వసూల్ రాజా
‘ప్రయివేటు’ రోగులకు ప్రభుత్వాస్పత్రిలో పరీక్షలు చేయిస్తున్న వైనం
♦ సీటీ స్కాన్‌కు రూ.1,000 చొప్పున వసూలు
♦ వికలాంగుల ధ్రువీకరణ పత్రానికి రూ.2వేలు
♦ వైద్యులు, సిబ్బందితోనూ దురుసు ప్రవర్తన
♦ ఇదీ ప్రభుత్వాస్పతి అభివృద్ధి కమిటీ సభ్యుడి నిర్వాకం
♦ అధికార పార్టీ నేత కావడంతో నోరుమెదపని అధికారులు
లబ్బీపేట (విజయవాడ తూర్పు) : ‘వికలాంగుల సర్టిఫికెట్ కావాలా... రూ.2 వేలు తెచ్చుకోండి. వైద్యులతో మాట్లాడి వెంటనే ఇప్పించేస్తా. సీటీ స్కాన్ తీయించాలా... రూ.1,000 ఇవ్వండి. బయట అయితే రూ.4వేలు అవుతాయి. ఎలాంటి కార్డులు అవసరం లేదు. అన్నీ నేను చూసుకుంటా. పోస్టుమార్టం త్వరగా చేయించాలా... అయితే, నాకు డబ్బులు(పరిస్థితిని బట్టి రేటు) ఇస్తే వైద్యులకు అందజేసి వెంటనే పని పూర్తిచేయిస్తా. అన్నీ నేను మేనేజ్ చేస్తాను..’ ఇదీ విజయవాడ ప్రభుత్వాస్పత్రి అభివృద్ధి కమిటీ సభ్యుడిగా ఉన్న ఓ టీడీపీ నాయకుడు సాగిస్తున్న దందా. ఆయన చిల్లర వేషాల వల్ల తమ పరువు పోతోందని సహచర కమిటీ సభ్యులు సైతం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు నర్సింగ్, ఇతర మహిళా సిబ్బంది పట్ల కూడా ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని తెలిసింది. అయితే, అధికార పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే అనుచరుడు కావడంతో అధికారులు, సిబ్బంది ఎదురు చెప్పేందుకు సాహసించడం లేదు.
నిత్యం రోగులను వెంటబెట్టుకుని...
చిల్లర కోసం కక్కుర్తిపడుతున్న ఆస్పత్రి అభివృద్ధి కమిటీ సభ్యుడు నిత్యం ఇద్దరు, ముగ్గురు రోగులను వెంటబెట్టుకుని వస్తున్నారు. వారికి ఓపీ చీటీలు కూడా లేకుండానే స్కానింగ్ తీయాలని, ఇతర పరీక్షలు చేయాలని సిబ్బంది, అధికారులపై ఒత్తిడి చేస్తున్నట్లు సమాచారం. వాస్తవానికి వారు ప్రయివేటు ఆస్పత్రుల్లో వైద్యం చేయించుకుంటూ ఉంటారు. అక్కడ పరీక్షలు చేయించుకుంటే ఎక్కువ డబ్బు చెల్లించాల్సి ఉంటుంది. అటువంటి వారిని సదరు కమిటీ సభ్యుడు ఇక్కడికి తీసుకువచ్చి తన పలుకుబడిని ఉపయోగించి ఉచితంగా స్కానింగ్ తీయిస్తారు. పరీక్షలు చేయిస్తారు.
ఇందుకు ప్రతిఫలంగా వారిని నుంచి ప్రయివేటు ల్యాబ్‌లో అయ్యే ఖర్చులో సగం తీసుకుంటున్నారు. ఇటీవల విజయవాడ ముత్యాలంపాడు ప్రాంతానికి చెందిన ఓ రోగి ప్రయివేటు ఆస్పత్రికి వెళ్లగా, సీటీ స్కాన్ తీయాలని చెప్పారు. ఈ విషయం తెలుసుకున్న ప్రభుత్వాస్పత్రి కమిటీ సభ్యుడు వెంటనే వారితో మాట్లాడారు. రూ.1,000 ఇస్తే ప్రభుత్వాస్పత్రిలో ఎటువంటి వెయిటింగ్ లేకుండానే స్కానింగ్ చేయిస్తానని చెప్పారు. రోగి అంగీకరించడంతో ఆయన వెంటబెట్టుకుని వచ్చి స్కానింగ్ తీయించి పంపారు. ఆయన ఆగడాలు పెరిగిపోతుండటంతో వైద్యులు అసహనం వ్యక్తంచేస్తున్నారు. ఒకవేళ ఆయనకు తెలిసిన వారైతే ఒక ఫోన్ చేస్తే సరిపోతుందని, ఇలా వెంట తీసుకువచ్చి హంగామా చేయడం సరికాదని అభిప్రాయపడుతున్నారు.
ఎమ్మెల్యే దృష్టికి వెళ్లినా..
సింగ్‌నగర్ ప్రాంతానికి చెందిన ఓ దివ్యాంగుడికి మూగ, వినికిడి లోపం వంద శాతం ఉంది. ఆయనకు వికలాంగ ధ్రువీకరణపత్రం కోసం ఆస్పత్రికి వెళ్లారు. అక్కడ సదరు కమిటీ సభ్యుడు కలవడంతో పరిస్థితి వివరించారు. దీంతో రూ.2వేలు ఇస్తే వెంటనే ధ్రువీకరణపత్రం ఇప్పిస్తానని చెప్పారు. ఆ డబ్బులు తనకు కాదని, వైద్యుడికి ఇవ్వాల్సి ఉంటుందని చెప్పారు. ఆ దివ్యాంగుడి కుటుంబ సభ్యులు కార్పొరేటర్‌తో కలిసి ఈ విషయాన్ని స్థానిక ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది. ఇటువంటి పనులు మానుకోవాలని ఎమ్మెల్యే హెచ్చ రించినట్లు సమాచారం. అయినా ఆయ నలో మార్పు రాకపోవడం గమనార్హం.