మోయలేని భారం
• పుస్తకాల బరువుతో అల్లాడుతున్న చిన్నారులు
• కార్పొరేట్, ప్రైవేట్ స్కూళ్ల విద్యార్థుల పరిస్థితి దయనీయం
• ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టని యాజమాన్యాలు
• పిల్లల ఎదుగుదలపై చెడు ఫలితాలంటున్న వైద్యులు
ఆహ్లాదంగా సాగాల్సిన చిన్నారుల చదువులు భారమైపోతున్నాయి. ‘చదువేమో చిన్నదాయో...మోతేమో గాడిదదాయే’ అన్న చందంగా ఉంది చిన్నారుల పరిస్థితి. కొన్ని ప్రై వేట్ పాఠశాలల యాజమాన్యాలు ప్రీస్కూల్ (ఎల్‌కేజీ, యూకేజీ)లోనే హోంవర్క్, డ్రాయింగ్ నోట్స్ ఇస్తూ కేజీల కొద్దీ బరువున్న పుస్తకాలను కట్టబెడుతున్నారు. వాటిని రోజూ స్కూళ్లకు మోసుకెళ్లేందుకు పిల్లలు నానా అవస్థలు పడుతున్నారు. ఎల్‌కేజీలోనే సుమారు 7 కేజీల బరువును మోయాల్సి వస్తోందంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో ఊహించుకోవచ్చు. బుడిబుడి అడుగులు వేస్తూ హాయిగా చదువుకోవాల్సిన పిల్లలను, పోటీతత్వం కారణంగా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు చదువు పేరుతో ఒత్తిడి పెంచుతున్నారు. బాధను బయటకు చెప్పుకోలేని చిన్నారులు లోలోన మదనపడుతున్నారు.
ఫథ్వీ... అనంతపురంలోని ఓ కార్పొరేట్ స్కూల్‌లో యూకేజీ చదువుతున్నాడు. ఈ చిన్నారి బరువు 14 కేజీలు. ఈ విద్యార్థి స్కూలు బ్యాగు బరువు 7 కేజీలు! ఆ పుస్తకాలను రోజూ ఇంటి నుంచి స్కూల్‌కు... స్కూల్ నుంచి ఇంటికి మోయడానికి పడుతున్న ఇబ్బందులు అన్నీఇన్నీ కావు. లాస్య ఓ ప్రైవేట్ స్కూల్‌లో నాల్గో తరగతి చదువుతోంది. పుస్తకాల బరువు మోయడం తన వల్లకాదని ఇంట్లో నిత్యం బోరున విలపిస్తోంది. దీంతో చిన్నారి తల్లి రోజూ ఆ పుస్తకాల బ్యాగును స్కూలుకు మోసుకెళ్తోంది. ఈ ఇద్దరే కాదు దాదాపు జిల్లా వ్యాప్తంగా ఉన్న కార్పొరేట్, ప్రైవేట్ విద్యా సంస్థల్లో చదువుతున్న విద్యార్థులందరి పరిస్థితి ఇదే. దేశంలోని 13 ఏళ్లలోపు పిల్లలు తమ సామర్థ్యానికి మించిన పుస్తకాల బరువులు మోస్తూ వెన్నునొప్పి, గూని తదితర సమస్యలు కొని తెచ్చుకుంటున్నారని ‘అసోచామ్’ తన నివేదికలో పేర్కొంది. ఇలా బాధపడే పిల్లలు దేశంలో ప్రతి వందలో 68 మంది ఉన్నారని నివేదికలో పేర్కొనడం గమనార్హం.
బరువెక్కుతున్న బ్యాగు
ప్రస్తుత పోటీ ప్రపంచంలో చదువులో విపరీతమైన పోటీ ఉంది. తమ స్కూలు ప్రథమ స్థానంలో ఉండాలని ఆయా యాజమాన్యాలు భావిస్తుండడంతో పిల్లలకు ఇక్కట్లు తప్పడం లేదు. దీంతో పుస్తకాల మోత పెరిగింది. ఫలితంగా ఎల్‌కేజీ, యూకేజీ నుంచే బస్తాలను తలపిస్తున్న బరువైన బ్యాగులతో బహుళ అంతస్తులు ఎక్కాల్సి వస్తోంది. తమ బాధలు ఎవరికీ చెప్పుకోలేక చిన్నారుల పడుతున్న వేదన వర్ణణాతీతం.
ఎముకలపై ప్రభావం
చాలామంది పిల్లలు బరువైన పుస్తకాల సంచులు మోస్తూ భుజాలు, వీపు నొప్పులతో బాధ పడుతున్నారు. పుస్తకాల సంచి భారం నేరుగా వెన్నుముకపైనే పడుతుంది. ఫలితంగా వెన్నముక వంకర పోవడం, నొప్పిరావడం జరుగుతుంది. ఈ సమస్య పెద్దయ్యాక కూడా అలానే ఉండే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుత ఆహారపు అలవాట్ల నేపథ్యంలో పిల్లలు పౌష్టికాహారం తీసుకోవడం తగ్గింది. ఎముకల్లో కాల్షియం శాతం తక్కువగా ఉంటోంది. దీంతో ఎముకలపై అధికబరువు ప్రభావం ఎక్కువగా చూపే అవకాశముందని చెబుతున్నారు.
ప్రత్యామ్నాయంపై దష్టి సారించని యాజమాన్యాలు
పిల్లలు అధికబరువులు మోయకుండా ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టడంలో యాజమాన్యాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి. రోజూ స్కూల్‌కు అధికబరువు మోయడం కంటే హోంవర్క్ పుస్తకాలు మాత్రమే ఇంటికి తీసుకెళ్లి మిగిలిన పుస్తకాలు ఆయా పాఠశాలల్లోనే లాకర్లు ఏర్పాటి చేసి భద్రపరిచేలా చర్యలు తీసుకుంటే ఈ బస్తా బరువుల నుంచి పిల్లలకు విముక్తి కలిగే అవకాశం ఉంది.
చాలా సమస్యలు
ఎదిగే వయసులో పిల్లలు అధిక బరువు మోస్తున్నారు. ఇది చాలా ప్రమాదం. ఎముకలు, కీళ్లు, వెన్నెముక, కండరాల సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. చిన్న వయసులోనే నడుం నొప్పులు వస్తాయి. త్వరగా అలసిపోతారు. ప్రధానంగా గూని వచ్చే ప్రమాదం ఉంది. 20 ఏళ్ల తర్వాత రావాల్సిన సమస్యలు పాఠశాల స్థాయిలోనే వచ్చే అవకాశం ఉంది.
– డాక్టర్ ప్రవీణ్ దీన్‌కుమార్, చిన్న పిల్లల వైద్య నిపుణులు