టాంగ్‌సూడో పోటీలు ప్రారంభం
టాంగ్‌సూడో పోటీలు ప్రారంభం
Published Sat, Sep 10 2016 8:59 PM | Last Updated on Mon, Sep 4 2017 12:58 PM
తెనాలి టౌన్: తెనాలిలో రాష్ట్రస్థాయి టాంగ్‌సూడో పోటీలు శనివారం స్థానిక మార్కెట్ యార్డు ఆవరణలో ప్రారంభమయ్యాయి. మొత్తం 10 జిల్లాల నుంచి సుమారు 400 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. పోటీలను తెనాలి మొదటి ఏఎంఎం కోర్టు న్యాయమూర్తి జి.ప్రభాకర్, రెండవ ఏఎంఎం కోర్టు న్యాయమూర్తి సీహెచ్.పవన్‌కుమార్ జ్యోతిప్రజ్వలన చేసి ప్రారంభించారు. జిల్లా టాంగ్‌సూడో స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ పోటీల ప్రారంభోత్సవ సభకు డాన్ బ్లాక్ బెల్ట్ కె.వెంకటేశ్వరరావు అధ్యక్షత వహించారు. సభలో న్యాయమూర్తి ప్రభాకరరావు మాట్లాడుతూ మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవడం వల్ల ఆత్మసై ్థర్యం పెరుగుతుందని, శారీరక ఎదుగుదల ఉంటుందన్నారు. కరాటే నేర్చుకునే విద్యార్థులకు పాఠశాలలో ప్రత్యేక గుర్తింపు వస్తుందని, ఆడపిల్లలు ముఖ్యంగా ఆత్మరక్షణ కోసం ఈ క్రీడలను నేర్చుకోవాలన్నారు. మరో న్యాయమూర్తి పవన్‌కుమార్ మాట్లాడుతూ మార్షల్ ఆర్ట్స్ క్రీడలు ఆత్మరక్షణకు ఎంతగానో ఉపయోగపడతాయని తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రోత్సహించాలన్నారు. త్రీటౌన్ సీఐ ఎ.ఆశోక్‌కుమార్ మాట్లాడుతూ పాఠశాల స్థాయిలో కరాటే, కుంగ్‌ఫూ లాంటి పోటీలను నిర్వహించాలన్నారు. ఆత్మరక్షణకు సంబంధించిన విద్యను నేర్చుకోవడం నేటి సమాజంలో తప్పనిసరి అని అన్నారు. సభ అధ్యక్షత వహించిన నిర్వాహకుడు వెంకటేశ్వరరావు మాట్లాడుతూ బాలుర, బాలికల విభాగంలో అండర్–11, అండర్–14, అండర్–17, 18 సంవత్సరాలకు పైబడిన క్రీడాకారులకు స్పారింగ్, ప్లామ్స్, వెపన్స్, బ్రేకింగ్ ఈవెంట్‌లలో పోటీలు రెండు రోజుల పాటు జరుగుతాయని చెప్పారు. స్కూల్ గేమ్ ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో మొదటిసారిగా గత ఏడాది పోటీలు నిర్వహించామని, ఢిల్లీలో జాతీయ స్థాయిలో జరిగిన పోటీలలో రాష్ట్రానికి మూడు వెండి, ఒక రజత పతకం వచ్చినట్లు చెప్పారు. ఈ పోటీలలో ప్రథమ, ద్వితీయ స్థానాలు సాధించిన క్రీడాకారులు అక్టోబర్ 24న గోవాలో జరిగే జాతీయస్థాయి పోటీలలో పాల్గొంటారని తెలిపారు. కార్యక్రమంలో ఏపీ అసోసియేషన్ టెక్నికల్ డైరెక్టర్ వి.నాగరాజు, కన్వీనర్ కె.శ్రీనివాసరావు, ఇండియా టెక్నికల్ డైరెక్టర్ బీవీ రమణయ్య, వివిధ జిల్లాల ప్రతినిధులు గోపినాయుడు, రవిబాబు, శంకరరావు, కరిముల్లా, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement