జట్టు కట్టినా దక్కని విజయం
-
గుర్తింపు ఎన్నికల్లో రెండో స్థానంలో ఈయూ, ఎస్‌డబ్ల్యూఎఫ్
-
ఒకే డిపోలో రెండో స్థానానికి పరిమితమైన ఎన్‌ఎంయూ
-
మిగతా డిపోల్లో వంద లోపే ఓట్లు
హన్మకొండ : ఆర్టీసీ గుర్తింపు ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ఐక్య కూటమిగా ఏర్పడిన ఎంప్లాయీస్ యూనియన్(ఈయూ), స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్(ఎస్‌డబ్ల్యూఫ్) విజయాన్ని అందుకోలేక పోయింది. టీఎంయూ వేగాన్ని అందుకోలేక.. బాణం తాకిడి తట్టుకోలేక ఇతర యూనియన్లు కకావికలమయ్యాయి. ఉమ్మడి రాష్ట్రంలో 2012లో జరిగిన ఎన్నికల్లో తెలంగాణ మజ్దూర్ యూనియన్‌తో జత కట్టిన ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర గుర్తింపు కోసం జరిగిన పోటీలో రీజియన్‌లో మెజారిటీ సాధించింది. అప్పటి వరకు సుదీర్ఘకాలం గుర్తింపు సంఘంగా కొనసాగుతున్న ఎన్‌ఎంయూకూ పోటీగా ఎంప్లాయీస్ యూనియన్, టీఎంయూ జతకట్టాయి.
అయితే, ఆ ఎన్నికల్లో ఈయూ రాష్ట్ర గుర్తింపు సాధించగా, టీఎంయూ రీజియన్ గుర్తింపు సాధించింది. ఇక ఎన్‌ఎంయూ ద్వితీయ స్థానంతో సరిపెట్టుకుంది. ఆ ఎన్నికల్లో రీజియన్‌లోని ఎనిమిది డిపోల్లో జనగామ, మహబూబాబాద్‌లో ఎన్‌ఎంయూ మెజారిటీ ఓట్లు సాధించగా మిగతా ఆరు డిపోల్లో ఈయూ, టీఎంయూ కూటమి మెజారిటీ ఓట్లు సాధించింది. 2012లో వరంగల్ రీజియన్‌లో 4,355 ఓట్లు ఉండగా 4,256 ఓట్లు పోలయ్యాయి. రాష్ట్ర గుర్తింపు కోసం పోటీ చేసిన ఎంప్లాయీస్ యూనియన్ 2,460 ఓట్లు సాధించింది. ఇక తాజాగా మంగళవారం జరిగిన ఎన్నికలో ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర గుర్తింపుకు పోటీ పడి 1,395 ఓట్లు మాత్రమే సాధించి రెండో స్థానానికి పరిమితమైంది. 2012 ఎన్నికల్లో రీజియన్ గుర్తింపుకు పోటీ పడిన టీఎంయూ 2,541 ఓట్లు సాధించగా.. ప్రస్తుత ఎన్నికలో టీఎంయూ రీజియన్ గుర్తింపు(క్లాస్–6)నకు 2,405 ఓట్లు, రాష్ట్ర గుర్తింపు(క్లాస్–3)నకు 2,397 ఓట్లు సాధించింది. గత ఎన్నికలతో చూస్తే స్వల్పంగా ఓట్లు తగ్గినా సగానికి పైగా ఓట్లు సాధించి గుర్తింపు సాధించడం విశేషం.
గత ఎన్నికలు, ప్రస్తుత ఎన్నికల్లోనూ ఒంటరిగా బరిలోకి దిగిన ఎన్‌ఎంయూ ప్రస్తుత ఎన్నికల్లో కనీస ప్రభావం చూపకపోవడం గమనార్హం. జిల్లాలోని తొమ్మిది డిపోల్లో ఒక్క జనగామలోనే రెండో స్థానంలో నిలవగా మిగతా డిపోలో వంద లోపు ఓట్లు మాత్రమే పడ్డాయి. 2012లో జరిగిన ఎన్నికల్లో క్లాస్–3లో 1,538 ఓట్లు సాధించిన ఎన్‌ఎంయూ ఈ ఎన్నికల్లో కేవలం 413 ఓట్లు మాత్రమే సాధించింది. క్లాస్–6లో గత ఎన్నికల్లో 1,425 ఓట్లు సాధించిన ఎన్‌ఎంయూ ఈ ఎన్నికల్లో 435 ఓట్లతో సంతృప్తి పడింది. ఎంప్లాయీస్ యూనియన్‌తో కలిసి పోటీ చేసిన స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ ప్రస్తుత ఎన్నికల్లో క్లాస్–6కు పోటీ పడి 1,305 ఓట్లు సాధించి ద్వితీయ స్థానానికి పరిమితమైంది. గత ఎన్నికల్లో ఈ యూనియన్ క్లాస్–3లో 223, క్లాస్–6లో 229 ఓట్లు సాధించింది.
