నే చెప్పిందే వేదం
► నియోజకవర్గాల్లో అచ్చెన్న మితిమీరిన జోక్యం
► సీనియర్ ఎమ్మెల్యేలకు మింగుడుపడని ధోరణి
► అవమాన పడుతున్న ప్రభుత్వ విప్
► గంటా పర్యటన రద్దుతో కూనకు మరోమారు భంగపాటు
జిల్లా మంత్రి అచ్చెన్నాయుడు తాను చెప్పిందే వేదమనే ధోరణిలో ముందుకు పోతున్నారు. అందుకు అడ్డుతగిలితే స్వపక్షీయులనూ సహించడం లేదు. తనకు తెలియకుండా జిల్లాలో ఎవరూ అడుగు కూడా పెట్టడానికి వీలు లేదంటున్నారు. తాజాగా మంత్రి గంటా శ్రీనివాసరావు ఆమదాలవలస పర్యటన రద్దు వెనుక ఇదే కారణమంటున్నారు. అమాత్యులు సర్వం తానై వ్యవహరిస్తూ పార్టీలో ఇంటిపోరును రాజేస్తున్నారు. అయినదానికీ కానిదానికీ అన్ని నియోజకవర్గాల్లోనూ వేలు పెడుతూ పార్టీ నాయకులను ఇబ్బంది పెడుతున్నారు. అచ్చెన్న స్వపక్ష బాధితుల చిట్టాలో తొలి పేరు విప్ కూన రవికుమార్‌దే కావడం విశేషం.
శ్రీకాకుళం టౌన్: జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో మంత్రి అచ్చెన్నాయుడు హవా సాగించడం పార్టీ నాయకుల్లో ఆగ్రహం కలిగిస్తోంది. సీనియర్ శాసనసభ్యులు శివాజీ, కళావెంకటరావుల నియోజక వర్గాలనూ మంత్రి వదలడం లేదు. దీనిపై ఇటీవల ఎమ్మెల్యే శివాజీ సాక్షాత్తూ ముఖ్యమంత్రి వద్దే పంచాయితీ పెట్టారు. అంబేడ్కర్ యూనివర్సిటీ రిజిస్ట్రార్ నియామకంలో తన నియోజక వర్గానికి చెందిన వ్యక్తిని మంత్రి అడ్డుకుంటున్నారని ఆయన సీఎంకు ఫిర్యాదు చేశారు.
దీనిపై చంద్రబాబు కల్పించుకుని సమస్యను పరిష్కరించారు. కళావెంకటరావు ప్రాతినిథ్యం వహిస్తున్న ఎచ్చెర్లలో జోక్యం చేసుకోవద్దని అచ్చెన్నకు సీఎం సూచించారంటే పరిస్థితి అర్ధమవుతుంది. ఇప్పుడు ప్రభుత్వ విప్ కూన రవికుమార్ విషయంలో మంత్రి అడుగడుగునా అడ్డుతగులుతున్నారన్న చర్చ మొదలైంది. జిల్లాలో మంత్రి తర్వాత పెద్ద హోదాలో రవికుమార్ కొనసాగుతున్నారు. రవికుమార్ దూసుకువెళ్తున్న తీరు అచ్చెన్నకు మింగుడుపడడం లేదని తెలుస్తోంది. దీంతో ఆయన దూకుడు కళ్లెం వేయాలని మంత్రి అడుగడుగునా అడ్డుపడుతున్నారని రవికుమార్ సన్నిహితులు బహిరంగంగా విమర్శిస్తున్నారు.
ఆది నుంచే అడ్డుకునే ప్రయత్నం
ఆర్‌అండ్‌బి శాఖ అతిథి గృహాన్ని విప్‌కు కేటాయించవద్దంటూ ఆరంభంలోనే ఆశాఖ అధికారులపై మంత్రి ఒత్తిడి పెంచారు. ఆమదాలవలసలో ఏపని మంజూరు చేయాలన్నా విప్ అనుమతి అవసరం లేదని తాను చెపితే చాలని హుకుం జారీ చేశారు. విప్ తెలియకుండా కనుగులవలస రక్షిత మంచినీటి పనులకు జడ్పీ చైర్‌పర్సన్ ద్వారా రూ.15లక్షలు మంజూరు చేరుుంచారు. మంత్రి కొల్లు రవీంద్రను టెక్స్‌టైల్ పార్కుకు శంకుస్థాపనకు రానీయకుండా అడ్డుపడ్డారు.
