ఎన్టీఆర్: మూడు దశాబ్దాలకు పైగా రాజకీయ చరిత్ర, నాలుగుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన దేవినేని ఉమామహేశ్వరరావు రాజకీయంగా గడ్డు పరిస్థితులు ఎదురవుతున్నాయి. రానున్న శాసన సభ ఎన్నికలలో తెలుగుదేశం అభ్యర్థిగా పోటీ చేసేందుకు దేవినేని ఉమామహేశ్వరరావు పాటు అతని ముఖ్య అనుచరుడు గన్నే వెంకటనారాయణ ప్రసాద్(అన్నా), బొమ్మసాని సుబ్బారావుతో పాటు ప్రస్తుత నియోజకవర్గ ఎమ్మెల్యే వసంత వెంకటకృష్ణప్రసాద్ సైతం పోటీ పడుతున్నారు. దేవినేని ఉమా మినహా ముగ్గురు ఆశావహులు తమ స్టైల్లో అంతర్గతంగా, బహిరంగంగా ప్రచారం చేస్తూ ముప్పేట దాడి చేస్తుండడంతో దేవినేని ఉమా రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది.
గత కొన్ని నెలల క్రితం బొమ్మసాని సుబ్బారావు టీడీపీ అభ్యర్థిత్వం ఆశిస్తూ నియోజకవర్గ నాయకులతో ఆత్మీయ సమావేశం నిర్వహిండంతో పాటు శుక్రవారం నియోజకవర్గంలోని పలువురు నాయకులను కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది. అదేవిధంగా గన్నె వెంకటనారాయణప్రసాద్(అన్నా) సైతం గత కొన్ని నెలలుగా నియోజకవర్గంలో సంచరిస్తూ సామాజిక సేవా కార్యక్రమాలను సైతం నిర్వహించడం, ఇటీవల నారా లోకేష్‌ని కలవడం చూస్తే తానూ మైలవరం స్థానాన్ని ఆశిస్తున్నట్లు అర్థమవుతోంది.
నమ్మకం కలిగించేందుకు..
ఇదిలా ఉంటే అధిష్టానం నుంచి ఎటువంటి స్పష్టత లేకపోవడంతో దేవినేని ఉమామహేశ్వరరావు తన అభ్యర్థిత్వం కోసం నానా యాతనలు పడుతున్నారు. తానే నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి అని కేడర్‌కి నమ్మకం కలిగించేందుకు గత మూడు రోజులుగా నియోజకవర్గంలోని పలు గ్రామాలలో బాబు గ్యారంటీ భవిష్యత్తు ష్యూరిటీ పేరుతో కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో దేవినేని ఉమామహేశ్వరరావు కార్యక్రమానికి దూరంగా ఉండాలని పార్టీ ముఖ్య నాయకులకు ఇప్పటికే అధిష్టానం నుంచి ఆదేశాలు వచ్చినట్లు తెలుస్తుంది. ఈ క్రమంలో దేవినేని ఉమా నిర్వహిస్తున్న కార్యక్రమాలకు హాజరయ్యేందుకు పార్టీ కేడర్ పెద్దగా ఆసక్తి చూపడంలేదని తెలుస్తుంది.
కారణమిదేనా..
దేవినేని ఉమాకి రాజకీయంగా గడ్డు పరిస్థితులు ఎదురు కావడానికి కారణాలు లేకపోలేదు. ఉమా తన వైఖరితో పార్టీ ముఖ్య నాయకులపై అహంకార పూరితమైన వ్యాఖ్యలు చేయడం, స్థానిక సంస్థల ఎన్నికలలో పోటీ చేసిన అభ్యర్థులకు ఆర్థిక పరమైన సహకారం ఇస్తానని మోసం చేయడం, కొంత మంది అనుచరులకే కాంట్రాక్టులు కట్టబెట్టడం వంటి చర్యలే దేవినేని ఉమాకి నేడు శాపాలుగా మారాయని సొంత పార్టీ నేతలే చర్చించుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment