ఎక్కడైనా పేదలు లబ్ధి పొందారా?
సంగారెడ్డి మున్సిపాలిటీ/పుల్‌కల్: రెండున్నరేళ్లలో తెలంగాణలోని ఏ గ్రామంలోనైనా నిరుపేదలు సంక్షేమ పథకాల ద్వారా లబ్ధిపొందినట్టు నిరూపిస్తే తాము నిర్వహిస్తున్న మహాజన పాదయాత్రను ఇక్కడే విరమిస్తామని, లేకుంటే ప్రజలకు క్షమాపణ చెప్పి ముక్కు నేలకు రాస్తావా? అని ముఖ్యమంత్రి కేసీఆర్‌కు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం సవాల్ విసిరారు. మహాజన పాదయాత్ర మంగళవారం సంగారెడ్డిలో, అంతకు ముందు శివ్వంపేటలో నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు. తాము ఇప్పటి వరకు 350 గ్రామాలకుపైగా పాదయాత్రను నిర్వహించినా, ఎక్కడా డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు, దళితులకు మూడెకరాల భూమి పొందిన వారు కన్పించలేదన్నారు. అభివృద్ధిపై తాము ఎక్కడైనా చర్చకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు.
బ్లాక్ మనీని మార్చుకునేందుకు కేసీఆర్ ఢిల్లీ వెళ్లి ప్రధాని మోదీని కలిశారని ఆరోపించారు. రిజర్వేషన్ల కోసం కాకుండా కాంట్రాక్టు పద్ధతిలో పని చేస్తున్న ఆయా సామాజిక వర్గాల వారి రెగ్యులరైజేషన కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చేందుకు తమతో కలసి రావాలని ఆయన కుల సంఘాలకు పిలుపునిచ్చారు. పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఒక్క ఉద్యోగ అవకాశం కూడా కల్పించలేని దద్దమ్మ అని తమ్మినేని ధ్వజమెత్తారు.
మార్చి 17లోగా ప్రజా సమస్యలను పరిష్కరించకపోతే అన్ని సామాజిక, రాజకీయ శక్తులను ఏకం చేసి టీఆర్‌ఎస్‌ను గద్దె దింపుతామని తమ్మినేని హెచ్చరించారు.