ఆమె ఏమైంది...?
మృతి చెందిందా? మరేమైంది?
lసౌదీ వెళ్లిన మహిళ జాడతెలియని వైనం
అయోమయంలో కుటుంబ సభ్యులు
కొత్తపేట:
ఉపాధి కోసం సౌదీ వెళ్లిన మహిళ ఏమైందో? ఎక్కడుందో తెలియక కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. రెవెన్యూ అధికారులు ఆమె చనిపోయిందని తెలిపారు. అయితే రెండు నెలలైనప్పటికీ ఆమె మృతదేహం ఇంటికి చేరలేదు. ఏజెంట్ ఆమె ఇండియాకు వచ్చేసినట్టు తహసీల్దార్‌కు తెలిపాడు. కానీ ఆమె ఇంటికి రాలేదు. ఆమె భర్త అర్జునరావు, అదే గ్రామానికి చెందిన మండల ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు ములగలేటి బంగారం బుధ వారం తెలిపిన వివరాల ప్రకా రం కొత్తపేట శివారు రామారావుపేటకు చెందిన కముజు విమల జీవనోపాధి కోసం గల్ఫ్ దేశం వెళ్లాలని నిర్ణయించుకోగా ఆ భార్యాభర్తలు పశ్చిమగోదావరి జిల్లా పెరవలి మండలం కంకిపాడుకు చెందిన ఒక ఏజెంట్‌ను సంప్రదించారు. అతని ద్వారా గత ఏడాది జూన్ 15వ తేదీన విమల సౌదీ వెళ్లింది. 6 నెలల పాటు భర్తకు సక్రమంగానే జీతాల సొమ్ము పంపించింది.తరువాత నుంచి ఏమైందో ఏమో కానీ డబ్బులు రాలేదు. దానిపై అర్జునరావు విమల పనిచేసే ఇంటి యజమానికి ఫోన్‌చేసి అడగ్గా నీభార్య మాకు పనిచేయదు. ఆమెను రేపు ఇండియాకు పంపించేస్తున్నామని సమాధానం చెప్పారు. కానీ వారం రోజులు గడచినప్పటికీ విమల రాలేదు. దాంతో మరలా ఫోన్ చేయగా సౌదీ విమానాశ్రయంలో వదిలేశామని ఒకసారి, ముంబాయికి టికెట్టు తీసి పంపించామని మరోసారి పొంతనలేని సమాధానం చెప్పారు. దాంతో విమలను సౌదీ పంపించిన ఏజెంట్‌ను నిలదీయగా సరైన సమాధానం చెప్పలేదు. ఇదిలా ఉండగా ఈ నెల 2వ తేదీన స్థానిక తహసీల్దార్ ఎన్. శ్రీధర్ సిబ్బందితో కలిసి అర్జునరావు ఇంటికి వచ్చి కముజు విమల మృతదేహం వచ్చిందా? అని ప్రశ్నించారు. దాంతో అర్జునరావు, అతని కుటుంబ సభ్యులు దిగ్భ్రాంతికి గురయ్యారు. అసలు ఏమైంది సార్ అని వివరాలు అడగ్గా ‘కలెక్టర్ నుంచి మెసేజ్ వచ్చింది. విచారణకు వచ్చాం’ అని చెప్పారు. ఆమె వివరాలను సేకరించుకొని వెళ్లారు. ఎమ్మార్పీఎస్ నాయకుల ఫిర్యాదు మేరకు ఈ నెల 6వ తేదీన తహసీల్దార్ శ్రీధర్ ఏజెంట్‌ను రప్పించి ఎమ్మార్పీఎస్ నాయకుల సమక్షంలో ఆరా తీయగా ఏమైందో తనకూ తెలియదని, వారం రోజుల్లో వివరాలు తెలుసుకుని తెలియజేస్తానని హామీ ఇచ్చాడు. కానీ ఇంతవరకూ ఏ వివరమూ చెప్పలేదు. ఆమె ఎక్కడుంది? బతికుందా? లేక చనిపోయిందా? చనిపోతే మృతదేహం ఎక్కడ? సరైన సమాచారం అందజేసి లేదా ఆమె మృతదేహం ఎక్కడుందో విచారించి తగు న్యాయం చేయాలని ఆమె కుటుంబ సభ్యులు కోరారు.
తహసీల్దార్ వివరణ
ఈ విషయంపై తహసీల్దార్ శ్రీధర్‌ను ‘సాక్షి’ వివరణ కోరగా తమకు కలెక్టర్ నుంచి వచ్చిన సమాచారం మేరకు ఆమె వివరాలు తీసుకుని కలెక్టర్‌కు నివేదించామన్నారు. ఏజెంట్‌ను ఆరా తీయగా సౌదీ నుంచి వచ్చేసిందని తెలిపాడన్నారు. విమల కుటుంబ సభ్యులతో మాట్లాడతానని చెప్పాడన్నారు.