
బ్యాలెట్‌తో తప్పిదాలు చేశాం
సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని
పెద్దపల్లి/జూలపల్లి: మావోయిస్టులు బుల్లెట్‌తో తప్పిదాలు చేస్తే, కమ్యూనిస్టులం బ్యాలెట్‌తో అనేక తప్పిదాలు చేశామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అభిప్రాయపడ్డారు. సీపీఎం చేపట్టిన మహాజన పాదయాత్ర పెద్దపల్లి జిల్లా కేంద్రం నుంచి జూలపల్లికి చేరింది. సభలో తమ్మినేని మాట్లాడుతూ కమ్యూనిస్టులంతా ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన సమయం వచ్చిందన్నారు. రాష్ట్రాన్ని పాలించిన తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీలు దొంగల పార్టీలని, ఆ పార్టీలకు టీఆర్‌ఎస్ తీసిపోదని విమర్శించారు. ‘తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే కాలు అడ్డం పెట్టి పొలాలకు నీళ్లు అందిస్తామని చెప్పినవు..దళితులకు మూడెకరాల భూమిస్తాం. ఇళ్లులేని వారందరికీ డబుల్ బెడ్‌రూం ఇండ్లు కట్టిస్తామన్నవు.. ఇలా నోటికి వచ్చిందే చిత్తంగా మాటల గారడీతో అధికారంలోకి వచ్చినవు. శాంపిల్ కార్యక్రమాలను అభివృద్ధి నమూనాగా ప్రకటించుకుని సిద్దిపేట జిల్లాలో నాలుగైదు వందల ఇళ్లు కట్టి బీరాలు పలుకుతున్నా వు.. సొంత నియోజకవర్గానికి నాలుగు మంచి పనులుచేసి నన్ను మించిన సీఎం లేడని ఫోజు కొడుతున్నావు’అని సీఎం కేసీఆర్‌ను ఉద్దేశించి ఎద్దేవా చేశారు.
ఎయిర్‌పోర్టు కోసం దళితుల భూములు తీసుకోవద్దు
సాక్షి, హైదరాబాద్: పెద్దపల్లి జిల్లాలో ఎయిర్‌పోర్టు కోసం దళితులు సాగు చేసుకుంటున్న భూముల్ని సేకరించడాన్ని ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని సీపీఎం విజ్ఞప్తి చేసింది. గోదావరిఖని ఏరియాలో సింగరేణి భూముల్లో నిర్మించుకున్న ఇళ్లకు వెంటనే పట్టాలివ్వాలని సీఎం కేసీఆర్‌కు ఆ పార్టీ కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విజ్ఞప్తి చేశారు. సింగరేణికి అవసరమయ్యే ఉత్పత్తులను తయారుచేసే పరిశ్రమలు నెలకొల్పే చర్యలు తీసుకోవాలన్నారు.