ఉమ్మడి కృష్ణా జిల్లాలో ‘కూటమి’ పరిస్థితి నానాటికీ తీసికట్టుగా మారుతోంది. ఇంకా టికెట్ల పంచాయితీ కొలిక్కిరాకపోవడం.. ప్రకటించిన సీట్లలోనూ కొందరు అభ్యర్థుల ప్రవర్తన, మాటతీరుతో కూటమి మూడు పార్టీల నేతలను ఏకతాటిపైకి తీసుకురాకపోగా.. వంకరటింకరగా ఎవరిదారి వారిదే అన్నట్లు చేస్తోంది. మరోవైపు పార్టీ మారిన జంపింగ్ జపాంగ్‌లకు ఎదురుగాలి వీస్తోంది. ముఖ్యంగా తిరువూరు, మైలవరం, విజయవాడ వెస్ట్ నియోజకవర్గాల్లో కూటమి ఉక్కిరిబిక్కిరి అవుతోంది.
సాక్షి ప్రతినిధి, విజయవాడ: తిరువూరు టీడీపీ అభ్యర్థి కొలికపూడి శ్రీనివాస్. ఈయన ఆది నుంచి వివాదాస్పదుడే. అమరావతి రైతుల జేఏసీ కన్వీనర్ ముసుగులో పచ్చ మీడియాకు చంద్రబాబు డైరెక్షన్‌లో అద్దె మైకుగా పని చేశారు. చర్చా వేదికల్లో పలు సందర్భాల్లో ఆయన చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. దీనికి ప్రతిఫలంగానే చినబాబు సిఫారసుతో స్థానిక నేతలను కాదని తిరువూరు టీడీపీ టికెట్ దక్కించుకున్నారు.
నియోజకవర్గంలో ప్రవేశించినప్పటి నుంచి వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లోకి ఎక్కారు. ఏ.కొండూరు మండలంలో తాగునీరు సజావుగా సరఫరా అవుతున్నా.. గిరిజనులు తాగునీటి సమస్యతో ఇబ్బంది పడుతున్నారని పాదయాత్ర పేరుతో రెండు కిలోమీటర్లు కూడా నడవకుండానే హడావుడి చేసి అభాసుపాలయ్యారు. మూడునెలల తర్వాత రాష్ట్రంలో ఉన్న వైఎస్సార్ విగ్రహాలన్నీ కూల్చివేస్తామని చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. నియోజకవర్గంలోని ప్రజల నుంచే తీవ్ర ప్రతిఘటన ఎదుర్కోవాల్సి వచ్చింది. డ్రెయినేజీలో ఉన్న కప్పలను పట్టి కూర వండి పంపిప్తాను తినండి అంటూ మున్సిపల్ అధికారులను కించపరిచేలా సందేశం పంపారు.
ఆర్యవైశ్యుల సమావేశంలో మిగతా కులాలను కించపరిచే విధంగా చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. తాజాగా పదో తరగతి పరీక్ష కేంద్రంలోకి వెళ్లి ప్రచారం చేసి, ఎన్నికల ప్రవర్తనా నియామవళిని ఉల్లంఘించారు. దీనికి తోడు నియోజకవర్గంలో ఉన్న టీడీపీ నాయకులు, క్యాడర్‌తో సఖ్యత పూర్తిగా లోపించింది. ఆయన ఒక్కరే బయటి నుంచి తెచ్చుకున్న యువకులతో కలిసి ప్రచారం చేయటాన్ని టీడీపీ నేతలు జీర్ణించుకోలేక పోతున్నారు. దీంతో టీడీపీ సొంత సామాజిక వర్గానికి చెందిన నేతలంతా ఈయన మాకొద్దు బాబూ! అంటూ చంద్రబాబుకు ఫిర్యాదు చేసినట్లు ప్రస్తుతం నియోజకవర్గంలో చర్చసాగుతోంది. గత ఎన్నికల్లో టీడీపీలో పోటీ చేసిన జవహర్, ఇక్కడ మళ్లీ పోటీ చేయాలనే యోచనలో ఉన్నట్లు సమాచారం.
వెస్ట్‌లో వార్..
విజయవాడ వెస్ట్‌లో పోతిన మహేష్‌కే టికెట్ కేటాయించాలని జనసేన కార్యకర్తలు రోడ్డెక్కి ధర్నా చేస్తున్నారు. పోతిన కాకుండా ఎవరికి టికెట్ కేటాయించినా.. జనసేన కార్యకర్తలు సహకరించేది లేదని తేల్చి చెబుతున్నారు. ఇక్కడ పొత్తులో భాగంగా సీటు బీజేపీకి కేటాయించింది. అక్కడ బీజేపీ తరఫున ఇంకా అభ్యర్థిని ఖరారు చేయలేదు. దీంతో అక్కడ పోటీచేసే అభ్యర్థి ఎవ్వరోననే సందిగ్ధత నెలకొంది.
వసంతకు ఎదురుగాలి..
మైలవరం నియోజకవర్గంలో ఇటీవల వైఎస్సార్ సీపీని వీడి టీడీపీలో చేరిన ఎమ్మెల్యే వసంతకృష్ణ ప్రసాద్ ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. టికెట్‌కు సంబంధించి టీడీపీ అధిష్టానం తాజాగా ఐవీఆర్‌ఎస్ సర్వే నిర్వహించింది. దీనిలో ప్రతికూల ఫలితాలు వచ్చినట్లు తెలిసింది. క్షేత్ర స్థాయిలో వసంత కృష్ణ ప్రసాద్‌పై నియోజకవర్గ ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. పార్టీమారి పోటీ చేయటాన్ని ప్రజలు సహించటం లేదు. డబ్బుతో నేతలను మేనేజ్ చేస్తున్నప్పటికీ, ప్రజలు మాత్రం ఈయన తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
వైఎస్సార్ సీపీ మాత్రం బీసీ వర్గానికి చెందిన సామాన్య వ్యక్తికి సీటు కేటాయించింది. ఇక్కడ బీసీ వర్గానికి సంబంధించి లక్షకుపైగా ఓట్లు ఉండటం వసంతను ప్రస్తుతం కలవరపెడుతోంది. సామాన్యుని చేతిలో ఓటమి తప్పదేమో అనే బెంగ ఆయన పట్టి పీడిస్తోంది. దీంతో ఆయన కంగారు పడుతున్నట్లు ఆయన అనుచరులే పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం జరిగిన విలేకరుల సమావేశంలో అడిగిన ఓ ప్రశ్నకు సూటిగా సమాధానం చెప్పకుండా తిట్ల దండకం అందుకోవడం ఆయనలో పెరుగుతున్న అసహనానికి అద్దం పడుతోంది.
కృష్ణా జిల్లాలోనూ కంగారే..
కృష్ణా జిల్లాలోని పెనమలూరు టికెట్‌పై ఇంకా సందిగ్ధం కొనసాగుతూనే ఉంది. రోజుకొక పేరు తెరపైకి వస్తోంది. పొత్తులో భాగంగా అవనిగడ్డ సీటు జనసేన కోటాలోకి వెళ్లినా అక్కడ కూడా ఇంకా అభ్యర్థిని ప్రకటించపోవడంతో, కార్యకర్తల్లో గందరగోళం నెలకొంది. ఆది నుంచి పార్టీ కోసం కష్టపడిన నేతలను కాదని, టీడీపీ అధినేత డైరెక్షన్‌లో అరువు నేతలకు టికెట్ కేటాయిస్తారనే అనుమానం జనసేన కార్యకర్తలను పట్టి పీడిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment