నగదు కోసం ఆత్మహత్యయత్నం
పారుమంచాల(జూపాడుబంగ్లా): వారం రోజుల్లో కుమారుడు పెళ్లి ఉందంటూ బ్రతిమలాడినా నగదు ఇచ్చేందుకు ఏపీజీబీ పారుమంచాల బ్రాంచి మేనేజర్ నిరాకరించాడు. చివరకు బాధితుడు ఆత్మహత్యకు ప్రయత్నించగా కంగారు పడి డబ్బులు ఇచ్చి పంపించాడు. తూడి చెర్లకు చెందిన నల్లబోతుల పుల్లయ్య ధాన్యం విక్రయించగా రూ.70వేలు చేతికందింది. పాతనోట్లు చెల్లవని చెప్పడంతో తన ఖాతాలో రూ.35వేలు, భార్య వెంకటేశ్వరమ్మ ఖాతాలో రూ.35వేలు జమచేసుకున్నాడు. వచ్చే నెల 1తేదీన అతని పెద్దకుమారుడు పెద్దస్వామన్న పెళ్లి ఉండడంతో పుల్లయ్య దంపతులు మంగళవారం ఉదయాన్నే వెళ్లి రూ. 50వేలు ఇవ్వాలని కోరగా రూ. 2500 మించి ఇచ్చేందుకు బ్యాంకు మేనేజర్ బాలయ్య అంగీకరించలేదు. దీంతో మనస్థాపానికి గురైన పుల్లయ్య బ్యాంకు ఎదుటే పురుగు మందుతాగి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. దీంతో సాయంత్రం 3గంటలకు రూ.50వేల నగదు ఇచ్చి పంపించాడు. కేంద్రప్రభుత్వం జారీచేసిన ఆదేశాలేవీ తమకందలేదని, పై అధికారుల ఆదేశాలను మాత్రమే పాటిస్తున్నామని మేనేజర్ వివరణ ఇచ్చారు.