ఐక్యకూటమిగా ఏర్పడి ఓట్లు శాతాన్ని పెంచుకుందే తప్ప గుర్తింపునకు నోచుకోలేదు. ఈ ఎన్నికల్లో మొదటిసారి పోటీ చేసిన బహుజన కార్మిక యూనియన్ క్లాస్–3లో 12 ఓట్లు, క్లాస్–6లో 19 ఓట్లతో సరిపెట్టుకుంది. ఈ ఎన్నికల్లో టీఎంయూ వరంగల్ రీజియన్‌లోని తొమ్మిది డిపోలు, ఆర్‌ఎం కార్యాలయంలో సగానికి పైగా ఓట్లు సాధించి అన్ని డిపోలో తన ఆధిక్యాన్ని నిలుపుకుంది. ఐక్యకూటమి తొమ్మిది డిపోల్లోని ఎనిమిది డిపోల్లో ద్వితీయ స్థానంలో నిలవగా ఎన్‌ఎంయూ కేవలం జనగామ డిపోలోనే ద్వితీయ స్థానంలో నిలిచింది.
క్రాస్ ఓటింగ్...
ఆర్టీసీ గుర్తింపు ఎన్నికల్లో కార్మికులు క్రాస్ ఓటింగ్‌కు పాల్పడినట్లు ఫలితాల వెల్లడయ్యాక పలువురు చెబుతున్నారు. నాయకుల ఒత్తిడి మేరకు కొంత మంది కార్మికులు తమ రెండు ఓట్లలో ఒక్కో ఓటు ఒక్కో యూనియన్‌కు వేశారు. ఈ ఎన్నికల్లో అగ్ర భాగాన నిలిచిన తెలంగాణ మజ్దూర్ యూనియన్‌కు సైతం క్రాస్ ఓటింగ్ తప్పలేదు. రాష్ట్ర గుర్తింపు క్లాస్–3కు 2,397 ఓట్లు రాగా, రీజియన్ గుర్తింపు క్లాస్–6కు 2,405 ఓట్లు పడడమే దీనికి నిదర్శనంగా చెప్పొచ్చు. రీజియన్ గుర్తింపును సమర్థించిన ఎనిమిది మంది ఓటర్లు రాష్ట్ర గుర్తింపునకు టీఎంయూను వ్యతిరేకించినట్లు భావించాల్సి వస్తోంది.
ఐక్య కూటమిగా పోటీ చేసిన ఈయూ, ఎస్‌డబ్లు్యఎఫ్‌లకు పడిన ఓట్లలోను తేడా కనిపించింది. క్లాస్–3కి ఫోటీ చేసిన ఈయూకు 1,395 ఓట్లు రాగా, క్లాస్–6కు పోటీ చేసిన ఎస్‌డబ్ల్యూఎఫ్‌కు 1,305 ఓట్లు వచ్చాయి. అంటే క్లాస్–3కి పోటీ చేసిన ఈయూకు, క్లాస్–6కు పోటీ చేసిన ఎస్‌డబ్ల్యూఎఫ్ కంటే 90 ఓట్లు అధికంగా వచ్చాయి. ఇక ఎన్‌ఎంయూకు క్లాస్–3లో 413 ఓట్లు రాగా, క్లాస్–6లో 435 ఓట్లు.. అంటే 22 ఓట్లు అధికంగా వచ్చాయి. వరంగల్ రీజియన్‌లో ఎప్పుడూ కనిపించని స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్‌కు క్లాస్–6లో 30 ఓట్లు వచ్చాయి. అయితే, ఐక్యకూటమిగా పోటీ చేసిన స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ క్లాస్–6కు పోటీ చేసింది. ఈ రెండు సంఘాల పేర్ల నడుమ సామీప్యత ఉండడం వల్లే స్టాఫ్ వర్కర్స్ ఫెడరేషన్‌కు పడాల్సిన ఓట్లు స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్‌కు పడినట్లు భావిస్తున్నారు. ఈ ఓట్లు కూడా క్లాస్–3కి కాకుండా ఒక్క క్లాస్–6లోనే పడడంతో వీరి భావనకు బలం చేకూరుస్తోంది.