
చట్టసభల్లో బీసీ రిజర్వేషన్ల కోసం ఉద్యమం
కర్నూలు: చట్ట సభల్లో బీసీలకు జనాభా దామాషా ప్రకారం 50 శాతం రిజర్వేషన్లు సాధించుకునేందుకు ఉద్యమం చేపడుతామని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్.కృష్ణయ్య చెప్పారు. బీసీ సంఘం జిల్లా అధ్యక్షుడు వై.నాగేశ్వర్‌రావు యాదవ్ స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. బీసీ రిజర్వేషన్ల సాధన కోసం ఇప్పటకే పలుసార్లు ప్రధానమంత్రిని, కేంద్రంలోని బీసీ మంత్రులను, గతంలో రాష్ర్టపతిని కూడా కలిశామని ఆయన గుర్తుచేశారు.
జనాభాలో అత్యధిక శాతంగా ఉన్న బీసీలు రిజర్వేషన్లు లేని కారణంగా రాజకీయంగా, సామాజికంగా అన్ని రంగాల్లో అణచివేతకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయ ఆధిపత్యం ఉంటేనే బీసీలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతారన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. అలాగే రాష్ట్రంలో బీసీల అభివృద్ధి కోసం రూ.20వేల కోట్లతో బీసీ సబ్‌ప్లాన్‌ను ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. వివిధ కారణాలను చూపుతూ ఎస్సీ,ఎస్టీ,బీసీ హాస్టళ్లను ఎత్తివేసే చర్యకు ప్రభుత్వం స్వస్తి పలకాలన్నారు. పెండింగ్‌లో ఉన్న ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్‌మెంటకు సంబంధించి అవసరమైన బడ్జెట్‌ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి నక్కలమిట్ట శ్రీనివాసులు, బీసీ యువజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాంబాబు, జిల్లా కార్యదర్శి కేతూరి మధు, వాడాల నాగరాజు, బీసీ,ఎస్సీ,ఎస్టీ మైనార్టీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు కె.రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.