రాజీవ్ విద్యామిషన్‌లో డెప్యూటేషన్‌పై కూన మోహనరావు అనే ఉద్యోగిని మూడు నెలల క్రితం విప్ రవికుమార్ తీసుకు వచ్చారు. నాలుగు నెలలుగా జీతం చెల్లించపోగా ఆయనకు కుర్చీకూడా ఇవ్వలేదు. మంత్రి సమ్మతిస్తేనే సీటు కేటాయిస్తామని ఆశాఖ ఉన్నతాధికారి చెబుతున్నారు. తాజాగా విప్ ప్రాతినిథ్యం వహిస్తున్న ఆమదాలవలస నియోజక వర్గంలో మంత్రి గంటా శ్రీనివాసరావు ఆదివారం పర్యటించాల్సి ఉంది. శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలకు తోడు బహిరంగసభ నిర్వహించాలని విప్ ఏర్పాట్లు చేశారు. చివరినిమిషంలో గంటా పర్యటన రద్దరుుంది. జిల్లాలో తాను లేని సమయంలో వెళ్దొద్దని అచ్చెన్న చెప్పడంతో గంటా గంటా వెనక్కి తగ్గారని తెలిసింది. దీంతో మరోమారు అచ్చెన్నవల్ల రవికి భంగపాటు తప్పలేదు.
రవి కంట్లో ‘ఇసుక’
ఇసుక రేవుల విషయంలో విప్ మాట చెల్లడం లేదు. ఈయన వర్గీయులుగా భావిస్తున్నవారి ట్రాక్టర్లను కలెక్టరు ఇటీవల సీజ్ చేయించారు. పెద్దెత్తున అక్రమాలు జరుగుతన్న నరసన్నపేట ,పాతపట్నంలో ఒక్క ట్రాక్టరునూ పట్టుకోని అధికారులు తమ నేత నియోజకవర్గం లోనే చెలరేగుతున్నారని విప్ వర్గీయులంటున్నారు. మంత్రి ఆదేశాలమేరకే అధికారులు ఇలా చేస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు. అచ్చెన్న అవమానాలు భరించలేనని రవి సన్నిహితుల వద్ద చెబుతున్నట్లు సమాచారం. సీంఎ చంద్రబాబు ముందు పంచాయితీకి సిద్ధమవుతున్నారని తెలుస్తోంది. మంత్రి..విప్‌ల మధ్య విభేదాలు అధికారులకు తలనొప్పిగా తయూరయ్యూయి. ఎటువెళ్తే ఏం ముప్పు వస్తుందోనని హడలిపోతున్నా రు. వీరిద్దరి మధ్య నలిగిపోతున్నారు.
అచ్చెన్న తీరుపై మండిపడ్డ పార్టీ నేతలు
శ్రీకాకుళం టౌన్ ః జిల్లా మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఏకపక్ష నిర్ణయాలను ఆ పార్టీ నాయకులు ధ్వజమెత్తారు. టీడీపీ నియోజకవర్గ స్థాయిలో మంత్రి ద్వితీయ శ్రేణి వర్గాలను కూడగడుతున్నారని ప్రభుత్వ విప్ కూన రవికుమార్, ఎమ్మెల్యేలు శివాజీ, బగ్గు రమణమూర్తి ఆగ్రహం వ్యక్తంచేసినట్లు తెలిసింది. నియోజకవర్గ స్థాయిలో వర్గాలను తయారు చేస్తే పార్టీకి నష్టమని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
ఆదివారం రాత్రి ఆర్‌అండ్ బీ అతిథి గృహంలో టీడీపీ సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. సభ్యులు మినహా మిగిలిన ఎవరినీ లోపలికి అనుమతించలేదు. వైఎస్సార్‌సీపీ నాయకుడు ధర్మాన ఇటీవల బహిరంగంగా టీడీపీ నాయకులపై చేస్తున్న ఆరోపణలను ఎదుర్కోవడానికి జిల్లా స్థాయిలో కమిటీని సిద్ధం చేయాలని ఎమ్మెల్యే లక్ష్మీదేవికి సూచించారు.
రానున్న నగరపాలక సంస్థ ఎన్నికల నేపథ్యంలో పట్టణ ప్రజలకు తప్పుడు సంకేతాలు వెళతాయని, అందువల్ల ఎప్పటికప్పుడు ఆయన వ్యాఖ్యలను ఖండించి కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపేందుకు సమర్ధవంతమైన వారిని కమిటీలో వేయాలని మంత్రి సూచించారు. సమావే శానికి జిల్లా పార్టీ అధ్యక్షురాలు గౌతు శిరీషతోపాటు జెడ్పీ చైర్‌పర్సన్ చౌదరి ధనల క్ష్మి, విప్ కూన రవికుమార్, ఎమ్మెల్యే శివాజి, గుండ లక్ష్మీదేవి, బగ్గు రమణమూర్తి, ఎంపీ కింజరాపు రామ్మోహన్‌నాయుడు తదితరులు హాజరయ్యారు.