
గెలుస్తామా.. లేదా!
కర్నూలు కార్పొరేషన్‌లో మన పార్టీ పరిస్థితి ఏమిటనే విషయంలో అధికార పార్టీలో అంతర్మథనం మొదలయింది.
కర్నూలు కార్పొరేషన్‌పై మల్లగుల్లాలు
టీడీపీ వ్యూహాత్మక కమిటీ నేడు భేటీ
వర్ల రామయ్య నేతృత్వంలో ఉదయం 11 గంటలకు..
కర్నూలు : కర్నూలు కార్పొరేషన్‌లో మన పార్టీ పరిస్థితి ఏమిటనే విషయంలో అధికార పార్టీలో అంతర్మథనం మొదలయింది. కార్పొరేషన్ ఎన్నికల్లో పార్టీ గెలిచే అవకాశం ఉందా? లేదా అనే అంశంపై హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ వర్ల రామయ్య నేతృత్వంలో సమావేశం కానున్నట్టు తెలిసింది. స్టేట్ గెస్ట్‌హౌస్‌లో ఆదివారం ఉదయం 11 గంటలకు జరిగే ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తితో పాటు మాజీ మంత్రులు టీజీ వెంకటేష్, ఏరాసు ప్రతాప్ రెడ్డి, కోడుమూరు నియోజకవర్గ ఇన్‌చార్జి విష్ణువర్దన్ రెడ్డి, వైసీపీ నుంచి టీడీపీలో చేరిన ఎమ్మెల్యేలు మణిగాంధీ, ఎస్వీ కూడా హాజరుకానున్నట్టు తెలిసింది.
ముస్లింలు దూరమేనా..
ప్రధానంగా బీజేపీతో పొత్తు నేపథ్యంలో పార్టీకి ముస్లింలు దూరంగా ఉంటున్నారనే అంశంపై ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉంది. వీరికి ఇచ్చిన హామీలు కూడా పెద్దగా నెరవేరలేదు. ఉర్దూ యూనివర్సిటీ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉంది. హజ్‌హౌస్ నిర్మాణంపైనా ఏ మాత్రం కదలిక లేదు. పైగా బీజేపీతో ఉన్న పొత్తుతో కార్పొరేషన్ ఎన్నికల్లో ముస్లింలు తమ వెంట నిలిచే అవకాశం లేదని అధికార పార్టీ నేతలు భావిస్తున్నారు.
దీనికితోడు ఎమ్మెల్యే ఎస్వీ చేరిక కూడా పార్టీకి పెద్దగా లాభించే అవకాశం లేదని కూడా విశ్లేషణలు ప్రారంభమయ్యాయి. ఇందుకు కారణంగా ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డితో పాటు పెద్దగా నాయకులు, కార్యకర్తలు తరలిరాలేదని అధికార పార్టీ నేతలు పేర్కొంటున్నారు. మైనార్టీ నేతలు కూడా ఈ చేరికపై ఆగ్రహంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కార్పొరేషన్ ఎన్నికల్లో వాస్తవిక బలం ఏమిటో తెలుసుకునేందుకు అధికార పార్టీ ప్రయత్నాలు ప్రారంభించింది.