సారా బంద్ చేస్తే 2 లక్షలు
మహబూబ్‌నగర్ : నాటుసారా తయారు చేయడం మానేసి ఇతర రంగాలు, కుల వృత్తులలో ఉపాధి పొందుతున్న కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం రూ.2లక్షల ఆర్థిక సహాయం చేస్తున్నట్లు ఎక్సైజ్ శాఖ డైరెక్టర్ అకూన్ సబర్వాల్ పెర్కొన్నారు. ప్రభుత్వం గతంలో ఇచ్చిన రూ.80వేలు కాకుండా ప్రస్తుతం నూతనంగా రూ.2లక్షలు ఇవ్వడానికి నిర్ణయం తీసుకొని ఈనెల 23న దీనికి సంబంధించిన జీవో విడుదల చేసినట్లు వెల్లడించారు.
జిల్లాలో సారా తయారు చేయడం ఆపేసి వివిధ వృత్తులలో ఉపాధి పొందుతున్న 175మంది కుటుంబాలతో సోమవారం ఆర్‌అండ్‌బీ అతిథిగృహాంలో ఎక్సైజ్ శాఖ డైరెక్టర్ అకూన్ సబర్వాల్ ముఖాముఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన వారితో మాట్లాడుతూ 2015నుంచి 2016సెప్టెంబర్ వరకు జిల్లాలో 690మందిని గుర్తించడం వారందరికి నేరుగా రెండు లక్షలు చెల్లించడం జరుగుతుందని జాబితాలో పేర్లు లేనికుటుంబాలు ఉంటే వెంటనే పేర్లు నమోదు చేసుకోవాలన్నారు.
మళ్లీ సారా తయారు చేయడం మొదలు పెడితే అలాంటి వారికి ఆర్థిక సహాయం అందకపోగా అలాంటి వారిపై కేసులు నమోదు చేయడం జరుగుతుందన్నారు. ప్రభుత్వం నుంచి వచ్చిన ఆర్థిక సహాయంతో ఇతర వృత్తులలో పెట్టుబడులు పెట్టుకొని ఉపాధి పొందాలని సూచించారు. ఆనంతరం బాధితులు పలు విషయాలు డైరెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. ఈ వృత్తి మానేసి రెండేళ్లు గడుస్తున్న ఇప్పటికి ఎలాంటి రుణం రాలేదని కొందరు..మాకు మీరు ఏదైనా ఆధారం చూపించాలని సమస్యలు చెప్పుకున్నారు. దీంట్లో కొందరు చదువుకున్న వారిని ప్రత్యేకంగా గుర్తించి అలాంటి వారికి ప్రత్యేకంగా ఉపాధి చూపించాలని కోరారు. ఆనంతరం ఎక్సైజ్ శాఖ డైరెక్టర్ అకూన్ సబర్వాల్ జిల్లా కలెక్టర్ రొనాల్డ్ రోస్‌తో బేటి అయ్యి జిల్లాలో నాటు సారా, కల్తీ కల్లుపై చర్చించారు.
మద్యం దుకాణాలు నిబంధనలు పాటించాలి
జిల్లాలో ఉండే మద్యం దుకాణాలు పూర్తిగా నిబంధనలు పాటించే విధంగా చర్యలు తీసుకోవాలని ఎక్సైజ్ శాఖ డైరెక్టర్ అకూన్ సబర్వాల్ అన్నారు. ఆర్‌అండ్‌బీ అతిథి గృహాంలో ఎక్సైజ్ శాఖ డీసీ జయసేనరెడ్డి, ఈఎస్ నర్సింహ్మారెడ్డి, సీఐ, ఎస్‌ఐలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామాల్లో అవగహన సదస్సులు నిర్వహించాలనే విషయంపై పోస్టర్లు ఆవిష్కరించారు. ఆనంతరం ఆయన మాట్లాడుతూ జూన్ 2కంటే ముందే జిల్లాలో నాటుసారా, కల్తీకల్లు లేకుండా చేయాలని దీనికోసం నిబద్దతతో పని చేయాలని స్పష్టం చేశారు. కల్తీకల్లు, నాటుసారా తయారు చేస్తూ అమ్ముతున్న కుటుంబాలను వీలైనంత వేగంగా గుర్తించి అలాంటి వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. ముఖ్యంగా పట్టణా ప్రాంతాల్లో కిరాణ దుకాణాలు, సూపర్‌మార్కెట్‌లలో నల్లబెల్లం, తెల్లబెల్లం నిల్వలపై నిఘా ఏర్పాటు చేయాలన్నారు. నిబంధనలు పాటించాని మద్యం దుకాణాలపై దాడులు చేసి కేసులు నమోదు చేయాలన్నారు.