
వాకింగ్ చేసి వస్తానని..
‘అమ్మా.. ఇంకో రౌండ్ వాకింగ్ చేసి ఇంటికి వస్తాను’ అని చెప్పిన ఓ యువకుడు 15 రోజుల తర్వాత గుర్తుపట్టలేని విధంగా శవమై తేలాడు.
⇒ గుర్తుపట్టలేని విధంగా శవమై తేలిన యువకుడు
⇒ మున్సిపల్ తాగునీటి ట్యాంక్‌లో ఐఐటీ విద్యార్థి అనుమానాస్పద మృతి
⇒ పదిహేను రోజులుగా మృతదేహం కుళ్లిన నీటినే తాగునీటిగా సరఫరా
⇒ కంగుతిన్న పట్టణ ప్రజలు
కావలి : ‘అమ్మా.. ఇంకో రౌండ్ వాకింగ్ చేసి ఇంటికి వస్తాను’ అని చెప్పిన ఓ యువకుడు 15 రోజుల తర్వాత గుర్తుపట్టలేని విధంగా శవమై తేలాడు. పట్టణ ప్రజలకు తాగునీటిని సరఫరా చేసే మున్సిపల్ ఓవర్ హెడ్ ట్యాంక్‌లో ఐఐటీ విద్యార్థి అనుమానా స్పదస్థితిలో మృతి చెందాడు. ఈ ఘటన శుక్రవారం వెలుగు చూసింది. మర్రిపాడు మండలం పొంగూరు కండ్రిగ గ్రామానికి చెందిన మండవ వెంకట రమణయ్య కుటుంబం కావలి పట్టణంలోని కచ్చేరిమిట్టలో శ్రీ వెంకటేశ్వరస్వామి గుడి పక్కనే నివాసం ఉంటుది. ఆయన కలిగిరి మండలం కుమ్మరకొండూరు జిల్లా పరిషత్ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా, ఆయన సతీమణి రజని జలదంకి మండలం తొమ్మిదో మైలు మండల పరిషత్ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పని చేస్తున్నారు.
వారి కుమారుడైన మండవ సతీష్ (22) పశ్చిమ బెంగాల్‌లోని ఖరగ్‌పూర్‌లో ఉన్న ఐఐటీలో బీటెక్ మెకానికల్ బ్రాంచ్ ఫైనలియర్ చదవుతున్నాడు. మూడో సంవత్సరం ప్రాక్టికల్స్‌లో ఫెయిల్ అయ్యాడు. ఈ క్రమంలో ఐఐటీ కళాశాల ప్రాంగణంలోని సహచర హాస్టల్ విద్యార్థులతో తలెత్తిన మనస్పర్థలతో మనస్థాపానికి గురై జనవరి 11న ఇంటికి వచ్చేశాడు. మానసికంగా ఇబ్బంది పడుతుండటంతో అతన్ని తల్లిదండ్రులు తిరుపతికి తీసుకెళ్లి వైద్యం చేయిస్తున్నారు.
15 రోజుల క్రితం అదృశ్యం
ప్రతి రోజు రైల్వేస్టేషన్ ప్లాట్‌ఫాంపై వాకింగ్ చేస్తున్న సతీష్ ఫిబ్రవరి 17న వాకింగ్ కోసం బయటకు వచ్చాడు. చాలా సమయం అయినా ఇంటికి రాకపోవడంతో తల్లి రజని కుమారుడికి ఫోన్ చేసినా లిఫ్ట్ చేయలేదు. మళ్లీ సతీష్ తల్లికి ఫోన్ చేసి ఇంకో రౌండ్ వాకింగ్ చేసి వస్తానని చెప్పాడు. కొద్దిసేపటి తర్వాత తల్లి ఎన్నిసార్లు ఫోన్‌చేసినా రింగ్ అవుతున్నా.. లిఫ్ట్ చేయలేదు. దీంతో తండ్రి వెంకట రమణయ్య రెండో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మిస్సింగ్ కేసు నమోదు చేసి అతని కోసం గాలిస్తున్నారు.
తాగునీటి సరఫరా కాకపోవడంతో..
స్థానిక కో ఆపరేటివ్ కాలనీలో ఉన్న మున్సిపాలిటీ ఓవర్‌హెడ్ ట్యాంకు నుంచి ప్రజలకు తాగునీరు అందుతుంది. శుక్రవారం తమకు కుళాయిలకు తాగునీరు రావడం లేదని ప్రజలు మున్సిపల్ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో వాటర్ వర్క్స్ సిబ్బంది అన్ని పరిశీలించి చివరగా ట్యాంకు లోపల పరిశీలించారు. పైపు లైన్‌కు నీరు విడుదలయ్యే ట్యాంకు లోపలి భాగం వద్ద కూర్చున్న స్థితిలో ఉన్న మృతదేహాన్ని గుర్తించారు. ఈ మేరకు మున్సిపల్ కమిషనర్, పోలీసులకు తెలియజేశారు కావలి అగ్నిమాపకశాఖాధికారి వి.శ్రీనివాసులురెడ్డి పరిశీలించారు. మున్సిపల్ కార్మికులతో ట్యాంక్ నీటిలో కుళ్లి ఛిద్రమైన స్థితిలో ఉన్న మృతదేహాన్ని వెలికి తీసి అతికష్టం మీద కిందకు దించారు. రెండు వారాల క్రితం మిస్సింగ్ కేసు నమోదై ఉండటంతో, ఆ కేసుకు సంబంధించిన మండవ వెంకట రమణయ్యను అక్కడికి పిలిపించి ఆనవాళ్లు గుర్తించమని పోలీసులు చెప్పారు. ఈ మృతదేహం తన కుమారుడిదేనని ఆయన గుర్తించి బోరున విలపించారు.
పదిహేను రోజులుగా శవం కుళ్లిన నీరే సరఫరా
అయితే నీటి ట్యాంక్‌లో మృతదేహం పడి ఉన్న విషయాన్ని వాటర్ వర్క్ సిబ్బంది గుర్తించకపోవడంతో ఇన్ని రోజులు ఈ ట్యాంక్ పరిధిలోని పట్టణ ప్రజలకు తాగునీటిగా సరఫరా చేశారు. మృతదేహం కుళ్లిన నీటిని తాము పదిహేను రోజులు వాడుకున్నామని తెలిసిన సమీప ప్రాంత ప్రజలు ఒక్కసారి ఖంగుతిన్నారు. ఈ విషయం పట్టణంలో సంచలనం సృష్టించింది.
మా అబ్బాయిని చంపేశారు
మా అబ్బాయి సతీష్‌ను హత్య చేశారని, దీని వెనుక బలమైన మిస్టరీ ఉందని, ఎవరో కావాలని చంపేశారని తల్లిదండ్రులు వెంకట రమణ, రజని విలేకరుల వద్ద రోదించారు. పోలీసులు దీనిపై సమగ్రంగా దర్యాప్తు చేసి నిజాలను వెలికి తీయాలని వారు విజ్ఞప్తి చేశారు.