
'అది హరీశ్‌రావు అవివేకానికి నిదర్శనం'
కొమురవెల్లి మల్లన్న సాగర్ ముంపు గ్రామాల ప్రజల తిరుగుబాటుతోనే రాష్ట్ర ప్రభుత్వ పతనం మొదలైందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు.
తొగుట: కొమురవెల్లి మల్లన్న సాగర్ ముంపు గ్రామాల ప్రజల తిరుగుబాటుతోనే రాష్ట్ర ప్రభుత్వ పతనం మొదలైందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. ముంపు గ్రామాల ప్రజల పోరాటానికి మద్దతుగా మెదక్ జిల్లాలో సీపీఎం చేపట్టిన పాదయాత్ర మూడో రోజుకు చేరుకుంది. ఆదివారం వేములఘాట్ మదిర తుర్కబంజేరుపల్లి, ఏటిగడ్డ కిష్టాపూర్ మదిర గ్రామాలు గిరిజన తండా, తిరుమలగిరి, లక్ష్మాపూర్ గ్రామాల్లో పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా తమ్మినేని విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సాధ్యంకాని ప్రాజెక్టు పేరుతో ప్రజలను భయాందోళనకు గురిచేయడం ప్రభుత్వానికి తగదన్నారు.
నీటిపారుదల రంగంలో నిపుణుడైన హన్మంతరావు సూచనలు ప్రభుత్వం పట్టించుకోకపోవడం దుర్మార్గమన్నారు. ఇంత పెద్ద రిజర్వాయర్ రష్యా, చైనా వంటి దేశాల్లో కూడా నిర్మించలేదన్నారు. 2013 భూసేకరణ చట్టంతో రైతులకు నష్టం జరిగితే ప్రతిపక్షాలదే బాధ్యత అనడం మంత్రి హరీశ్‌రావు అవివేకానికి నిదర్శనమన్నారు. ఈ చట్టంపై చర్చించేందుకు హరీశ్‌రావు సిద్ధంగా ఉండాలన్నారు.