టీడీపీ నాయకుని బెదిరింపులతో వ్యక్తి ఆత్మహత్య
► పోలీస్‌స్టేషన్ ఎదుట శవంతో
► బాధిత కుటుంబీకుల ధర్నా
కర్నూలు: టీడీపీ నాయకుని బెదిరింపులకు ఓ వ్యక్తి ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. రక్షణ కోరినా పోలీసులు పట్టించుకోలేదని..మృతదేహంతో కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నా చేశారు. ఈ ఘటన శనివారం కర్నూలు నగరంలో చోటుచేసుకుంది. వివరాలు ఇవీ.. కర్నూలు నగరానికిచెందిన లక్ష్మణరావు.. షరాఫ్‌బజార్‌లో ఉన్న దుకాణాన్ని విక్రయించి అదే కాలనీకి చెందిన టీడీపీ నాయకుడు రామయ్య నాయుడు వద్ద రూ.30.60 లక్షలకు ఇళ్లు కొనుగోలు చేశాడు. డబ్బు మొత్తం చెల్లించినప్పటికీ రిజిస్ట్రేషన్ చేయకుండా మాయమాటలతో కాలయాపన చేసి ఇంటిని ఇతరులకు విక్రయించాడు. ఈ విషయంలో ఇరువురి మధ్య వాదన జరగడంతో రామయ్య నాయుడు బెదిరించాడు.
దీంతో కలత చెందిన లక్ష్మణరావు శుక్రవారం రాత్రి ఇంట్లో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యులు గుర్తించి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. స్థానిక టీడీపీ నాయకుడి వల్ల తనకు ప్రాణ హాని ఉందని లక్ష్మణరావు పలుమార్లు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేయకపోవడంతో ఒత్తిడి తట్టుకోలేకనే ఆయన ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని భార్య శ్రీదేవి ఆరోపిస్తూ ఆందోళన చేపట్టారు.
లక్ష్మణరావు ఆత్మహత్యకు కారణమైన రామయ్యను తక్షణమే అరెస్టు చేసి, తమకు చెందాల్సిన ఇంటిని ఇప్పించాలని ఆమె డిమాండ్ చేశారు. సుమారు గంటకు పైగా స్టేషన్ ఎదుట శవాన్ని ఉంచి ఆందోళన చేయడంతో పెద్ద ఎత్తున జనం అక్కడికి చేరుకున్నారు. సీఐ నాగరాజరావు హామీతో వారు ఆందోళన విరమించారు.