కాపులు నన్ను దేవుడిలా చూడటం లేదా?
టీడీపీలో కాపు గర్జన చిచ్చు
► గర్జనకు హాజరు కావద్దని హుకుం జారీ చేసిన చంద్రబాబు
► ససేమిరా అంటున్న నేతలు, కార్యకర్తలు
► మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలపై తీవ్రస్థాయిలో ఒత్తిడి
► పార్టీ నేతలతో చంద్రబాబు టెలీ కాన్ఫరెన్స్
► కాపులు మిమ్మల్ని గౌరవిస్తున్నారన్న గోదావరి జిల్లాల టీడీపీ ఎమ్మెల్యేలు
► మరి గర్జనకు భారీ స్పందన ఎందుకు వస్తోందని ప్రశ్నించిన చంద్రబాబు
సాక్షి, హైద రాబాద్:తెలుగుదేశం పార్టీలో కాపు గర్జన చిచ్చు రేపింది. కాపు గర్జనకు ఎట్టి పరిస్థితుల్లో పార్టీ నేతలు, కార్యకర్తలు హాజరు కావద్దని హుకుం జారీ చేయటంతో వారి నుంచి తీవ్ర నిరసన వ్యక్తం అవుతోంది. సొంత సామాజికవర్గాన్ని తాము వదులుకునే పరిస్థితి లేదని, ఎట్టి పరిస్థితుల్లోనూ తూర్పుగోదావరి జిల్లా తునిలో ఆదివారం జరిగే కాపు గర్జనలో పాల్గొంటామని వారు స్పష్టం చేస్తున్నారు. మన పార్టీ అధినేత కాపుల సమస్యలన్నీ తీరుస్తామని చెప్తున్నారు, అలాంటపుడు ఇటువంటి సమావేశాలకు వెళ్లటం సబబు కాదని మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు వారిస్తున్నా కిందిస్థాయి నేతలు, కార్యకర్తలు మాత్రం అంగీకరించటం లేదు. శుక్రవారం టీడీపీ ముఖ్య నేతలు సుమారు 130 మందితో చంద్రబాబు హైదరాబాద్ నుంచి టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కాపు కార్పొరేషన్ ఏర్పాటు, ఛైర్మన్ నియామకం, బడ్జెట్‌లో రూ.వంద కోట్ల కేటాయింపు తదితరాల గురించి చంద్రబాబు వివరించారు. దీనిపై ఉభయ గోదావరి జిల్లాల ఎమ్మెల్యేలు స్పందిస్తూ కాపులు మిమ్మల్ని దేవుడిగా కొలుచుకుంటున్నారని వ్యాఖ్యానించారు. చంద్రబాబు స్పందిస్తూ మరి నన్ను కాపులు దేవుడిలా కొలుచుకుంటుంటే కాపు గర్జనకు అంత భారీ స్పందన ఎందుకు వస్తుందని ప్రశ్నించటంతో ఎక్కువ మంది నేతలు సమాధానం ఏమీ చెప్పలేకపోయినట్లు తెలిసింది.
పలువురు నేతలు మాత్రం తాము పార్టీని నమ్ముకున్న నేతలం అయిన అప్పటికీ సామాజిక నేపథ్యంలో గర్జనకు వెళ్లకుండా ఉండలేమని చెప్పారు. ఐతే పార్టీ వైఖరిని దృష్టిలో ఉంచుకుని గర్జనకు నేతలు ఎవ్వరూ వెళ్లవద్దని, కిందిస్థాయి వారిని కూడా కట్టడి చేయాలని చెప్పారు. ఐతే కిందిస్థాయిలో మాత్రం నేతలు చంద్రబాబు మాటలను పట్టించుకోవటం లేదు. జిల్లా పార్టీ అధ్యక్షులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలపై ఒత్తిడి తెస్తున్నారు. తాము తునిలో జరిగే కాపు గర్జనకు వెళతామని స్పష్టం చేస్తున్నారు. పార్టీ కొందరికే పరిమితమైందని, కాపు సామాజికవర్గం నుంచి బలమైన నేతలను తయారు చేసి ఉంటే ఈ పరిస్థితి ఉత్పన్నం అయ్యేది కాదని పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. కాపులను బీసీల్లో చేరుస్తూ జీవో జారీ చేయటం తనకు నిమిషం పని అని, జీవో జారీ చేసిన వెంటనే ఎవరైనా కోర్టును ఆశ్రయిస్తే ఇబ్బందులు తప్పవని చంద్రబాబు టెలీ కాన్ఫరెన్స్‌లో వివరించారు. కాపులు ఎక్కువగా గర్జనకు హాజరైతే తప్పుడు సంకేతాలు వెళతాయని చెప్పారు. కాపులకు అన్నీ చేస్తున్నామని, ఇటీవలే బీసీల్లో వారిని చేర్చే అంశంపై కమిషన్‌ను నియమించామని, కమిషన్ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఒకవేళ అలా కాకుండా ముందుగానే ఉత్తర్వులు జారీ చేస్తే , బీసీలను నమ్ముకున్న పార్టీకి ఇబ్బందులు వస్తాయని వివరించారు.
ఇదిలా ఉంటే టీడీపీ నేతలతో చంద్రబాబు నిర్వహించిన టెలీ కాన్ఫరెన్స్ వివరాలను ప్రభుత్వ సమాచార సలహాదారు కార్యాలయం ఒక ప్రకటనలో వెల్లడించింది. అన్ని వర్గాల ఆమోదంతో బీసీలకు నష్టం జరగని రీతిలో కాపులకు న్యాయం చేయటమే టీడీపీ లక్ష్యమని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. కాంగ్రెస్, వైఎస్సార్ కాంగ్రెస్‌ల మాదిరిగా కాపులు, బీసీలకు ఘర్షణ పెట్టడం టీడీపీ లక్ష్యం కాదని, బీసీలను ఉద్ధరిస్తామని కొందరు కాపుల ప్రస్తావన తెచ్చి బీసీ వర్గాలను టీడీపీకీ దూరం చేయాలని ఎవరైనా అనుకుంటే అది సాధ్యం కాదని అన్నారు.