తిరుమల: బుల్లితెరపై ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో విశేష ఆదరణ పొందిన శ్రీవేంకటేశ్వర భక్తి చానల్ ప్రత్యేకంగా తమిళ భాషలో కనిపించనుంది. ప్రస్తుతం తెలుగు ఛానల్‌లోనే తమిళం,కన్నడం కార్యక్రమాలను ప్రసారం చేస్తున్నారు. శ్రీవారి దర్శనం కోసం వచ్చేవారిలో 45 శాతం తమిళ భక్తులు, 20శాతం కన్నడ భక్తులు ఉంటున్నారు.
ఒకవైపు తెలుగు ఛానల్‌లో ఇతర భాషా కార్యక్రమాలు చేయటం సరికాదనే డిమాండ్.. మరోవైపు తమిళ, కన్నడ భక్తుల నుండి తమ భాషలకు కూడా ప్రాధాన్యతను ఇవ్వాలనే విజ్ఞప్తులు పెరిగాయి. దీంతో వీరికోసం ప్రత్యేకంగా తమిళంలోనే ఎస్వీబీసీ కార్యక్రమాలు ప్రసారం చేయాలని రెండేళ్ల కిందట టీటీడీ నిర్ణయించింది. ఆ మేరకు ఢిల్లీలోని సమాచార, బ్రాడ్ కాస్టింగ్ మంత్రిత్వశాఖకు దరఖాస్తు చేసుకుంది. అనుమతుల అనంతరం తమిళం, కన్నడ భాషలకు సంబంధించిన భక్తి కార్యక్రమాలను ప్రసారం చేయనున్నారు.