నిర్లక్ష్యంపై విద్యార్థినుల ఆగ్రహం
నిర్లక్ష్యంపై విద్యార్థినుల ఆగ్రహం
Published Fri, Oct 7 2016 11:12 PM | Last Updated on Fri, Nov 9 2018 4:52 PM
- ప్రహరీ నిర్మించాలంటూ భారీ ధర్నా
- స్థలాన్ని కబ్జా చేస్తే ఊరుకోబోమంటూ హెచ్చరిక
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): నగరంలోని కేవీఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థినులు పిడికిలి బిగించారు. ప్రహరీ నిర్మాణంలో జాప్యాన్ని నిరసిస్తూ కళాశాల ఎదుట శుక్రవారం భారీ ధర్నా నిర్వహించారు. కళాశాలలో మైదాన స్థలాన్ని కబ్జా చేస్తున్నారని ఇలాగైతే న్యాక్‌గుర్తింపు లభించదని..వేల మంది విద్యార్థినులు నష్టపోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి చర్యలను చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. సుమారు రెండు గంటలపాటు విద్యార్థినులు.. న్యాయం కావాలి అంటూ నినాదాలు చేయడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..కళాశాల ప్రహరీ నిర్మాణ పనులను మధ్యలో నిలిపివేయడంతో తాగుబోతులు, తిరుగుబోతులు కళాశాలలోకి ప్రవేశిస్తున్నారన్నారు. కళాశాలలో మొత్తం రెండు వేల మంది విద్యార్థినులు వసతి పొందుతున్నారని..మునిసిపల్ అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని కళాశాల ప్రిన్సిపాల్ సీవీ రాజేశ్వరీ, వైస్ ప్రిన్సిపాల్ వీరాచారి, అధ్యాపకురాలు ఇందిరాశాంతి కోరారు. నిబంధనలు మేరకు రోడ్డుకు ఇరువైపులా ఆరు మీటర్ల వరకు రోడ్డును విస్తరించుకోవచ్చనని విద్యార్థులు తెలిపారు. దీన్ని మరచిన అధికారులు కళాశాల స్థలాన్ని 28 మీటర్ల వరకు ఓ ప్రజాప్రతినిధి అనుచరులకు కట్టబెట్టే ప్రయత్నంలో భాగంగానే పనులను నిలిపివేసినట్లు ఆరోపించారు. జూన్‌లో కూల్చిన ప్రహరీని నిర్మించకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. మునిసిపల్ అధికారులు నిబంధనలు మేరకు పనులను చేపట్టకపోతే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని విద్యార్థినులు హెచ్చరించారు.
Advertisement
Advertisement