యలమంచిలి నియోజకవర్గంలో పచ్చనేత అండ్ కో దోపిడీ
మండలానికో ఇన్‌చార్జితో ప్రత్యేక పాలన
చెరువులు, దేవుని మాన్యాలకూ చెర
భూసేకరణలోనూ అడ్డగోలు దందాలు
విశాఖపట్నం : పంచదార్ల వంటి పుణ్యక్షేత్రం ఉన్న యలమంచిలి నియోజకవర్గంలో ఎక్కడా లేనివిధంగా భూతాల పాలన నడుస్తోంది. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ పచ్చనేతలు తలో మండలాన్ని ఎంచుకుని నంజుకు తింటున్నారు. యలమంచిలి మున్సిపాలిటీకో ఇన్‌చార్జి, రూరల్ మండలం, రాంబిల్లి, అచ్యుతాపురం, మునగపాక మండలాలకు తలా ఒకరు.. నియోజకవర్గ ప్రజాప్రతినిధి కనుసన్నల్లో ప్రత్యేక పాలన సాగిస్తున్నారు.
ఆయా మండలాల్లోని ఎంపీడీవోలు, తహశీల్దార్లు, చివరికి టీడీపీకే చెందిన మండలస్థాయి ప్రజాప్రతినిధులను ఏమాత్రం లెక్క చేయకుండా రెచ్చిపోతున్నారు. అన్ని ప్రభుత్వ శాఖలు, పథకాల్లోనూ వీరి జోక్యం మితిమీరిపోయింది. పరిశ్రమల పుంతగా రూపుదిద్దుకుంటున్న ఈ నియోజకవర్గంలో ప్రజాప్రతినిధితో పాటు ఈ ఇన్‌చార్జీల దోపిడీ ఇప్పటికే వందల కోట్లకు చేరిందంటే అతిశయోక్తి కాదు.
భూసేకరణలోనూ మాయాజాలం
రాంబిల్లి మండలం సీతపాలెం రెవెన్యూ పరిధిలో బినామీ పేర్లతో 27 ఎకరాలను దోచేందుకు రంగం సిద్ధమైంది. ఇదే ప్రాంతంలో ప్రజాప్రతినిధి అండతో ఓ ఫ్యాక్టరీ ఐదెకరాల ప్రభుత్వ భూమిని కబ్జా చేసినా పట్టించుకునే నాధుడే లేడు. మునగపాక మండలం సిరసపల్లి పరిధిలో చేపట్టిన భూసేకరణలో బినామీ పేర్లు చూపించి కోట్లు దోచేశారన్న ఆరోపణలున్నాయి.
ఏపీఐఐసీ భూసేకరణ పేరుతో అచ్యుతాపురం మండలం తంతడి వద్ద వందెకరాల సముద్రపు దిబ్బను బినామీ పేర్లతో దోచేసేందుకు అధికారపార్టీ నేతలు రంగం సిద్ధం చేశారు. రూ.30 నుంచి కూ.40 కోట్ల విలువైన ఈ కుంభకోణంపై బీజేపీ శ్రేణులు సీఐడీ విచారణకు డిమాండ్ చేస్తూ ఫిర్యాదు చేశారంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు.
పరిశ్రమలు మామూళ్లు ఇవ్వాల్సిందే..
యలమంచిలి మండలంలోని ఒక సిమెంట్ కంపెనీ, అచ్యుతాపురం, రాంబిల్లి పరిధిలో పలు పరిశ్రమల నుంచి ప్రజాప్రతినిధి పేరు చెప్పి ఇన్‌చార్జీలు నెలవారీ మామూళ్లు వసూళ్లు చేస్తున్నారన్న వాదనలు ఉన్నాయి. అడిగినంత ఇవ్వకుంటే భూముల పేరిట రైతులతోనూ, ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులతోనూ ఉద్యమాలు చేయిస్తామని బ్లాక్‌మెయిల్ చేసి మరీ లక్షలు గంజుతున్నారన్న ఆరోపణలున్నాయి.
ఇక ఇటీవల నియోజకవర్గంలో ఓ ప్రజాప్రతినిధి జన్మదిన వేడుల పేరిట భారీగా డబ్బులు వసూలు చేశారన్న ఆరోపణలు మూటకట్టుకున్నారు. అచ్యుతాపురం మండలంలోని కంపెనీలకు, రియల్ ఎస్టేట్ వాపారులకు టార్గెట్‌లు పెట్టి మరీ వసూలు చేశారని అంటున్నారు. పల్లె వాతావరణం నుంచి పరిశ్రమల హబ్‌గా రూపు మారుతున్న నియోజకవర్గ పరిధిలో ప్రతి పనిలోనూ కాసుల వేటలో మునిగిపోతున్న ప్రజాప్రతినిధి అండ్ కో దోపిడీకి అడ్డుకట్ట ఎప్పుడు పడుతుందో మరి.
కొండల్ని పిండి చేసి.. కోట్లు కొల్లగొట్టి
తాత్కాలిక పర్మిట్లతో రూ.కోట్లు విలువైన గ్రావెల్‌ను దోచేస్తున్నారు. కొండలను పిండి చేస్తున్నారు. రాంబిల్లి మండలంలో గ్రావెల్ దందాకు తెరలేపారు. నిర్మాణ దశలో ఉన్న ఒక సైనిక స్థావరంతో పాటు ఎస్‌ఈజెడ్‌లోని పలు పరిశ్రమలకు రూ.48 కోట్ల విలువైన గ్రావెల్ కావల్సి ఉంది.
ఇప్పటికే రూ.20 కోట్ల గ్రావెల్ తరలించారు. రాంబిల్లి మండలం పెదకలవలాపల్లి, పంచదార్ల, అచ్యుతాపురం మండలం చోడపల్లి, మునగపాకతోపాటు అనకాపల్లి మండలంలోని పలు ప్రాంతాల నుంచి రూ. కోట్లు విలువైన గ్రావెన్‌ను అక్రమంగా తరలించారు.
గ్రావెల్ క్వారీలకు అనకాపల్లి మండలంలో ఒకటి రెండు చోట్ల మాత్రమే అనుమతులు ఇచ్చినట్లు భూగర్భ, గనుల శాఖ అధికారులు చెబుతున్నారు. దీన్ని బట్టి యలమంచలి నియోజకవర్గంలో గ్రావెల్ తవ్వకాల వెనుక కోట్లాది రూపాయల అవినీతి జరిగిందని తెలుస్తోంది. అధికార పార్టీ నేతలు మండల స్థాయి అధికారులపై ఒత్తిడి తెచ్చి గ్రావెల్ దందాకు తెర లేపినట్టు ఆరోపణలున్నాయి. మునగపాక మండలంలో ఉన్న కొండల నుంచి గత రెండేళ్లలో రూ. 50 లక్షల విలువైన గ్రావెల్‌ను దోచేశారని అధికార పార్టీ నేతలే పేర్కొనడం గమనార్హం.
దేవుని మాన్యాలను వదల్లేదు..
చెరువులు, కొండలే కాదు.. దేవుని మాన్యాలూ అక్రమార్కుల చెరలోకి వెళ్తున్నాయి. యలమంచిలిలోని వీరభద్రస్వామి దేవాలయ భూముల వ్యవహారం కోర్టులో ఉన్నా.. అక్రమార్కులు బెదరడం లేదు. ఇప్పటికే వేల గజాల భూములను టీడీపీ నేతలు అక్రమించేశారు. రాంబిల్లి మండలం రాజకోడూరు పరిధిలో నాగలింగేశ్వరస్వామి దేవాలయామికి చెందిన ఆరెకరాల మాన్యంపై నియోజకవర్గస్థాయి ప్రజాప్రతినిధి కన్నుపడింది. ఎస్‌ఈజెడ్ కాలనీ రాకతో ఆ భూముల విలువ కోట్లకు చేరింది.
దీంతో రికార్డులు తారుమారు చేసి ఆ ఆరెకరాలను కొట్టేసేందుకు పక్కాగా స్కెచ్ రెడీ చేశారని తెలుస్తోంది. అదే మండలం వెంకటాపురం పరిధిలో రూ.20 కోట్ల విలువైన దేవుని మాన్యాన్ని సర్వీస్ నామా కింద మార్చి టీడీపీ కీలక నేతకు ధారాదత్తం చేసేం దుకు రంగం సిద్ధమైంది. ఇక చెరువుల సంగతి చెప్పనవసరంలేదు. ప్రభుత్వ రికార్డుల్లో చెరువులుగా నమోదైన భూముల వివరాలను తారుమారు చేసేస్తున్నారు.
రాంబిల్లి మండలం వెంకయ్యపాలెం గ్రామ పరిధిలో రూ.35 కోట్ల విలువైన కర్ర చెరువును కబళించేందుకు పావులు కదుపుతున్నారు. ఇదే మండలం మూలజంప పరిధిలో నియోజకవర్గ ప్రజాప్రతినిధి సోదరుడు, మండలస్థాయి ప్రజాప్రతినిధి కలిసి ఇసుకను ఇష్టారాజ్యంగా దోచేస్తున్నారు.