ఉపాధ్యాయులకు ఆన్‌లైన్ ఇక్కట్లు | Teachers online problems | Sakshi
Sakshi News home page

ఉపాధ్యాయులకు ఆన్‌లైన్ ఇక్కట్లు

Published Mon, Jun 6 2016 3:19 AM | Last Updated on Mon, Sep 4 2017 1:45 AM

ఉపాధ్యాయులకు ఆన్‌లైన్ ఇక్కట్లు

ఉపాధ్యాయులకు ఆన్‌లైన్ ఇక్కట్లు

తిరుపతి ఎడ్యుకేషన్: భవిష్యత్తులో ఆన్‌లైన్ బదిలీలు, ఈ పేపర్ పరిపాలన సౌకర్యార్థం టీచర్ల పూర్తి వివరాలతో కూడిన డేటాను ఆన్‌లైన్లో నమోదు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు మే 20వ తేదీన డెరైక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ కార్యాలయంలోని ఇన్‌ఫర్మేషన్ సెల్ నుంచి ఉత్తర్వులు అందాయి. దీని ప్రకారం 13 జిల్లాల్లోని ఉపాధ్యాయులు వారి వ్యక్తిగత, విద్యార్హత, బదిలీలు, పదోన్నతుల వివరాలను వెబ్‌సైట్లోని టీచర్స్ ఇన్‌ఫర్మేషన్ సిస్టమ్‌లో నమోదు చేయాలి. అయితే సర్వర్లు మొరాయిచడం, సర్వర్లు పనిచేస్తే అందులో భర్తీ చేయాల్సిన వివరాలు లేకపోవడం వంటి సమస్యలతో ఉపాధ్యాయులు ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు.
 
జిల్లా వ్యాప్తంగా 6,005ప్రభుత్వ పాఠశాలల్లో 15,993మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. వీరందరూ తప్పనిసరిగా ఆన్‌లైన్లో తమ పూర్తి వివరాలను పొందుపరచాల్సి ఉంది. ఉద్యోగంలో చేరినప్పటి నుంచి వ్యక్తిగత, కుటుంబ సమాచారంతో పాటు విద్యార్హతలు, శాఖాపరమైన పరీక్ష, బదిలీ, పదోన్నతి, అర్హత, మార్క్స్, హాల్ టికెట్ నెంబరు, సర్టిఫికెట్ నెంబరు వంటి వివరాలను పొందుపరచాలి. దీనికోసం మే 20 నుంచి 31వ తేదీ వరకు గడువు విధించారు. సర్వర్లు డౌన్ కావడంతో జూన్ 5కు, తాజాగా 15వ తేదీ వరకు గడువు పొడిగించారు. ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో 126మంది ఉపాధ్యాయులు మాత్రమే(0.8శాతం) ఆన్‌లైన్లో అప్‌డేట్ చేయగలిగారు. నామమాత్రంగా 1,087(6.82శాతం) మంది ఉపాధ్యాయులు అప్‌డేట్ చేయగలిగారు.
 
అయితే సంబంధిత వెబ్‌సైట్లో కొన్ని పాఠశాలల వివరాలు, ఊర్ల పేరు తో పాటు పీఈటీ, డ్రాయింగ్, క్రాఫ్ట్ పోస్టులు చూపకపోవడంతో ఉపాధ్యాయులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నా రు. పైగా సరైన సాఫ్ట్‌వేర్ లేకపోవడంతో నెట్ సెంటర్ల వద్ద ఉపాధ్యాయులు ఉదయం నుంచి రాత్రి వరకు పడిగాపులు కాస్తున్నారు. ఇదివరకే సమగ్ర ఆర్థిక నిర్వహణ కార్యక్రమం(సీఎఫ్‌ఎమ్‌ఎస్) ద్వారా  ఉపాధ్యాయులు పూర్తి వివరాలను అందజేసినట్లు పలు ఉపాధ్యాయ సంఘాల నేతలు పేర్కొంటున్నారు. తగిన విధంగా సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేసి ఉపాధ్యాయులకు ఇక్కట్లు లేకుండా చూడాలని సూచిస్తున్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement