
సిద్ధాంతి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాతే...
టీడీపీ తాత్కాలిక రాష్ట్ర కార్యాలయం కోసం భవనం అన్వేషణ ప్రారంభమైంది.
టీడీపీ తాత్కాలిక రాష్ట్ర కార్యాలయం కోసం కసరత్తు
న్యాక్ కల్యాణ మండపంపై దృష్టి
పోరంకిలోని ఎమ్మెల్యే బోడే ప్రసాద్ కార్యాలయం పరిశీలన
విజయవాడ : టీడీపీ తాత్కాలిక రాష్ట్ర కార్యాలయం కోసం భవనం అన్వేషణ ప్రారంభమైంది. రాష్ట్ర విభజన అనంతరం టీడీపీ రాష్ట్ర కార్యాలయాన్ని విజయవాడ నుంచే నిర్వహించాలనే ఉద్దేశంలో నగరంలోని బందరురోడ్డులో ఉన్న జిల్లా పార్టీ కార్యాలయంలోకి తాత్కాలికంగా రాష్ట్ర కార్యాలయాన్ని మార్పు చేశారు. అయితే ప్రస్తుతం ఈ భవనం ఏమాత్రం సరిపోకపోవడంతో రాష్ట్ర కార్యాలయానికి కొత్త భవనం తీసుకోవాలని నిర్ణయించారు.
తెలంగాణాలో టీడీపీ రోజురోజుకు దిగజారిపోవడంతో ఆంధ్రప్రదేశ్ వరకు పార్టీ కార్యక్రమాలను విజయవాడలోనే నిర్వహించాలని పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు, జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ భావిస్తున్నారు. రెండు మూడు రోజులుగా నేతలు రాష్ట్ర పార్టీ కార్యాలయానికి అనువుగా ఉన్న భవనం కోసం అన్వేషిస్తున్నారు.
పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్‌కు చెందిన కార్యాలయం పోరంకిలో ఉండటంతో దాన్ని పరిశీలించారు. అలాగే సిరీస్ కంపెనీకి పక్కనే సిటీకేబుల్ అధినేత పొట్లూరి సాయిబాబాకు చెందిన భవనాన్ని పరిశీలించారు. గురునానక్ కాలనీలోని న్యాక్ కల్యాణ మండపాన్ని సందర్శించారు. ఇవే కాకుండా నగరంలో మరో ఒకటి రెండు భవనాలు చూసినట్లు తెలిసింది.
సిద్ధాంతి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాతే...
ముఖ్యమంత్రి చంద్రబాబు వాస్తును బాగా నమ్ముతున్నారు. సీఎం క్యాంపు కార్యాలయాన్ని కూడా వాస్తుకు అనుకూలంగా మార్చారు. పార్టీ నేతలు అన్వేషించిన భవనాన్ని చంద్రబాబుకు సంబంధించిన వాస్తు సిద్ధాంతి ఒకరు వచ్చి పరిశీలించి వెళ్తున్నారు. ఆయన ఆమోదం పొందిన తర్వాతే పార్టీ కార్యాలయాన్ని ప్రారంభిస్తారని సమాచారం.
న్యాక్ కల్యాణ మండపం వాస్తుకు అనుకూలంగా ఉందని చెప్పడంతో ఆ భవన యజమానితో మాట్లాడమని పార్టీ అధిష్టానం నుంచి నాయకులకు ఆదేశాలు వచ్చినట్లు తెలిసింది. ఆ కల్యాణమండపం యజమాని, టీడీపీ నేత పొట్లూరి కాశీ ఇప్పటికే పార్టీ అవసరాలకు వాడుకోవాలని లేఖలు కూడా రాసినట్లు సమాచారం. ఒకటి రెండు రోజుల్లో ఏ విషయం తేలనుంది.