మొక్కల రక్షణకు చర్యలు తీసుకోండి | Take measures to protect plants | Sakshi
Sakshi News home page

మొక్కల రక్షణకు చర్యలు తీసుకోండి

Published Thu, Aug 11 2016 12:19 AM | Last Updated on Thu, Mar 21 2019 8:35 PM

మొక్కల రక్షణకు చర్యలు తీసుకోండి - Sakshi

మొక్కల రక్షణకు చర్యలు తీసుకోండి

ఇందూరు : లక్ష్యానికి అనుగుణంగా మొక్కలు నాటడంతో పాటు వాటి సంరక్షణకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ యోగితారాణా ఆదేశించారు. హరితహారం అమలుపై ఆమె బుధవారం తన చాంబర్‌లో జిల్లా స్థాయి ఛేంజ్‌ ఏజెంట్లతో సమీక్షించారు. ప్రతి అధికారి ఆయా గ్రామాల్లో 40 వేల మొక్కల చొప్పున నాటించడంతో పాటు నాటిన మొక్కలు ఏ విధంగా ఉన్నాయో పరిశీలించాలన్నారు. మొక్కల రక్షణకు కంచెలను ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. వరినాట్లు 50 శాతం పూర్తి అయినందున కనీసం లక్ష మంది కూలీలు ఉపాధి హామీ పనులకు రావాల్సి ఉందని, అయితే 20 వేల మంది మాత్రమే వస్తున్నారని తెలిపారు. కూలీలను పనికి తీసుకురావడంలో విఫలమయ్యే క్షేత్ర సహాయకులపై చర్యలు తీసుకోవాలని డ్వామా పీడీని ఆదేశించారు. మొక్కలు నాటేందుకు ప్రతి ఒక్కరు ముందుకు వస్తారని, అయితే వాటిని రక్షించే విషయంలో జిల్లా యంత్రాంగం ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ముళ్ల కంచెలను ఏర్పాటు చేయించాలన్నారు.
సరాసరి 95 శాతం వరకు మొక్కలు బతికి ఉన్న ట్లు అధికారుల నివేదికలు తెలుపుతున్నాయని, మిగతా మొక్కలు కూడా ఎండిపోకుండా అవసరమైన ఏర్పాటు చేయాలని తెలిపారు. ఇంటి పరిసరాల్లో, ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల పరిసరాల్లో, సామాజిక, శ్మశాన వాటికల్లో నాటిన మొక్కలకు ఎక్కువ రక్షణ ఉండే అవకాశం ఉన్నందున ఆయా ప్రాంతాల్లో మరిన్ని మొక్కలు నాటించడానికి, లక్ష్యాలు పూర్తి చేయడానికి చర్యలు తీసుకోవాలన్నారు. అంతకు ముందు మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. గ్రామాల్లో లక్ష్యానికనుగుణంగా ఎన్ని మొక్కలు నాటారో, ఇంకా ఎన్ని మొక్కలు కావాలో వివరాలు ఇవ్వాలని ఆదేశించారు. జేసీ రవీందర్‌రెడ్డి, పీడీలు వెంకటేశ్వర్లు, చంద్రమోహన్‌రెడ్డి, డీఎఫ్‌వో ప్రసాద్‌ పాల్గొన్నారు.
వ్యక్తిగత పరిశుభ్రతే ముఖ్యం
నిజామాబాద్‌ రూరల్‌: వ్యాధులు దరి చేరవద్దంటే వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రత పాటించాలని కలెక్టర్‌ యోగితారాణా సూచించారు. బుధవారం జాతీయ నులిపురుగుల దినోత్సవం సందర్భంగా బోర్గాం ప్రభుత్వ పాఠశాలలో ఆమె విద్యార్థులకు నులిపురుగుల నివారణ మాత్రలు పంపిణీ చేశారు. అనంతరం వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రతపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. చేతులు పరిశుభ్రంగా ఉంచుకోవాలని, తప్పనిసరిగా మరుగుదొడ్లను వినియోగించాలని సూచించారు. విద్యార్థులు తమ ఇంట్లో మరుగుదొడ్డి నిర్మించేలా తల్లిదండ్రులపై ఒత్తిడి తేవాలన్నారు. విద్యాప్రమాణాల పెంపు కోసం ఉపాధ్యాయులు కృషి చేయాలని కలెక్టర్‌ సూచించారు. తల్లిదండ్రుల ఆశయాన్ని సాధించేందుకు విద్యార్థులు కృషి చేయాలన్నారు. అనంతరం పాఠశాల ఆవరణలో కలెక్టర్‌ మొక్కను నాటారు. డీఈవో లింగయ్య, డీఎంహెచ్‌వో వెంకట్, వైద్యాధికారి నవీన్, సర్పంచ్‌ సాయిలు ఎంపీటీసీలు లింబాద్రి, రాధ పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement