విద్యుత్ శాఖ తీరుపై అనుమానాలు | Suspicions over the electrical department | Sakshi
Sakshi News home page

విద్యుత్ శాఖ తీరుపై అనుమానాలు

Published Sun, Nov 22 2015 3:32 AM | Last Updated on Mon, Jul 29 2019 2:51 PM

విద్యుత్ శాఖ తీరుపై అనుమానాలు - Sakshi

విద్యుత్ శాఖ తీరుపై అనుమానాలు

తప్పు చేస్తున్నారనే అభిప్రాయం కలుగుతోంది: కోదండరాం
కప్పిపుచ్చుకోడానికి ఎదుటివారి నోరు మూయించడం సరికాదు
 మీడియాతో మాట్లాడొద్దన్న ట్రాన్స్‌కో సర్క్యులర్ రాజ్యాంగ విరుద్ధం
 సర్వీరు రూల్స్ పేరుతో ఉద్యోగుల హక్కులను హరించడం తగదు
 ‘సాక్షి’ ప్రత్యేక ఇంటర్వ్యూలో వ్యాఖ్యలు
 
 సాక్షి, హైదరాబాద్: ‘‘ఛత్తీస్‌గఢ్‌తో విద్యుత్ కొనుగోలు ఒప్పందంపై చర్చ జరుగుతున్న ఈ సందర్భంలో ఉద్యోగులపై క్రమశిక్షణ చర్యల నిబంధనలను పునరుద్ధరించడం సమంజసం కాదు. తద్వారా విద్యుత్ శాఖ ఏదో తప్పు చేసిందని, దాన్ని కప్పిపుచ్చుకునేందుకు నోరు మూయించజూస్తోందనే అభిప్రాయం కలుగుతోంది. ఇది చాలా అన్యాయమైన పద్ధతి. విద్యుత్ ఉద్యోగులు మీడియాతో మాట్లాడొద్దనే సర్క్యులర్ ఏ పరిస్థితుల్లో తెచ్చారో అందరికీ అర్థమవుతూనే ఉంది’’ అని తెలంగాణ రాజకీయ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం అభిప్రాయపడ్డారు. తెలంగాణ విద్యుత్ రంగంలో ఇటీవలి పరిణామాలపై ‘సాక్షి’కి ఆయన ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. వివరాలు...
 
 ఉద్యోగులు మీడియాతో మాట్లాడొద్దన్న ట్రాన్స్‌కో సర్క్యులర్‌పై టీజేఏసీ స్పందన ఏమిటి?
 బ్రిటిష్, నిజాం కాలపు సర్వీసు రూల్స్‌నే ఇంకా అమలు చేస్తున్నారు. కానీ ప్రస్తుత సందర్భంలో సర్వీసు రూల్స్‌ను పక్కనపెట్టి రాజ్యాంగం ప్రకారమే నడచుకోవాలి. సర్వీసు రూల్స్ పేరుతో పౌరుల హక్కులను కుదించడానికి వీల్లేదని సుప్రీంకోర్టు పలు సందర్భాల్లో పేర్కొంది. హక్కులను ఉపయోగించుకునే పరిస్థితి లేకుంటే ప్రజాస్వామ్య వ్యవస్థగా నిలబడలేం. రాజ్యాంగం కల్పించిన హక్కులను ఉపయోగించుకునే కదా తెలంగాణ సాధన కోసం పోరాడినం. ఆ హక్కుల వల్లే తెలంగాణ సాధ్యమైంది. అవసరమైనప్పుడు ప్రభుత్వ విధానాలను ప్రశ్నిస్తాం.
 
 ఉద్యోగులు ఈఆర్‌సీకి వెళ్లడం తప్పా?
 అదీ రాజ్యాంగబద్ధమైన సంస్థే. వారు ఈఆర్‌సీకి వెళ్లడం విద్యుత్ సంస్థలకే ప్రయోజనకరం. బాధ్యత గల ఉద్యోగి ఎవరైనా అదే చేయాలి. ఒప్పందంలో తప్పులుంటే దిద్దుకోడానికి అవకాశముంటది. ఈఆర్‌సీకి వెళ్లడాన్ని తప్పుబట్టడం చాలా అన్యాయం. దీనిపై జేఏసీలో చర్చిస్తాం. ఇలా చేయాల్సింది కాదని ట్రాన్స్‌కో సీఎండీతో మాట్లాడుతాం. అధికారుల స్పందన అనంతరం భావి కార్యాచరణ రూపొందిస్తాం.
 
 ఛత్తీస్ పీపీఏపై ఈఆర్‌సీలో పిటిషన్ వేసిన విద్యుత్ రంగ నిపుణుడు, ట్రాన్స్‌కో ఇంజనీర్  కె.రఘును ప్రభుత్వం హైదరాబాద్ నుంచి వరంగల్‌కు బదిలీ చేసింది!
 
 ఈఆర్‌సీకి వెళ్లినందుకు సత్కరించాల్సింది పోయి ఇలా వేధించడం దుష్ట సంప్రదాయమ ని భావిస్తున్నాం. ఉమ్మడి రాష్ట్రంలోనూ ఉద్యోగులు ఎన్నోసార్లు ఈఆర్‌సీకి వెళ్లారు. ఎన్నడూ ప్రభుత్వాలు అక్షేపించలేదు. ఆక్షేపించినా మేం తిప్పికొట్టాం. ఈఆర్‌సీని ఏర్పాటు చేసిందే ప్రభుత్వ నిర్ణయాలపై సమీక్ష కోసం!
 
 తెలంగాణ వచ్చాక టీజేఏసీ వ్యూహాత్మక మౌనం పాటిస్తోందా? ఎందుకు?
 అదేమీ లేదు. ఏ కీలక సమస్య మీదా మేం మౌనంగా లేము. హైకోర్టు, ఉద్యోగుల విభజన వంటి అన్ని సమస్యలపై స్పందించాం.
 జేఏసీలో చురుకుదనం లోపించిందా? ప్రభుత్వానికి కొంత సమయం ఇద్దామని భావిస్తున్నారా?
 మీ ప్రశ్న ‘కాసేపు ఊపిరి పీల్చుకోవడం ఆపుతారా?’ అన్నట్టుంది. హక్కులు, అస్తిత్వం కోసం జరిగే పోరాటాలకు విరామముండదు. జేఏసీ అన్ని కార్యక్రమాలనూ కొనసాగిస్తుంది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement