నకిలీ విత్తన విక్రేతలపై చర్యలు
-
కలెక్టర్ ఆర్ ముత్యాలరాజు
నెల్లూరు(పొగతోట): నకిలీ విత్తనాలు, ఎరువుల విక్రయదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆర్ ముత్యాలరాజు సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టర్ తన చాంబర్‌లో వ్యవసాయ శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నకిలీ విత్తనాలు, ఎరువులు మార్కెట్‌లోకి రాకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రైతుల అవసరాల మేరకు ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉంచాలని సూచించారు. విత్తనాలు, ఎరువులు బ్లాక్‌లో విక్రయించకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఏ మహమ్మద్‌ఇంతియాజ్, వ్యవసాయ శాఖ జేడీ హేమమహేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.
దోమలపై దండయాత్ర పుస్తకావిష్కరణ
దోమలపై దండయాత్ర–పరిసరాల పరిశుభ్రతపై ముద్రించిన పుస్తకాన్ని కలెక్టర్ ఆర్ ముత్యాలరాజు తన చాంబర్‌లో ఆవిష్కరించారు. పుస్తకాలను ఆశ వర్కర్లు, ఆరోగ్యకార్యకర్తలకు పంపిణీ చేసి దోమల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై ప్రజలకు అవగాహన కల్పించేలా చూడాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో జే సీ–2 రాజ్‌కుమార్, డీఎంఅండ్‌హెచ్‌ఓ డాక్టర్ వరసుందరం పాల్గొన్నారు.
స్మార్ట్ విలేజ్, వార్డు లక్ష్యాలను పూర్తి చేయండి
స్మార్ట్ విలేజ్, స్మార్ట్ వార్డు లక్ష్యాలను వంద శాతం సాధించేలా ప్రత్యేక చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆర్ ముత్యాలరాజు సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టర్ తన చాంబర్‌లో వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు దత్తత తీసుకున్న గ్రామాల్లో ప్రభుత్వ పరంగా చేయాల్సిన కార్యక్రమాలను పూర్తి చేయాలన్నారు. ప్రభుత్వ కార్యాలయాలు, ప్రాథమిక ఆరోగ్యకేంద్రాల్లో మరుగుదొడ్లు నిర్మించి పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. ఈ సమావేశంలో జెడ్పీ సీఈఓ రామిరెడ్డి, సీపీఓ మూర్తి పాల్గొన్నారు.