కృష్ణరాయపురంలో దారుణం
విశాఖలో దారుణం
విశాఖపట్నం : విశాఖపట్నం జిల్లా పెందుర్తి మండలం కృష్ణరాయపురంలో దారుణం చోటు చేసుకుంది. తల్లిదండ్రులు మందలించారని ఇంట్లో నుంచి బయటకు వెళ్లిన విద్యార్థిని మృతదేహమై కనిపించింది. వివరాలు ఇలా ఉన్నాయి..... పెందుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలోని కృష్ణరాయపురానికి చెందిన నాగేశ్వరరావు, అరుణ దంపతులకు ఇద్దరు సంతానం. పెద్ద కూతురు తనూజ(15) స్థానిక పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతోంది. ఈ క్రమంలో గత కొన్ని రోజులుగా తనూజ స్థానికంగా నివాసముంటున్న ఓ యువకుడితో ఫోన్‌లో మాట్లాడుతోంది. ఈ విషయమై శనివారం రాత్రి తనూజను తల్లిదండ్రులు మందలించారు. దీంతో తనూజ తీవ్ర మనస్తాపానికి గురై ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. స్థానికులు, బంధువుల ఇళ్లలో వెతికినా లాభం లేకపోయింది. దీంతో ఆమె తల్లిదండ్రులు అర్ధరాత్రి పెందుర్తి పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు కేసు నమోదు చేసి.. గాలింపు చర్యలు చేపట్టారు.
అందులోభాగంగా ఆదివారం ఉదయం కృష్ణరాయపురంలోని ఓ అపార్ట్‌మెంట్ వెనుక భాగంలోని నిర్మానుష్య ప్రాంతంలో.. బాలిక శవాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని... మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతదేహం పై దుస్తులు లేకపోవడంతో.. అత్యాచారం చేసి ఆమెను హతమార్చి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. మృతదేహం లభించిన ప్రాంతం తనూజ ఇష్టపడిన యువకుడి ఇంటికి సమీపంలో ఉండటంతో.. ఇందులో అతని పాత్ర ఉందా ? అనే కోణంలో పోలీసులు దృష్టి సారించారు.