బాబు సభకు విద్యార్థుల డుమ్మా
బాబు సభకు విద్యార్థుల డుమ్మా
Published Sun, Sep 25 2016 3:23 AM | Last Updated on Mon, Sep 4 2017 2:48 PM
– యువభేరికి పోటీగా ఏలూరులో సభపెట్టి భంగపడ్డ చంద్రబాబు
– అన్ని విద్యాసంస్థలకూ సెలవులు ఇచ్చినా విద్యార్థులు రాకపోవడంపై ఆగ్రహం
– సభలో విద్యార్థులు ఏరీ అంటూ ప్రశ్న
– సెలవు ఇచ్చింది విద్యార్థుల్ని ఇంటికి పంపడానికా అని నిలదీత
– ప్రభుత్వ విప్ చింతమనేని, మంత్రి సుజాతపై సీరియస్
– జనం కోసం బయటకు పరుగెత్తిన ప్రభాకర్
– వచ్చిన జనాల్ని వెళ్లిపోకుండా ఆపేందుకు నేతల పాట్లు
సాక్షి ప్రతినిధి, ఏలూరు :వైఎస్సార్ సీపీ అధినేత, ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఏలూరులో నిర్వహించిన యువభేరి కార్యక్రమానికి పోటీగా దోమల దండయాత్ర పేరిట సీఎం చంద్రబాబునాయుడు శనివారం ఏలూరులో సభ ఏర్పాటు చేసి భంగపడ్డారు. యువభేరి సదస్సుకు జిల్లా నలుమూలల నుంచి వేలాదిగా విద్యార్థులు తరలివచ్చి విజయవంతం చేసిన నేపథ్యంలో.. దోమల దండయాత్ర సభకు అందుకు దీటుగా పెద్దఎత్తున విద్యార్థుల్ని తరలించాలని ప్రజాప్రతినిధులు, అధికారులు, టీడీపీ నాయకులకు చంద్రబాబు ఆదేశాలిచ్చారు. ఇందుకోసం రాష్ట్రంలోని అన్ని పాఠశాలలకు సెలవు ప్రకటించారు. శనివారం నిర్వహించాల్సిన సమ్మెటివ్–1 పరీక్షను సైతం 29వ తేదీకి వాయిదా వేశారు.
ఇంతచేసినా కేవలం 300లోపు మాత్రమే విద్యార్థులు హాజరుకావడంతో చంద్రబాబు నిర్ఘాంతపోయారు. ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి పీతల సుజాతతోపాటు అధికారులపైనా ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘సభలో విద్యార్థులు ఏరీ. వాళ్లందరికీ సెలవు ఇచ్చింది ఇళ్లకు పంపడానికా’ అని చంద్రబాబు వారిని నిలదీశారు. తొలుత సీఆర్ రెడ్డి అటానమస్ కళాశాల మైదానం నుంచి సురేష్‌బహుగుణ పోలీస్ రిజర్వ్ స్కూల్ వరకూ ర్యాలీగా వచ్చిన సీఎం చంద్రబాబు.. ఆ పాఠశాల మైదానంలో ఏర్పాటు చేసిన సభా వేదిక వద్దకు చేరుకున్నారు. అప్పటికే ప్రాంగణంలోని కుర్చీలు ఖాళీ అయ్యాయి. సభలో విద్యార్థులు, ఇతర జనం లేకపోవటాన్ని చూసిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగ్రహంతో ఊగిపోయారు.
సభావేదిక పైనే ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్‌కు క్లాస్ తీసుకున్నారు. ‘రాష్ట్రంలో కోటిమంది విద్యార్థులకు సెలవులు ప్రకటించామంటే ఇళ్లకు పంపించమని కాదు. విద్యార్థులంతా ఎక్కడ ఉన్నారు. ఇంతమంది ఎమ్మెల్యేలు, మంత్రులు, అధికారులు ఉండి విద్యార్థులను ఎందుకు సమీకరించలేకపోయారు’ అంటూ సీఎం తీవ్ర అసంతప్తి వ్యక్తం చేశారు. మంత్రి పీతల సుజాతపైనా అసహనం వ్యక్తం చేశారు. సభా వేదికపై మంత్రి సుజాత మైక్ అందుకుని ‘రాష్ట్ర అభివద్ధి ప్రదాత.. మన ముఖ్యమంత్రి చంద్రబాబు’ అంటూ ప్రసంగించబోతుండగా ‘అన్ని మాటలు అవసరం లేదమ్మా. ఆపు. ఇక్కడ ముగ్గురు పిల్లలు మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నారు. వారితో మాట్లాడించు. నువ్వు ఇక ఆపమ్మా’ అంటూ అసహనాన్ని ప్రదర్శించారు.
– చింతమనేని పరుగులు
సీఎం చంద్రబాబు అగ్రహం వ్యక్తం చేయటంతో ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్ వెంటనే సభా ప్రాంగణం నుంచి బయటకు పరుగులు పెట్టారు. నగరంలోని రెండు జూనియర్ కళాశాలలు, సీఆర్‌ఆర్ మహిళా కళాశాల తీసుకొచ్చేందుకు ఆయా కళాశాలలకు వెళ్లారు. అప్పటికే సభా ప్రాంగణంలో ఉన్న కొద్దిపాటి జనం వెళ్లిపోవడాన్ని గమనించిన చంద్రబాబు తన ప్రసంగాన్ని మొదలుపెట్టారు. డ్వాక్రా మహిళలు సైతం దోమలపై దండయాత్ర మాకెందుకులే అనుకుంటూ మెల్లగా జారుకోవడం మొదలుపెట్టారు. సీఎం ప్రసంగం పూర్తయ్యే వరకూ చింతమనేని విద్యార్థుల్ని సమీకరించే పనిలో నిమగ్నమయ్యారు. పూర్తి చేసేవరకూ విద్యార్థులను సమీకరించే పనిలో విప్ చింతమనేని బిజీ అయ్యారు. దీంతో సభా ప్రాంగణం బయట చిరు వ్యాపారుల వద్ద ఉన్న శనక్కాయలు, సమోసాల బుట్టలను పార్టీ నాయకులు లోపలికి తీసుకొచ్చి మహిళలకు ఇస్తూ.. లోపలికి రావాలంటూ బతిమలాడారు. ఈ సన్నివేశాలను చూసి అక్కడ ఉన్నవారంతా నవ్వుకున్నారు.
– తాళ్లు కట్టి ఆపినా..
సభకు వచ్చిన విద్యార్థులు, మహిళలు, పార్టీ కార్యకర్తలు బయటకు వెళ్లిపోతుండటంతో టీడీపీ నాయకులు వారిని నిలువరించేందుకు నానాపాట్లు పడ్డారు. ప్రాంగణం నుంచి బయటకు వెళ్లే మార్గానికి అడ్డంగా తాళ్లు కట్టి విద్యార్థుల్ని ఆపేందుకు పోలీసులు, టీడీపీ నేతలు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. ‘కొద్దిసేపు ఉండండ్రా బాబూ.. సీఎం ప్రసంగం అయ్యాక వెళ్లిపోదురు’ అని బతిమాలినా విద్యార్థులు వినలేదు.
Advertisement
Advertisement