రాజ్యాంగేతర శక్తిగా మారిన టీడీపీ ముఖ్యనేత తనయుడు
ఆగడాలకు అడ్డుపడినా..ప్రశ్నించినా దౌర్జన్యాలు, తప్పుడు కేసులు
విలేకరులపై దాడులకు తెగబడుతున్న అధికారపార్టీ గూండాలు
రౌడీ షీటర్లకు అధికారపార్టీ, పోలీసుల అండదండలు
అవినీతి, అక్రమాలపై కథనాలు రాసినందుకే ‘సాక్షి’ విలేకరిపై దాడి
పోలీసుల తీరుపై మండిపడుతున్న జర్నలిస్ట్, ప్రజాసంఘాలు
ఒకప్పుడు బాంబుల మోతలు... ఫ్యాక్షన్ హత్యలు... రిగ్గింగ్‌లతో అట్టుడికిపోయిన నరసరావుపేట నియోజకవర్గంలోని పల్లెలు పదేళ్లుగా ప్రశాంతంగా ఉన్నాయి. తిరిగి టీడీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నరసరావుపేట అరాచక కోటగా మారింది. దౌర్జన్యాలు, దాడులతో అరాచక శక్తులు రాజ్యమేలుతున్నాయి.
గుంటూరు : అధికార పార్టీలో ముఖ్యనేత ఒకరు తన కనుసన్నలతో నియోజకవర్గాన్ని శాసిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఆయన తనయుడు మరో అడుగు ముందుకేసి ప్రతి పనికి ఓ రేటు నిర్ణయించేశారు. అధికారుల బదిలీలనుంచి కార్యాలయాల్లో ఫైళ్ళ వరకు ధర నిర్ణయించి ధనార్జనే ధ్యేయంగా దందా కొనసాగిస్తున్నారు. తన ఆగడాలకు అడ్డుపడిన వారిపై దౌర్జన్యాలకు దిగడం, పోలీస్ శాఖను అడ్డుపెట్టుకుని తప్పుడు కేసులు బనాయిస్తూ భయాందోళనలు సృష్టిస్తున్నారు.
ఆయన అక్రమాలు, అవినీతిని ప్రశ్నిస్తూ కథనాలు రాసే విలేకరులపైనా దాడులకు తెగబడుతు న్నారు. ముఖ్యనేత తనయుని అక్రమాలు, అరాచకాలపై వార్తలు రాయడం, తన అనుచరుడైన రౌడీషీటర్ పోలీస్‌స్టేషన్‌లో చేస్తున్న సెటిల్‌మెంట్‌లపై కథనం రాసినందుకు ‘సాక్షి’ నరసరావుపేట రూరల్ రిపోర్టర్ శివకోటిరెడ్డిపై గురువారం రాత్రి దాడికి ఉసిగొల్పారు. దీని వెనుక పోలీసు అధికారుల హస్తం కూడా ఉన్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
చట్టాలను కాపాడాల్సిన పోలీసులే రౌడీషీటర్‌లతో చేతులు కలిపి ఇలాంటి చర్యలకు దిగడం హేయమైన చర్యగా జర్నలిస్ట్, ప్రజా సంఘాల నేతలు మండిపడుతున్నారు. నియోజకవర్గంలో రియల్ ఎస్టేట్ వ్యాపారులు ల్యాండ్ కన్వర్షన్ కోసం వెళ్తే ముందుగా ముఖ్యనేత తనయుని ఆమోద ముద్ర వేయించుకుని రమ్మంటూ సాక్షాత్తు రెవెన్యూ అధికారులే చెబుతుండడం గమనార్హం. ఎకరాకు రూ.లక్ష చొప్పున చెల్లిస్తేనే ఫైల్ ముందుకు కదులుతుంది.
కోటప్పకొండ వద్ద వంద ఎకరాలు వెంచర్‌వేసిన ఓ రియల్టర్ ముఖ్యనేత తనయునికి అక్షరాల రూ. 50 లక్షలు చెల్లించినట్లు చెబుతున్నారు. అగ్రహారం గ్రామంలో పొలం తాను అడిగిన రేటుకు అమ్మలేదని దేవుడు మాన్యమంటూ ప్రచారం చేసి అధికారులచే జెండాలు పాతించారు. దీంతో బాధితులు ఇచ్చినంత తీసుకొని 20 ఎకరాల భూమిని ముఖ్యనేత తనయుని చేతిలో పెట్టారు. నరసరావుపేటలో అపార్టుమెంటు కట్టాలన్నా, రోడ్లు, డ్రెయిన్ల పనులు చేయాలన్నా, ముఖ్యనేత తనయుడు నిర్ణయించిన పర్సంటేజీలు చెల్లిస్తేనే అక్కడ పనులు జరుగుతాయి.
ఫిర్యాదు చేశారని ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు
గతంలో వ్యవసాయ పరికరాల మంజూరులో డబ్బులు అడిగారంటూ కొందరు టీడీపీ నాయకులే జిల్లా ఉన్నతాధికారులకు ముఖ్యనేత తనయునిపై ఫిర్యాదులు చేసిన విషయం తెలిసిందే. తన అవినీతిని బహిర్గతం చేశారనే కోపంతో వారిపై వెంటనే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టించి రౌడీషీట్‌లు కూడా తెరిపించారంటే పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. తాజాగా విలేకరులపై దాడులకు ఉసిగొల్పుతున్నారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అవగతమవుతోంది.
రాజ్యాంగేతర శక్తిగా మారి ప్రజలు, కాంట్రాక్టర్లు, అధికారులతోపాటు, సొంత పార్టీ నాయకులను సైతం పట్టి పీడిస్తున్న ముఖ్యనేత తనయుని దౌర్జన్యకాండపై అన్ని వర్గాల ప్రజలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. జిల్లాలో నివాసం ఉంటున్న టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటికైనా కళ్లు తెరిచి ముఖ్యనేత తనయుని ఆగడాలకు అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. జిల్లా ఉన్నతాధికారులైనా నరసరావుపేటపై దృష్టి సారించి ప్రజల ధన, మాన, ప్రాణాలకు రక్షణ కల్పించాలని పలువురు కోరుతున్నారు.