జూ పార్కు లో విలీనం చేయబోయే మేకలబండ కొండలు
ఎస్వీ జూ పార్కు పరిధి పెంపు
Published Thu, Jul 28 2016 7:06 PM | Last Updated on Mon, Sep 4 2017 6:46 AM
– త్వరలో మేకలబండ కొండలు విలీనం
– ఈ కొండల విస్తీర్ణం 200 హెక్టార్లు
– తాజాగా 1200 హెక్టార్ల మాస్టర్‌ప్లాన్ లే అవుట్‌కు ప్రతిపాదనలు
– సందర్శకుల కోసం ట్రెక్కింగ్ పాయింట్లు, వాచ్ టవర్
సాక్షి ప్రతినిధి, తిరుపతి : తిరుపతి శ్రీ వెంకటేశ్వర జూలాజికల్ పార్కు పరిధి పెరగనుంది. పార్కుకు ఉత్తరాన 200 హెక్టార్ల విస్తీర్ణంలో ఉన్న మేకలబండ కొండ ప్రాంతాన్ని కూడా పార్కులో విలీనం చేయనున్నారు. ఇందుకోసం అటవీ శాఖ ఏర్పాట్లన్నీ పూర్తి చేసింది. సెంట్రల్ జూ అథారిటీ నుంచి అనుమతి రాగానే మేకలబండ కొండల చుట్టూ హద్దులు ఖరారు చేసేందుకు జూలాజికల్ పార్కు అధికారులు సిద్ధంగా ఉన్నారు.
ఇక్కడున్న ఎస్వీ జూ పార్కు ప్రస్తుతం 289 హెక్టార్ల విస్తీర్ణంలో ఉంది. మొదట్లో ఈ మేరకు మాస్టర్‌ప్లాన్‌కు అప్రూవల్ లభించింది. ప్రస్తుతం దీని పరిధి భాగా పెరిగింది. పార్కుకు దక్షిణాన ఉన్న లక్ష్మీపురం గ్రామం నుంచి కాలిబాటన వెళ్లి మేకలబండ కొండల్లోకి ప్రవేశిస్తోన్న ఎర్రస్మగ్లర్లు, కూలీలు సులువుగా శేషాచలంలోకి చొరబడుతున్నారు. వీరి చొరబాటును అరికట్టాలంటే ఇక్కడున్న మేకలబండ కొండల ప్రాంతాన్ని పూర్తిగా పోలీసుల పర్యవేక్షణకు అనువుగా మార్చుకోవాలి. ఈ దిశగా ఆలోచించిన అటవీ, జూ పార్కు అధికారులు మేకలబండను జూ పార్కు పరిధిలో విలీనం చేయాలని నిర్ణయించుకున్నారు. ప్రస్తుతం పెరిగిన పరిధిని దృష్టిలో పెట్టుకుని మొత్తం 1200 హెక్టార్ల విస్తీర్ణంలో మాస్టర్ ప్లాన్ లే అవుట్ ప్రతిపాదనలు తయారు చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపారు. అక్కడి జూ అథారిటీ ఉన్నతాధికారుల నుంచి అధికారికంగా అనుమతులు రాగానే మేకలబండ కొండ ప్రాంతంలో ప్రత్యేక అభివద్ధి పనులు చేపడతామని అటవీ శాఖ చీఫ్ కన్సర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ పీవీ చలపతిరావు పేర్కొన్నారు.
సందర్శకుల కోసం అభివృద్ధి...
త్వరలో మేకలబండ కొండల ప్రాంతాన్ని జూ పార్కులో విలీనం చేయనున్నాం. ఆ తరువాత పార్కులోకి ప్రవేశించే సందర్శకుల కోసం అక్కడ ట్రెక్కింగ్ పాయింట్లు ఏర్పాటు చేయనున్నాం. కొండ మీదకు వెళ్లి విశ్రాంతి తీసుకునేందుకు వీలుగా రెస్ట్‌రూములు ఏర్పాటు చేస్తాం. అంతేకాకుండా భారీ వాచ్ టవర్ నిర్మించనున్నాం. కొండ మీద పార్కు మొత్తం వీక్షించేలా వ్యూపాయింట్‌ను ఏర్పాటు చేయనున్నాం. కొండల చుట్టూ ప్రహరీ నిర్మించి బయటి వారు లోనికి చొరబడకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటాం. జూ పార్కు విస్తీర్ణం పెరిగితే ఎక్కువ మొత్తంలో సఫారీలు ఏర్పాటు చేయడానికి వీలువుతుంది.
– వై. శ్రీనివాసులరెడ్డి, క్యూరేటర్, ఎస్వీ జూపార్కు, తిరుపతి
Advertisement
Advertisement