విద్యార్థిని చితకబాదిన టీచర్‌ | Teacher thrashes student | Sakshi
Sakshi News home page

విద్యార్థిని చితకబాదిన టీచర్‌

Published Wed, Dec 14 2016 12:32 AM | Last Updated on Fri, Nov 9 2018 5:02 PM

విద్యార్థిని చితకబాదిన టీచర్‌ - Sakshi

విద్యార్థిని చితకబాదిన టీచర్‌

  •  తలకు తీవ్ర గాయం
  • ధర్మవరంలోని భాష్యం స్కూల్‌లో ఘటన 
  •  

    ధర్మవరం టౌన్ :

    తమ పిల్లవాడికి చదువు సక్రమంగా చెప్పలేదని ప్రిన్సిపల్‌కు తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారని మనసులో పెట్టుకున్న  ఓ టీచర్‌..ఆ విద్యార్థిని చితకబాదింది. బలంగా కొట్టడంతో తలకు రక్తగాయమైంది. ఈ ఘటన అనంతపురం జిల్లా ధర్మవరం పట్టణంలోని భాష్యం ఇంగ్లిష్‌ మీడియం స్కూల్‌లో మంగళవారం చోటు చేసుకుంది. విద్యార్థి తల్లిదండ్రుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. పట్టణంలోని శివానగర్‌కు చెందిన రాము, శ్రీదేవి దంపతుల కుమారుడు హరి కిశోర్‌. కాలనీకి సమీపంలోని భాష్యం ఇంగ్లిష్‌ మీడియం స్కూల్‌లో ఒకటో తరగతి చదువుతున్నాడు. హిందీ టీచర్‌ నసీనా పాఠాలు సరిగా చెప్పడం లేదని ఇటీవల జరిగిన పేరెంట్స్‌మీట్‌లో  హరికోశోర్‌ తల్లిదండ్రులు ప్రిన్సిపల్‌ వెంకటరావుకు ఫిర్యాదు చేశారు. ఇది మనసులో పెట్టుకున్న నసీనా తరచూ పిల్లాడి పట్ల అమానుషంగా ప్రవర్తించేది. చిన్నారిని ఎడాపెడా గిచ్చడం, కొట్టడం, తిట్టడం చేసేది. ఈ క్రమంలోనే మంగళవారం విద్యార్థి క్లాస్‌రూంలో అల్లరి చేస్తున్నాడనే సాకుతో పలక తీసుకుని తలపై బలంగా మోదింది. తీవ్రగాయమై విద్యార్థి చొక్కా అంతా రక్తంతో తడిసిపోయింది. దీంతో భయపడిపోయిన పాఠశాల ప్రిన్సిపల్‌ వెంకటరావు తల్లిదండ్రులను పిలిచి తప్పు జరిగిందని చెప్పి బతిమాలారు. పిల్లాడి పరిస్థితిని చూసి తల్లిదండ్రుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. వేలకు వేలు ఫీజులు తీసుకుంటూ చిన్న పిల్లాడిని ఇలా కొడతారా అంటూ కన్నీటి పర్యంతమయ్యారు. చిన్నారిని వెంటనే ఆస్పత్రికి తరలించి, చికిత్స చేయించారు. పాఠశాల, టీచర్‌ పేరు చెబితేనే భయపడి పోతున్నాడని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణం టీచర్‌పై చర్యలు చేపట్టాలని ప్రిన్సిపల్‌ను డిమాండ్‌ చేశారు. ఈ ఘటనపై ప్రిన్సిపల్‌ వెంకటరావును అడగ్గా.. విద్యార్థి పట్ల టీచర్‌ ప్రవర్తించిన తీరు బాధాకరమన్నారు. సదరు టీచర్‌పై చర్యలు తీసుకుని.. భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు జరగకుండా చూస్తామన్నారు. కాగా..ఈ ఘటనపై విద్యార్థి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయలేదు.

     

     

     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement