స్వచ్ఛత.. మరుగు | toilets not completes target | Sakshi
Sakshi News home page

స్వచ్ఛత.. మరుగు

Published Thu, Jul 27 2017 10:43 PM | Last Updated on Tue, Aug 28 2018 5:25 PM

స్వచ్ఛత.. మరుగు - Sakshi

స్వచ్ఛత.. మరుగు

నాలుగు రోజుల్లో 10,483 మరుగుదొడ్లట!
- డ్వామా అధికారుల అత్యాశ
- రేపటితో ముగియనున్న గడువు
- ప్రజాప్రతినిధులూ ఆరుబయటకే..
- ఆర్‌డబ్ల్యు ఎస్‌ ఆధ్వర్యంలో 1.93లక్షల మరుగుదొడ్లు.. పూర్తయినవి 41,240


సాక్షిప్రతినిధి, అనంతపురం: స్వచ్ఛ భారత్‌... స్వచ్ఛ ఆంధ్ర...స్వచ్ఛ అనంత...పరిశుభ్రతపై ప్రజలను చైతన్యం చేసేందుకు ఇటు ప్రభుత్వాలు, యంత్రాంగం జపిస్తున్న మంత్రాలివి. బహిరంగ మలవిసర్జనను అరికట్టి, ప్రతి కుటుంబం వ్యక్తిగత మరుగుదొడ్డి నిర్మించుకోవాలన్నది వీరి ధ్యేయం. అయితే నేటికీ మరుగుదొడ్డి లేని కుటుంబాలు జిల్లాలో లక్షల్లో ఉన్నాయి. జెడ్పీటీసీ సభ్యులు, మండలాధ్యక్షులకే మరుగుదొడ్లు పూర్తిస్థాయిలో లేవంటే సామాన్యుల పరిస్థితి ఇంకెలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. పేరుకు వేలు...లక్షల్లో మరుగుదొడ్లను మంజూరు చేశామని ప్రభుత్వాలు ఊదరగొడుతున్నా... క్షేత్రస్థాయిలో మాత్రం అందుకు విరుద్ధమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి.  

జిల్లా వ్యాప్తంగా వ్యక్తిగత మరుగుదొడ్డి లేనివారు ఎంతమంది ఉన్నారనేది ప్రభుత్వం సర్వే చేసింది. సర్వే ఆధారంగా ఏటా కొన్ని పంచాయతీలను ఎంచుకుని మరుగుదొడ్ల నిర్మాణానికి ఉపక్రమిస్తోంది. ఒక్కో వ్యక్తిగత మరుగుదొడ్డి నిర్మాణానికి ప్రభుత్వం రూ. 15 వేల చొప్పున మంజూరు చేస్తోంది. అయితే ఈ మొత్తం సరిపోవడం లేదు. ఇతర జిల్లాలతో పోలిస్తే ‘అనంత’ పల్లెసీమల్లోని కుటుంబాల ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉంది. నాలుగేళ్లుగా వరుస కరువులతో అప్పుల ఊబిలో కూరుకుపోయాయి. ఈ క్రమంలో ప్రభుత్వం ఇచ్చే రూ.15 వేలతో పాటు సొంతంగా మరింత ఖర్చు చేసుకుంటే తప్ప మరుగుదొడ్డి నిర్మాణం పూర్తి కాని పరిస్థితి. అందువల్లే  చాలా మంది వెనుకడుగు వేస్తున్నారు. దీనికి తోడు ప్రజలను చైతన్యం చేయడంలో అధికారులు కూడా విఫలమయ్యారు.

లక్ష్యానికి సగం కూడా గగనమే
ఆర్‌డబ్ల్యూఎస్‌ ఆధ్వర్యంలో 2016–17 నుంచి 2019–20 వరకూ విడతల వారీగా జిల్లాలోని పంచాయతీలను ఎంపిక చేసుకుని మరుగుదొడ్లు పూర్తి చేయాలని యంత్రాంగం భావించింది. అయితే ఏటా ప్రభుత్వం మంజూరు చేస్తున్న మరుగుదొడ్ల సంఖ్య, పురోగతి చూస్తుంటే పెద్దగా మార్పు కనిపించ లేదు. 2016–17 ఆర్థిక సంవత్సరానికి 340 గ్రామ పంచాయతీలను ఎంపిక చేసుకుంటే... అందులో 184 గ్రామ పంచాయతీలను బహిరంగ మల విసర్జన రహిత గ్రామాలుగా తీర్చిదిద్దామని అధికారులే చెబుతున్నారు. ఈలెక్కన తక్కిన 156 పంచాయతీల్లో పురోగతి లేదు.

డ్వామా అధికారులూ అంతే..
స్వచ్ఛభారత్‌ మిషన్‌ పేరుతో ఆర్‌డబ్ల్యూఎస్‌ ద్వారా మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టిన ప్రభుత్వం మరోవైపు డ్వామా కూడా ఈ బాధ్యతను అప్పగించింది. ఉపాధిహామీ పథకం ద్వారా  36, 216 మరుగుదొడ్లు మంజూరు చేసింది. ఇందులో 10, 483 మరుగుదొడ్లు పురోగతిలో ఉన్నాయని డ్వామా గణాంకాలు చెబుతున్నాయి. తక్కిన 20,804 మరుగుదొడ్లు ప్రారంభం కాలేదు. దీంతో వీటిని రద్దు చేసిన ప్రభుత్వం ఇక వాటిని ప్రారంభించొద్దని డ్వామా అధికారులకు సూచించింది. ఇలా రద్దయిన వాటిని స్వచ్ఛభారత్‌ మిషన్‌ ద్వారా ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులు చేపట్టనున్నారు. డ్వామా అధికారులు చేపట్టే వాటిలో యూనిట్‌కు రూ.13 వేలు ఉపాధి హామీ పథకం నిధులు ఖర్చు చేస్తున్నారు. తక్కిన రూ.3 వేలు రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తోంది. వీటిని 26వ తేదీ నుంచి 29 వరకూ నాలుగురోజుల్లో పూర్తి చేసేందుకు లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. అయితే నాలుగురోజుల్లో ఇన్ని మరుగుదొడ్లు పూర్తి చేస్తారా? లేదా? అనేది రెండురోజుల్లో తేలిపోతుంది.

1,500 మరుగుదొడ్లు పూర్తికాకపోవచ్చు
జిల్లాకు 36,216 మరుగుదొడ్లు మంజూరయ్యాయి. వీటిలో 10,483 డ్వామా ఆధ్వర్యంలో ప్రారంభించాం. ప్రారంభం కాని వాటిని రద్దు చేసి ఆర్‌డబ్ల్యూఎస్‌ శాఖకు బదలాయించారు. ఈ నెల 29వ తేదీలోపు మరుగుదొడ్లు పూర్తి చేసేందుకు ఏర్పాట్లు చేసుకున్నాం. వీటిలో 1,500 దాకా పెండింగ్‌ ఉండొచ్చు. తక్కినవి పూర్తి చేయగలమనే నమ్మకం ఉంది.
- నాగభూషణం, డ్వామా పీడీ

జిల్లాలో మరుగుదొడ్లు లేని ప్రజాప్రతినిధులు:
ప్రజాప్రతినిధులు    మరుగుదొడ్లు లేనివారి సంఖ్య    
జెడ్పీటీసీ సభ్యులు    19    
ఎంపీపీలు    19    
ఎంపీటీసీ సభ్యులు    479    
సర్పంచ్‌లు    581    
వార్డు సభ్యులు    6075

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement