♦ పీఏలుగా కొనసాగడంపై సుప్రీంకోర్టు ఆగ్రహం
♦ జిల్లాలో ఏడుగురు ఉపాధ్యాయులు
నిజామాబాద్ అర్బన్ : పాఠశాలల్లో చదువు చెప్పాల్సిన ఉపాధ్యాయులు కొన్నేళ్లుగా ప్రజాప్రతినిధులకు పర్సనల్ అసిస్టెంట్స్(పీఏ)గా కొనసాగడంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. వీరిని పీఏలుగా తొలగించాలని తెలంగాణ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణ ఫ్యారేన్స్ ఫెడరేషన్ తరఫున సాగర్‌రావు సుప్రీంకోర్టులో ఉపాధ్యాయులు ప్రజాప్రతినిధుల వద్ద పీఏలుగా కొనసాగడంపై వ్యాజ్యం వేశారు. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది. దీంతో జిల్లాలో పీఏలుగా కొనసాగుతున్న వారి వివరాలను పాఠశాల విద్యాశాఖ డెరైక్టర్ ఆయా జిల్లాల నుంచి నివేదికలు అడిగారు.
ఇందులో భాగంగా జిల్లాలో ఏడుగురు ఉపాధ్యాయులు ప్రజాప్రతినిధుల వద్ద పీఏలుగా కొనసాగుతున్నారని విద్యాశాఖ గుర్తించింది. రెండేళ్ల కిందట ఉపాధ్యాయులు బడిబాట పంటాల్సిందేనని.. పీఏలుగా కొనసాగవద్దని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయగా మంత్రులు అడ్డుకున్నారు. మళ్లీ ప్రస్తుతం సుప్రీంకోర్టు ఈ వ్యవహారంపై మండిపడటంతో ప్రజాప్రతినిధులు వద్ద ఉన్న ఉపాధ్యాయులు పాఠశాలల బాటపట్టడం ఖాయమైపోయింది.
జిల్లాలో ఏడుగురు..
జిల్లాలో ఐదుగురు ఎమ్మెల్యేల వద్ద, ఇద్దరు ఎమ్మెల్సీల వద్ద పీఏలుగా కొనసాగుతున్నారు. ఇందులో సంవత్సరాల తరబడి ప్రజాప్రతినిధులుగా కొనసాగుతున్న వారి వద్ద పీఏలుగా కొనసాగడం గమనార్హం. వీరు ఎమ్మెల్యేల వద్ద పీఏలుగా కొనసాగుతూ.. వారు ఓడిపోతే మరో గెలిచిన ఎమ్మెల్యే వద్ద పీఏలుగా చేరుతూ కాలం వెళ్లదీస్తున్నారు. పాఠశాలలకు వెళ్లకుండా విద్యాబోధనకు దూరంగా ఉంటున్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న వారిలో బోధన్, బాన్సువాడ, తాడ్వాయి, కామారెడ్డి, గాంధారి మండలాల పాఠశాలలకు చెందిన ఉపాధ్యాయులు ఉన్నారు. ఇక్కడ విద్యాబోధన ఎంతో అత్యవసరం. టీచర్ల కొరత ఉండి విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. టీచర్లు తప్పనిసరిగా అందుబాటులో ఉండాల్సిన ప్రాంతాలు ఇవి. కానీ.. ఏళ్ల తరబడి అందుబాటులో లేరు. డిప్యూటేషన్‌పై ప్రజాప్రతినిధుల వద్ద పీఏలుగా కొనసాగుతున్నారు.