నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు
- పారిశుద్ధ్య పరిరక్షణపై కలెక్టర్ సీహెచ్ విజయమోహన్
- శానిటరీ ఇన్‌స్పెక్టర్లు, సిబ్బందితో సమావేశం
కర్నూలు(టౌన్): పారిశుద్ధ్యలోపం తలెత్తితే అందుకు బాధ్యలైన అధికారులు, సిబ్బందిపై కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ హెచ్చరించారు. విధి నిర్వహణలో అలసత్వం వహించి పారిశుద్ధ్యలోపం తలెత్తేందుకు కారణమైతే ఐపీసీ 408, 409 సెక‌్షన్ల ప్రకారం క్రిమినల్ కేసులు నమోదు చేయిస్తామన్నారు. ఇందుకు సంబంధించి శనివారం కలెక్టరేట్ మీటింగ్ హాలులో నగరపాలక ఆరోగ్యశాఖ అధికారులు, శానిటరీ ఇన్‌స్పెక్టర్లు, సిబ్బందితో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. పారిశుద్ధ్య సమస్యపై ఇటీవలి కాలంలో అనేక ఫిర్యాదులు వస్తున్నాయని తెలిపారు. శానిటరీ ఇన్‌స్పెక్టర్లు, మేస్త్రీలు, మున్సిపల్ కార్మికులు సీరియస్‌గా తీసుకొని మరింత బాధ్యతగా పనిచేయాలన్నారు.
ప్రతిరోజు రెండు పూటల పనులు చేపడుతున్నట్లు మస్టర్లలో దొంగ సంతకాలు చేస్తున్నట్లు తన దృష్టికి వచ్చిందని చెప్పిన కలెక్టర్.. ఇకపై పనులను తానే స్వయంగా పరిశీలిస్తానని తెలిపారు. సక్రమంగా పనులు చేస్తే అభినందిస్తానని చెప్పిన ఆయన పనులు సరిగా లేకుంటే మాత్రం చర్యలు తీవ్రంగా ఉంటాయన్నారు. వార్డులవారీగా శానిటేషన్ వివరాలు తన దృష్టికి తీసుకు రావాలన్నారు. ప్రజల ఆరోగ్యం కోసం దోమల నివారణపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో మున్సిపల్ కమిషనర్ ఎస్. రవీంద్రబాబు, ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ కల్యాణ చక్రవర్తి, పర్యావరణ ఇంజినీర్ బాలసుబ్రమాణ్యం, శానిటరీ సూపర్ వైజర్ మురళీకృష్ణ, శానిటరీ ఇన్‌స్పెక్టర్లు సి.వి. రమణ, నాగరాజు, శ్రీనివాసులు, రమేష్‌బాబు, సూపరింటెండెంట్ గంగాధర్ సిబ్బంది పాల్గొన్నారు.