విజయవాడ పశ్చిమ అభ్యర్థిగా సుజనాచౌదరి
పవన్‌కల్యాణ్‌ను కలిసిన జనసేన నేత పోతిన మహేష్
కూటమిని ఓడిస్తామంటున్న నగరాల సామాజికవర్గం
వన్‌టౌన్(విజయవాడపశ్చిమ): పశ్చిమ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థిగా కేంద్ర మాజీ మంత్రి వై.సుజనాచౌదరిని ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది. టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి అభ్యర్థిగా ఆయన్ను ప్రకటించడంతో స్థానిక బీజేపీ నాయకులు భగ్గుమన్నారు. బ్యాంకులను మోసగించిన పారిశ్రామికవేత్తగా విమర్శలు ఎదుర్కొంటున్న సుజనాచౌదరిని పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థిగా నియమించడంపై సొంత పార్టీ నుంచే తీవ్ర వ్యతిరేకత వచ్చింది. రెండు రోజుల నుంచి సుజనాచౌదరి పేరు ప్రచారంలోకి వచ్చినా బుధవారం సాయంత్రం ఆ పార్టీ పెద్దల నుంచి అధికారిక ప్రకటన వెలువడింది.
ఆశావహులకు మొండి చేయి
బీజేపీ నుంచి పలువురు స్థానిక నేతలు ఈ సీటు తమకు కేటాయించాలని దరఖాస్తు చేశారు. వారిలో పార్టీ జిల్లా అధ్యక్షుడు అడ్డూరి శ్రీ రాము, ఎన్‌ఆర్‌ఐ గొలగాని రవికృష్ణ, పార్టీ సీనియర్ నేత బొబ్బరి శ్రీరామ్ తదితరులు ఉన్నారు. రాష్ట్ర కమిటీ అడ్డూరి శ్రీరామ్ పేరు ఎంపిక చేసినట్లుగా తొలుత ప్రచారం జరిగింది. అడ్డూరి శ్రీరామ్ సైతం నగరాల సామాజికవర్గానికి చెందిన నాయకుడు . అయితే స్థానికేతర పారిశ్రామికవేత్తను తీసుకొచ్చి పోటీలో నిలప డంపై బీజేపీ, జనసేన పార్టీల నుంచే కాకుండా నగరాల సామాజిక వర్గం నుంచి కూడా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.
కూటమిలోని రెండు పార్టీలూ తమను మోసం చేశాయని, వారికి తగిన బుద్ధి చెబుతామని ఆ సామాజికవర్గానికి చెందిన నాయకులు ఇప్పటికే పత్రికా ప్రకటనలు చేశారు. సుజనాచౌదరి పేరును వ్యతిరేకిస్తూ ఆయన తరఫున పనిచేయబోమని ఆ పార్టీ నాయకులు పార్టీ పెద్దలకు చెబుతున్నారు. పశ్చిమ టీడీపీకి చెందిన పలువురు నేతలతో సుజనాచౌదరికి ఆర్థిక లావాదేవీలు ఉండటంతో వారు పెద్దగా స్పందించడం లేదు. ఆర్థికంగా తమకు మేలు జరిగే అవకాశం ఉందని వారు సంబరపడుతున్నారని టీడీపీకి చెందిన ఒక నాయకుడు వ్యాఖ్యానించారు.
పోతిన మహేష్‌కు నిరాశ
జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన మహేష్ ఈ సీటు నుంచి పోటీ చేయాలని భావించారు. గడిచిన ఐదేళ్లుగా ఆయన కష్టపడుతున్నారు. ఈ సీటు బీజేపీకి కేటాయించారని తెలిసి పది రోజులుగా ఆయన నిరసన గళాన్ని బలంగా వినిపిస్తున్నారు. పోతిన మహేష్ నగరాల సామాజికవర్గానికి చెందిన నాయకుడు. మహేష్ బుధవారం పార్టీ అధినేత పవన్‌కల్యాణ్‌ను కలిసినా ఆయన నుంచి ఎటువంటి స్పందన లేకుండాపోయింది.
Comments
Please login to add a commentAdd a comment