తేలని టీడీపీ సీటు వ్యవహారం
ఎవరికి వారే ప్రజల్లోకి
స్వతంత్ర సంకేతంతో బోడె ప్రచారం
అసంతృప్తుల చుట్టూ తుమ్మల ప్రదక్షిణ
అయోమయంలో శ్రేణులు
కంకిపాడు: పెనమలూరు టీడీపీలో కుర్చీలాట సాగుతోంది. ఎవరికి వారే సీటు కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. అధిష్టానం సీటును ఎవరికిచ్చేది తేల్చకుండా నాన్చుతోంది. దీంతో ఆశావహుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. సీటే తేలకపోవటంతో పార్టీ శ్రేణులు గందరగోళంలో పడుతున్నాయి. అధిష్టానం తీరు సరికాదంటూ మండిపడుతున్నాయి
ఇదెక్కడి లొల్లి..
సమీకరణల్లో సీటు ఇవ్వటం కుదరటం లేదని టీడీపీ అధినేత చంద్రబాబు బోడె ప్రసాద్‌కు తేల్చిచెప్పారు. తనకు అధిష్టానం అన్యాయం చేయాలని చూస్తోందని, ప్రజలే న్యాయం చెప్పాలంటూ బోడె ప్రసాద్ ప్రజల్లోకి వెళ్తున్నారు. ఇప్పటికే ఇంటింటి ప్రచారం చేస్తూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు. స్వతంత్రంగానైనా పోటీకి సిద్ధమనే సంకేతాన్ని అధిష్టానానికి పంపారు. బయటి వ్యక్తులు, వెదవలు, ఓటమిపాలయ్యే వాళ్లకు సీటు ఇస్తే ఊరుకోనంటూ అధిష్టానంపై ఘాటు వ్యాఖ్యలు చేయటం తెలిసిందే. మరో వైపు చలసాని పండు కుమార్తె దేవినేని స్మిత 2014 ఒప్పందం ప్రకారం సీటు వస్తుందని భావిస్తున్నారు.
కొద్ది నెలలుగా బాబు ష్యూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమాన్ని గ్రామాల్లో నిర్వహిస్తున్నారు. వర్గాన్ని సమీకరించి పోటీకి సమాయత్తం అవుతున్నారు. అయితే బోడె ప్రసాద్‌కు సీటు ఇస్తే సహకరించేది లేదని కూడా చెబుతున్నట్లు తెలిసింది. తాజాగా టీడీపీలో చేరిన తుమ్మల చంద్రశేఖర్ మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ వ్యతిరేక వర్గాన్ని దగ్గర చేసుకునే పనిలో ఉన్నారు. ఇప్పటికే మాజీ ఎమ్మెల్సీ వైవీబీ రాజేంద్ర ప్రసాద్, నియోజకవర్గంలోని పలువురు నేతలను కలుసుకుని మద్దతు కోరుతున్నారు. ఈ చర్యతో కొత్త వర్గం నియోజకవర్గంలో తయారైంది.
తలలు పట్టుకుంటున్న శ్రేణులు..
ఎవరికి వారే ప్రజల్లోకి వచ్చి సీటు నాదే అంటూ ప్రచారం చేసుకుంటున్నారు. దీనికి తోడు రోజుకో కొత్త పేరు తెరపైకి వస్తోంది. లోకల్‌కి ఇస్తారా?, నాన్ లోకల్‌కి ఇస్తారా? అర్థం కాక ఎవరి వెంట ప్రయాణం చేయాలో పాలుపోక తలలు పట్టుకుంటున్నారు టీడీపీ కార్యకర్తలు. అధిష్టానం తీరు నచ్చక కొందరు పార్టీ మారుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment