- ట్రంక్‌బాక్స్‌ల్లో అవినీతి ఫలితం!
- తప్పించేందుకు ప్రయత్నం?
బీసీ సంక్షేమ శాఖ అధికారిపై వేటు?
Published Tue, Aug 9 2016 9:16 PM | Last Updated on Sat, Sep 22 2018 8:31 PM
కరీంనగర్ సిటీ : ట్రంక్‌బాక్స్‌ల్లో అక్రమాలకు పాల్పడిన బీసీ సంక్షేమ శాఖకు చెందిన ఓ పర్యవేక్షణ స్థాయి అధికారిపై వేటు పడినట్లు సమాచారం. సదరు అధికారిని సస్పెండ్‌చేస్తూ ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకున్నారని, సెలవులో ఉన్న కలెక్టర్ తిరిగి రాగానే సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేస్తారని సమాచారం.
ఇదీ కారణం...
బీసీ సంక్షేమ శాఖకు చెందిన సదరు అధికారి ట్రంక్‌బాక్స్‌ల్లో అక్రమాలకు పాల్పడుతున్నాడనే అభియోగాలున్నాయి. ఇటీవల బీసీ హాస్టల్ విద్యార్థులకు 3706 ట్రంక్‌బాక్స్‌లు వచ్చాయి. 24 గేజ్‌తో ఉన్న ఒక్కో పెట్టె రూ.436 చొప్పున సరఫరా చేసేందుకు వరంగల్‌కు చెందిన కాంట్రాక్టర్ టెండర్ దక్కించుకున్నాడు. సరఫరా చేసిన ట్రంక్‌బాక్స్‌ల్లో నాసిరకంవి ఉన్నాయని, కలెక్టరేట్ సాక్షిగా కాంట్రాక్టర్ నుంచి సదరు అధికారి డబ్బులు తీసుకోవడంపై ‘సాక్షి’లో వరుస కథనాలు వచ్చాయి. స్పందించిన అధికారులు విచారణకు ఆదేశించి నాలుగు రోజుల పాటు బాక్స్‌ల గేజ్‌ను తూకం వేశారు. అధికారికంగానే 513 బాక్స్‌లు నాసిరకం వచ్చాయని తేల్చారు. ట్రంక్‌బాక్స్‌ల అక్రమాలకు కారణమైన సదరు అధికారి, గతంలో సెక్షన్ క్లర్క్‌గా ఉన్న సమయంలోనూ బాక్స్‌ల సరఫరాలో అవినీతికి పాల్పడినట్లు ఆరోపణలున్నాయి. అప్పుటి అవినీతి ఫలితంగా ఆ సమయంలో పనిచేసిన డీబీసీబ్ల్యూవో రిటైర్డ్ అయినా ఇప్పటికీ పింఛన్ రావడం లేదు. ఈ మొత్తం వ్యవహారానికి బాధ్యుడైన సదరు అధికారిపై పూర్తిస్థాయి నివేదిక ఆధారంగా సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
తప్పించేందుకు ప్రయత్నం?
ట్రంక్‌బాక్స్‌ల్లో అక్రమాలకు పాల్పడిన అధికారిని సస్పెన్షన్ నుంచి తప్పించేందుకు ప్రయత్నిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. కలెక్టర్ తిరిగి రాగానే ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉండడంతో ఆ లోగానే అప్పీల్ పేరుతో శిక్ష తీవ్రతను తగ్గించేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయని సమాచారం. దీనికోసం కొంతమంది అధికారులతో పలువురు సంఘ నాయకులు చర్చించినట్లు వినికిడి. శిక్ష ఖాయమని, కనిష్టంగా ఇంక్రిమెంట్లలో కోత, గరిష్టంగా సస్పెన్షన్, క్రిమినల్ కేసు నమోదు చేసే అవకాశముందని ఉన్నతాధికారులు ఆఫ్ ది రికార్డుగా వెల్లడించడం విశేషం.
Advertisement
Advertisement