స్వర్ణకు సలామ్
స్వర్ణకు సలామ్
Published Thu, Feb 16 2017 2:09 AM | Last Updated on Tue, Jun 4 2019 5:02 PM
పెనుమంట్ర (ఆచంట): పెనుమంట్ర మండలం మార్టేరులో రూపుదిద్దుకుని రైతులకు సిరులు కురిపిస్తున్న స్వర్ణ రకం వరి వంగడం జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది. హరిత విప్లవం ద్వారా దేశంలో ఆహార భద్రతకు దోహదపడిన వరి వంగడాలపై ఇటీవల ప్రభుత్వం దృష్టి సారించింది. దీనిలో భాగంగా 1980 దశకం ముందు నుంచి అధిక దిగుబడిని, రైతులకు పంట భరోసాను ఇచ్చిన మార్టేరు స్వర్ణ రకం కేంద్ర ప్రభుత్వ అధికారుల లెక్కల్లో అగ్రగామిగా నిలిచింది. మొత్తంగా 1980కి ముందు నుంచి రైతునేస్తాలుగా గుర్తింపు పొందిన 51 రకాల విత్తనాలను జాతీయ స్థాయిలో ప్రముఖమైనవిగా అధికారులు గుర్తించారు. వీటిలో వరికి సంబం«ధించి స్వర్ణతో పాటు ఆచార్య ఎన్‌జీ రంగా వ్యవసాయ యూనివర్సిటీలోనే రూపుదిద్దుకున్న ‘మసూరి’ వంగడం కూడా జాతీయస్థాయిలో గుర్తింపు పొందాయి. ఈ జాబితాలో మొక్కజొన్నలో డీహెచ్‌ఎం 101 రకం కూడా ఉంది.
ల్యాండ్‌మార్కు రకంగా..
న్యూఢిల్లీలో 1941లో ఏర్పాౖటెన బ్రీడర్స్ ఇండియన్ సొసైటీ సంస్థ దేశంలో ఆహార ధాన్యాల ఉత్పత్తిని గణనీయంగా పెంచిన ప్రముఖ విత్తన రకాలపై పరిశోధన చేస్తోంది. సంస్థను నెలకొల్పి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా స్వర్ణ, మసూరి రకాలను ఆచార్య ఎన్‌జీ రంగా వ్యవసాయ యూనివర్సిటీ పరిధిలో ‘ల్యాండ్‌మార్కు’ రకాలుగా బ్రీడర్స్ ఇండియన్ సొసైటీ గుర్తించింది.
ఢిల్లీలో అవార్డు ప్రధానం
జాతీయస్థాయిలో స్వర్ణ రకం గుర్తింపు పొందిన క్రమంలో మార్టేరు వరిపరిశోధనా స్థానంకు పురస్కారం దక్కింది. ఢిలీల్లోని భారత వ్యవసాయ పరిశోధనా సంస్థ ప్రాంగణంలో ఇటీవల జరిగిన కార్యక్రమంలో జాతీయ స్థాయిలో ప్రముఖ శాస్త్రవేత్తలు ఆర్‌ఎస్ పరోడ, డాక్టర్ గురుగోవింద్ కుష్, డాక్టర్ పీఎల్ గౌతమ్, డాక్టర్ జీఎస్ సంధు, డాక్టర్ వీఎల్ చోప్రా చేతుల మీదుగా మార్టేరు వ్యవసాయ పరిశోధనా సంస్థ ప్రధాన డైరెక్టర్ డాక్టర్ పీవీ సత్యనారాయణ పురస్కారం అందుకున్నారు.
మా సంస్థకు గర్వకారణం
దేశంతో పాటు విదేశాల్లోనూ స్వర్ణ రకం సాగులో ఉండటం మా సంస్థకు గర్వకారణం. మార్టేరులో ఈ రకాన్ని సృష్టించిన శాస్త్రవేత్తలకు ప్రజలు, రైతుల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. వారి స్ఫూర్తితో ప్రస్తుత వాతావరణ పరిస్థితులకు అనువైన రకాలను, పెట్టుబడి తగ్గించి చేయగల విత్తనాలను, మారుతున్న ప్రజల ఆహార అలవాట్లకు అనుగుణమైన వంగడాల తయారీకి శాస్త్రవేత్తలతో కలిసి నిరంతరం కృషి చేస్తున్నాం.
– డాక్టర్ పీవీ సత్యనారాయణ, వ్యవసాయ పరిశోధనా స్థానం డైరెక్టర్, మార్టేరు
Advertisement
Advertisement