బదిలీలకు ఇన్ని ని‘బంధనాలా’?
Published Mon, Mar 27 2017 11:28 PM | Last Updated on Tue, Sep 5 2017 7:14 AM
-విధి, విధానాలపై ఉపాధ్యాయుల ఆవేదన
-సర్కారు కక్ష కట్టినట్టుందని నిరసన
రామచంద్రపురం రూరల్ (రామచంద్రపురం) : ఈ వేసవిలో చేపట్టబోయే ఉపాధ్యాయ బదిలీలపై ప్రభుత్వం విడుదల చేసిన ముసాయిదా ప్రకారం నిర్ణయించిన విధి, విధానాలపై ఉపాధ్యాయులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఈ బదిలీలకు సంబంధించి ఉపాధ్యాయుల పెర్ఫార్మెన్స్ (పనితీరు)కు 25 శాతం పాయింట్లు ఉండేవి. ప్రస్తుత ముసాయిదాలో వీటిని 50 శాతానికి పెంచాలని ప్రతిపాదించారు. లాంగ్ స్టాండింగ్ సర్వీసు గతంలో 8 సంవత్సరాలు ఉండగా దానిని 5 సంవత్సరాలకు కుదించడాన్ని కూడా అధిక శాతం ఉపాధ్యాయులు వ్యతిరేకిస్తున్నారు. అంతే కాక గతంలో ఉపాధ్యాయుల మొత్తం సర్వీసును పరిగణనలోకి తీసుకునేవారు. ప్రస్తుతం దాని ఊసే లేదు. ఉపాధ్యాయుల బదిలీలకు, పాఠశాలలో బడిరుణం తీర్చుకుందాం కార్యక్రమంలో సేకరించే విరాళాలకు ముడిపెట్టడం మరింత విడ్డూరం. విరాళాల సేకరణ పాఠశాలలు ఉండే ఊరు, అక్కడి ప్రజల ఆర్థిక స్థితిగతులపై ఆధారపడుతుంది. కానీ ఉపాధ్యాయులు సేకరించిన విరాళాలను బట్టి బదిలీలలో ప్రాధాన్యత ఇవ్వాలనుకోవడాన్ని ఉపాధ్యాయులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఉపాధ్యాయుల హాజరు శాతానికి ప్రాధాన్యత ఇవ్వడంపైనా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అనారోగ్యాలతో సెలవులు పెట్టేవారు, ప్రసూతి సెలవులు తీసుకున్న మహిళా ఉపాధ్యాయులు ఈ విధానంతో నష్టపోతారంటున్నారు. ఒకరకంగా ఉపాధ్యాయుల హక్కులకు భంగం కలిగించినట్టే అంటున్నారు. విద్యార్ధుల సగటు హాజరు, మధ్యాహ్నం భోజనం తినే వారి సంఖ్య, ఏ ప్లస్ గ్రేడు విద్యార్థుల సంఖ్య తదితర అంశాలను ఉపాధ్యాయ బదిలీలకు కొలమానంగా పెట్టడంపై కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇవన్నీ ఆయా గ్రామాల్లోని సామాజిక, ఆర్థిక అంశాలకు సంబంధించినవి తప్ప తమ శక్తి సామర్థ్యాలకు కాదనేది ప్రభుత్వం గుర్తించాలని ఉపాధ్యాయులు కోరుతున్నారు. ఉపాధ్యాయులు ఏదైనా తప్పు చేసినప్పుడు శాఖాపరంగా క్రమశిక్షణా చర్యలు ఉంటాయి. ఆ విధంగా చర్యలకు గురైన ఉపాధ్యాయులకు బదిలీలలో కూడా మైనస్ పాయింట్లు ఇచ్చి, మళ్లీ శిక్షించే విధానంపై కూడా మండిపడుతున్నారు. ఆస్తి వివరాలు ప్రకటించకపోయినా మైనస్ పాయింట్లు కేటాయించడం వంటివి చూస్తే చంద్రబాబు ప్రభుత్వం తమపై కక్ష కట్టినట్టుందని ఉపాధ్యాయులు వాపోతున్నారు.
వెబ్ కౌన్సెలింగ్ రద్దు చేయాలి
బదిలీలలో వెబ్ కౌన్సెలింగ్ విధానం వల్ల ఆప్షన్లు ఇవ్వడంలో ఉపాధ్యాయులు గందరగోళానికి గురవుతున్నారు. పాత కౌన్సెలింగ్ విధానాన్ని కొనసాగిస్తే యూనియన్ నాయకుల సహకారంతో ప్రత్యక్షంగా తమకు కావలసిన పాఠశాలలను ఎంపిక చేసుకోగలుగుతారు.
- నరాల కృష్ణకుమార్, పీఆర్‌టీయూ రాష్ట్ర కార్యదర్శి
పెర్ఫార్మెన్స్ పాయింట్ల విధానం తగదు
గతం నుంచీ ఈ పెర్ఫార్మెన్స్ పాయింట్ల విధానాన్ని వ్యతిరేకిస్తున్నాం. అయితే ప్రభుత్వం ఈ విధానాన్ని తీసేయాలన్న ఉపాధ్యాయుల డిమాండ్‌కు వ్యతిరేకంగా మరింత ఎక్కువగా 50 శాతం పాయింట్లు కేటాయించడం సబబు కాదు. ఈ విషయంపై పునరాలోచించాలి.
-చింతాడ ప్రదీప్‌కుమార్, పీఆర్‌టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి
మైనస్ పాయింట్లు రద్దు చేయాలి
మైనస్ పాయింట్ల విధానంతో ఉపాధ్యాయులు బదిలీలలో నష్టపోయే ప్రమాదం ఉంది. ఈ విధానంలో పాయింట్లు కేటాయించడం అనేది గతంలో ఎప్పుడూ లేదు. ప్రభుత్వం మైనస్ పాయింట్ల విధానాన్ని రద్దు చేయాలి.
-వారాడి విజయకృష్ణ, పీఆర్‌టీయూ కె.గంగవరం మండల శాఖ అధ్యక్షుడు
Advertisement
Advertisement