీజును ఖరారు చేసింది. కానీ చాలా కాలేజీల్లో యాజమాన్యాలు విద్యార్థుల నుంచి ముక్కుపిండి ఫీజులు వసూలు చేస్తున్న సంఘటనలు వెలుగులోకి రావడంతో.. దీనికి చెక్ పెట్టేందుకు ప్రభుత్వం ఆన్‌లైన్ అడ్మిషన్ల ప్రక్రియ చేపట్టింది. కౌన్సెలింగ్ ఇక ఎప్పుడు ప్రారంభవుతుందో.. క్లాసులు ఎప్పుడు మొదలవుతాయో తెలియని పరిస్థితి ఉంది
ఎంసెట్ కౌన్సెలింగ్‌పైనీలినీడలు
Published Sun, Aug 4 2013 5:39 AM | Last Updated on Fri, Sep 1 2017 9:38 PM
Advertisement
Advertisement