– పేరుకు మాత్రమే బహిరంగ మల విసర్జన రహిత మునిసిపాలిటీలు
– క్షేత్రస్థాయిలో కనిపించని మార్పు
– కనిపించని మరుగుదొడ్లు
అనంతపురం న్యూసిటీ : జిల్లాలో ఈ నెల 2 నాటికి అన్ని మునిసిపాలిటీలను బహిరంగ మల విసర్జన రహిత(ఓడీఎఫ్ ఫ్రీ)ంగా తీర్చి దిద్దుతామని అధికారులు ప్రకటించారు. క్షేత్రస్థాయిలో ఈ పరిస్థితి లేదు. జిల్లాలోని అధిక మునిసిపాలిటీల్లో ఇప్పటికీ మహిళలు, చిన్నారులు బహిర్భూమికి ఆరుబయటకు వెళ్లే దుస్థితి ఉంది.
కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛభారత్ పేరిట వ్యక్తిగత, సామూహిక మరుగుదొడ్లు నిర్మించాలని ఆదేశించింది. వాస్తవంగా 2019 డిసెంబర్‌కల్లా బహిరంగ మల విసర్జన రహితం చేయాలని నిర్ణయించారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది అక్టోబర్ 2 నాటికి లక్ష్యాన్ని సాధిస్తామని ప్రకటించింది. జిల్లాలో తాడిపత్రి మునిసిపాలిటీ మాత్రమే 100 శాతం లక్ష్యానికి చేరుకుంది. ఇక అనంతపురం, ధర్మవరం, కళ్యాణదుర్గం, గుంతకల్లు, హిందూపురం, కదిరి, తదితర మునిసిపాలిటీల్లో పూర్తి స్థాయిలో మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టలేదు.
నగరంలోనే అధ్వానం : జిల్లా కేంద్రంలోని రాజమ్మకాలనీ ప్రాంతంలో సామూహిక మరుగుదొడ్లు శిథిలావస్థకు చేరుకుని ఏళ్లు గడుస్తోంది. నాలుగు నెలల కిందట ఆ ప్రాంతంలో కమ్యూనిటీ హాల్, మరుగుదొడ్లు నిర్మించాలని నిర్ణయించారు. అవి ఇంకా నిర్మాణ దశలోనే ఉన్నాయి.
టాయిలెట్స్ ఏవీ..? నగరంలో టాయిలెట్స్ అంతంత మాత్రంగానే ఉన్నాయి. ప్రధాన కూడళ్లలో టాయిలెట్స్ లేక మహిళలు, చిన్నారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ‘పే అండ్ యూజ్’ టాయిలెట్ల ఏర్పాటుకు నగరపాలక సంస్థ అధికారుల టెండర్లను ఆహ్వానించారు. కొందరు ముందుకొచ్చిన వాటి నిర్మాణం మొదలవలేదు.
అధికారిక లెక్కలిలా: మునిసిపల్ అధికారుల లెక్కల ప్రకారం రీజియన్‌లోని 11 మునిసిపాలిటీలు, నగరపాలక సంస్థలో దాదాపుగా వందశాతం లక్ష్యాలను అధిగమించామని చెబుతున్నారు. అనంతపురం 98 శాతం, ధర్మవరం 99శాతం, గుత్తి, 97శాతం, గుంతకల్లు 96 శాతం, కదిరి 98, కళ్యాణదుర్గం 99 శాతం, పామిడి 98, పుట్టపర్తి 98శాతం, రాయదుర్గం 95 శాతం, తాడిపత్రి 100 శాతం, మడకశిర 94 శాతం, హిందూపురం 98 శాతం అయ్యిందని అధికారులు చెబుతున్నారు.
––––––––––––––––––
వందశాతం అధిగమించాం..
బహిరంగ మల విసర్జన రహిత లక్ష్యాలను వందశాతం అధిగమించాం. భవిష్యత్తులో మరిన్ని లక్ష్యాలను అధిగమిస్తాం. బహిరంగ మల విసర్జన చేస్తే రూ 5 వేలు జరిమాన విధించాలని కేంద్రం నిర్ణయించింది. ఇకపై ఎవరూ బహిరంగంగా మల,మూత్రం చేయరాదు.
– విజయలక్ష్మి, ఆర్‌డీ
అంతా తూచ్..!
Published Sat, Oct 1 2016 10:40 PM | Last Updated on Tue, Aug 28 2018 5:25 PM
Advertisement
Advertisement