
సవాల్ విసురుకుంటున్న అధికార పార్టీ ఎంపీటీసీలు
♦ రసాభాసగా కనిగిరి మండల పరిషత్ సమావేశం
♦ ఒకరినొకరు తోసుకున్న అధికార పార్టీ సభ్యులు
♦ మైక్ విసిరికొట్టిన ఎంపీటీసీ గురవయ్య
ప్రకాశం కనిగిరి : ఏం.. ఏంటి నువ్వు మాట్లాడేది.. దమ్ముంటే బయటకు రా.. చూసుకుందాం.. ఇవి ఎక్కడో వీధి రౌడీల మాటలు కాదు. కనిగిరి మండల పరిషత్ సర్వసభ్య సమావేశంలో అధికార పార్టీ నాయకుల హెచ్చరికలు. అంతటితో ఆగకుండా ఒకరినొకరు తోసుకోవడంతో సభ రసాభాసగా ముగిసింది. మండల సర్వసభ్య సమావేశం ఎంపీపీ నంబుల వెంకటేశ్వర్లు అధ్యక్షతన గురువారం నిర్వహించారు. ఏఈఓ మాట్లాడిన తర్వాత ఎంపీటీసీ సభ్యుడు కాసుల గురవయ్య జోక్యం చేసుకుని పంట నష్టపరిహారానికి సంబంధించి యడవల్లి పంచాయతీ నుంచి 200 మంది రైతుల పేర్లు ఇచ్చారని, అందులో 90 మందినే అర్హులుగా గుర్తించారని, కేవలం ఒక వర్గం వారికే ప్రాధాన్యం ఇస్తున్నారంటూ గురవయ్య నిలదీశాడు.
ఆ 90 మందిలో కూడా 20 మంది అనర్హులు, ఇతర గ్రామాల వారున్నారని, వారికి రూ.5 లక్షలు వస్తాయని, మీరు, నాయకులు కుమ్మక్కై పంచుకుంటున్నారా..అంటూ ఘాటుగా ఆరోపించారు. ఎస్సీ కార్పొరేషన్ రుణాలు కూడా ఎంపీపీ వర్గానికే ఇచ్చారని, మేం అధికార పార్టీ నాయకులం కాదా అంటూ.. ఎంపీడీఓపై ధ్వజమెత్తారు. పరిహారం జాబితాపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. అధికారులు, నాయకులపై ఆరోపణలు చేయడం సరికాదని వైస్ ఎంపీపీ పాలూరి రమణారెడ్డి సర్ది చెప్పే ప్రయత్నం చేయడంతో వారిద్దరి మధ్య దాదాపు అరగంట సేపు వాదులాట జరిగింది. నీన్ను అడగలేదు.. నేను ఎంపీపీని అడుగుతున్నా.. అసలు నీవు ఎవరు స్పందించడానికని ఎంపీటీసీ కాసుల గురవయ్య వైస్ ఎంపీపీపై మండిపడ్డారు.
తనకు సమాధానం చెప్పేంత వరకూ సమావేశం జరగన్వినని గురవయ్య అనడంతో అసలు నువ్వు ఎవరంటే.. నువ్వ ఎవరంటూ.. ఎంపీటీసీ కాసుల, వైస్ ఎంపీపీ పాలూరి మధ్య పెద్ద రగడే జరిగింది. ఈ క్రమంలో ఎంపీపీ, ఎంపీటీసీ సభ్యుల మధ్య కూడా వాదన జరిగింది. గురవయ్య మైక్ పీకేయడంతో రచ్చ మరింత పెరిగింది. రా..చూసుకుందాం రా.. అంటూ ఒకరిపైకి మరొకరు వెళ్లి తోసుకున్నారు. జెడ్పీటీసీ దంతులూరి ప్రకాశం, మిగిలిన సభ్యులు, ఎంపీడీఓ జోక్యం చేసుకోవడంతో సమస్య సద్దుమణిగింది.
సమస్యలపై ధ్వజమెత్తిన
వైఎస్సార్ సీపీ ఎంపీటీసీ సభ్యుడు
సభలో పలు సమస్యలపై వైఎస్సార్ సీపీ ఎంపీటీసీ సభ్యుడు బాల మాలకొండారెడ్డి అధికారులను నిలదీశారు. బల్లిపల్లిలో డ్వాక్రా గ్రూపు అధ్యక్షురాలు రూ 2.09 లక్షలు స్వాహా చేసినా ఎందుకు పట్టించుకోలేదని ఏపీఎంను నిలదీశారు. విషయం తన దృష్టికి ఆలస్యంగా వచ్చిందని, బ్యాంక్ మేనేజర్‌తో మాట్లాడి విచారణ చేయిస్తామని ఆయన వివరణ ఇచ్చారు. పారిశుద్ధ్యం, పాఠశాలలో పరిశుభ్రత, తదితర అంశాలపై సభ్యులు మాట్లాడారు. సమావేశంలో డిప్యూటీ డీఈఓ జి.సుబ్బరత్నం, డాక్టర్ రాజ్యలక్ష్మి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.