శ్రీశైలం నీళ్లపై దురాక్రమణ ఆపాలి
వైవీయూ :
శ్రీశైలం నుంచి నాగార్జునసాగర్‌కు 10 టీఎంసీ నీటిని తరలించడాన్ని నిరసిస్తూ రాయలసీమ విద్యార్థి వేదిక ఆధ్వర్యంలో నీటి పారుదలశాఖ కార్యాలయాన్ని ముట్టడించారు. గురువారం ఆర్‌ఎస్‌ఫ్ ఆధ్వర్యంలో విద్యార్థులు భారీ ర్యాలీగా తరలివచ్చి కార్యాలయం వద్ద బైఠాయించి ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా ఆర్‌ఎస్‌ఎఫ్ రాష్ట్ర కన్వీనర్ మల్లెల భాస్కర్ మాట్లాడుతూ పట్టిసీమ నీళ్లు ఆంధ్రాకు
ఇచ్చి శ్రీశైలం నీళ్లను రాయలసీమకు ఇస్తామని చెప్పి రెండు సంవత్సరాలుగా సీమ ప్రజలను మోసం చేస్తున్నారన్నారు. ఇప్పుడు తాగునీటి పేరుతో కోస్తాకు శ్రీశైలం నీటిని తీసుకుపోవడం ఏమిటని ఆవేదన వ్యక్తం చేశారు. కోస్తాలో సవృద్ధిగా వర్షాలు కురిశాయని, నాగార్జునసాగర్‌లో 121 టీఎంసీల నీరు నిల్వలు ఉన్నాయన్నారు.
ప్రస్తుతం శ్రీశైలంలో 800 అడుగుల నీటిమట్టం ఉందని, రాయలసీమకు పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్ ద్వారా నీళ్లు రావాలంటే 854 అడుగల్లో నీటి మట్టం ఉండాలన్నారు. అయితే ప్రభుత్వం రాయలసీమ గురించి ఆలోచించకుండా వచ్చిన నీరు వచ్చినట్లుగా గేట్లు ఎత్తేసి దురాక్రమణకు పాల్పడుతోందన్నారు. ఈ చర్యను రాయలసీమ ప్రజలు ఎంతమాత్రం అంగీకరించరన్నారు. వరుస కరువులతో అల్లాడుతున్న రాయలసీమను ఆదుకోవాల్సిన ప్రభుత్వమే ఇలా సీమ ప్రజల నోట్లో మట్టికొడుతోందని విమర్శించారు. అనంతరం నీటిపారుదల శాఖ ఎస్‌ఈకి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో ఆర్‌ఎస్‌ఎఫ్ రాష్ట్ర కో కన్వీనర్ దస్తగిరి, శ్యాంసుందర్‌రెడ్డి, మస్తాన్, విద్యార్థులు పాల్గొన్నారు.