విభజించు.. పాలించు
♦ కాపు నేతలతో ముఖ్యమంత్రి చంద్రబాబు వేర్వేరుగా భేటీ
♦ కాపు నేతల డిమాండ్లకు అంగీకరించని చంద్రబాబు
సాక్షి, హైదరాబాద్/విజయవాడ బ్యూరో: కాపులను బీసీల్లో చేర్చాలంటూ ఒత్తిడి పెరుగుతుండడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు విభజించు, పాలించు సూత్రాన్ని అమలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే కాపు నాయకుల్లో చీలిక తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ముద్రగడ పద్మనాభం చేపట్టిన కాపుల ఐక్య గర్జన విజయవంతం కావడం, అనంతరం హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్న నేపథ్యంలో చంద్రబాబు మంగళవారం విజయవాడలోని తన క్యాంపు కార్యాలయంలో కాపు నేతలతో సమావేశం నిర్వహించారు. వీరిలో ఎక్కువ మంది టీడీపీలోని కాపులే కావడం గమనార్హం. తొలుత కాపు నేతలు పిళ్లా వెంకటేశ్వరరావు, నారాయణస్వామి రాయల్ తదితరులతో భేటీ అయ్యారు. అనంతరం మిగిలిన నేతలతో సమావేశమయ్యారు. అంతకు ముందు ఉభయ గోదావరి, విశాఖ టీడీపీ నేతలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.
నివేదిక వచ్చాకే నిర్ణయం: కాపు సామాజిక వర్గంలో నమ్మకం కలిగించేందుకు జీవో జారీకి ముందు టైమ్‌లైన్ ప్రకటించాలని కాపు నాయకులు సీఎంను కోరారు. మంజునాథ్ కమిషన్ నివేదిక గడువును మూడు నెలలకు తగ్గించాలని, జిల్లాకు రూ.కోటి చొప్పున కేటాయించి ఒక రోజులో సర్వే పూర్తి చేయించాలని విజ్ఞప్తిచేశారు. సాధ్యమైనంత త్వరగా నివేదిక ఇచ్చేలా చూడాలని, మూడు నెలల్లో ఉత్తర్వులు జారీ చేయాలని అభ్యర్థించారు. నేతల వినతిని చంద్రబాబు పట్టించుకోలేదు. తొమ్మిది నెలల్లో మంజునాథ్ కమిషన్ నివేదిక వస్తుందని, అప్పుడే కాపులను బీసీల్లో చేర్చే విషయంపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి కాపు కార్పొరేషన్‌కు నిధులు పెంచుతామని చెప్పారు. కాపు కమిషన్ చైర్మన్ జస్టిస్ మంజునాథ్ ఈ నెల 4న ముఖ్యమంత్రి చంద్రబాబుతో సమావేశమవుతారని కిమిడి కళా వెంకట్రావు తెలిపారు. రిజర్వేషన్ల ప్రక్రియ వేగవంతమయ్యేలా చూసేందుకు కాపు సామాజిక వర్గానికి చెందిన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలతో ఒక కమిటీని ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.
కాపుల్లో విభజన తెచ్చేందుకే: కాపుల్లో విభజన తెచ్చేందుకే కాపునాడు ముసుగులో టీడీపీ కాపు నేతలను, మంత్రులు రంగంలోకి దించినట్లు స్పష్టమవుతోంది. ఒకవైపు ముద్రగడ పద్మనాభం శుక్రవారం నుంచి దీక్ష చేస్తానని చెబుతుంటే దాన్ని రాజకీయం చేస్తూ విడిగా కొందరు కాపు నాయకులతో ముఖ్యమంత్రి చర్చలు జరపడం ఏమిటని ఇతర కాపు సంఘాల నేతలు ప్రశ్నిస్తున్నారు. కాపు ఉద్యమాన్ని పక్కదారి పట్టించి నీరుగార్చేందుకే టీడీపీ పక్కా వ్యూహం ప్రకారం ఇలా చేస్తోందని ఆరోపిస్తున్నారు. కాపుల రిజర్వేషన్లపై ముఖ్యమంత్రి అనుసరిస్తున్న తీరు అనుమానాస్పదంగా ఉందని టీడీపీలోని కాపులు చెప్పడం గమనార్హం. ఇదిలా ఉంటే వైఎస్సార్‌సీపీ, వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిలను లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేయాల్సిందిగా టీడీపీ నేతలకు చంద్రబాబు టెలికాన్ఫరెన్స్‌లో సూచించారు.