సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీలో గుర్తింపు సంఘం ఎన్నికల నిర్వహణపై జాప్యం కొనసాగుతూనే ఉంది. గతవారం టీఎంయూ గౌరవాధ్యక్ష పదవికి టి.హరీశ్‌రావు రాజీనామా చేయడంతో మరోసారి ఆర్టీసీలో గుర్తింపు సంఘం ఎన్నికల అంశం తెరపైకి వచ్చింది. పంచాయతీ ఎన్నికలు కూడా ముగియడంతో ఈ ఎన్నికలను ఎప్పుడు నిర్వహిస్తారన్న దానిపై సర్వత్రా చర్చ మొదలైంది. గతేడాది ఆగస్టులోనే గుర్తింపు యూనియన్ టీఎంయూ పదవీకాలం ముగిసిందని.. వెంటనే ఎన్నికలు నిర్వహించాలని మిగతా యూనియన్లు డిమాండ్ చేస్తున్నాయి. ఇటు త్వరలోనే ఎన్నికలు ఉంటాయన్న అంచనాలతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న డిపోల్లోని తమ సంఘాల సభ్యులను ఎన్నికలు ఎప్పుడొచ్చినా సిద్ధంగా ఉండాలని అప్రమత్తం చేస్తున్నాయి.
ఆగస్టులోనే ముగిసిన గడువు..
గతేడాది ఆగస్టు 7తోనే తెలంగాణ మజ్దూర్ యూనియన్ (టీఎంయూ) పదవీకాలం ముగిసింది. దీంతో వెంటనే ఎన్నికలు నిర్వహించాలని నాగేశ్వరరావు (ఎన్‌ఎంయూ), రాజిరెడ్డి (ఈయూ), హన్మంత్ ముదిరాజ్ (టీజేఎంయూ) లేబర్ కమిషనర్‌కు పలుమార్లు వినతి పత్రాలు సమర్పించారు. అయితే గతేడాది సెప్టెంబర్ 6న ప్రభుత్వం అనూహ్యంగా ముందస్తు ఎన్నికలకు వెళ్లడంతో ఆర్టీసీలో ఎన్నికలు జాప్యమయ్యాయి. డిసెంబర్‌లో ఆ ఫలితాలు వచ్చాకైనా నిర్వహిస్తారని అనుకుంటే.. పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడింది. దీంతో మరోసారి ఆర్టీసీ ఎన్నికలు వాయిదా పడ్డాయి. అయితే పంచాయతీ ఎన్నికలు ముగిసినా ఇంకా ఎన్నికల నిర్వహణపై ఎలాంటి నిర్ణయం వెలువడలేదు.
అప్పట్నుంచి టీఎంయూదే హవా..
ఆర్టీసీలో 2012 నుంచి టీఎంయూ హవా కొనసాగుతోంది. 2012లో జరిగిన ఎన్నికల్లో టీఎంయూ పోటీ చేసి ఘన విజయం సాధించింది. 2013 జనవరిలో గుర్తింపు యూనియన్‌గా బాధ్యతలు స్వీకరించింది. 2015 జనవరిలో దాని పదవీకాలం ముగిసింది. తర్వాత 2016 జూలైలో ఎన్నికలు జరిగాయి. అంటే దాదాపు ఏడాదిన్నర ఆలస్యమైంది. అప్పటిదాకా టీఎంయూనే అధికారిక యూనియన్‌గా కొనసాగింది. 2016లో జరిగిన ఎన్నికల్లో మళ్లీ టీఎంయూనే ఎన్నికైంది. 2018 ఆగస్టు 7తో ఈ పదవీకాలం ముగిసింది.
హరీశ్ నిష్క్రమణతో స్పీడ్ పెంచిన యూనియన్లు
టీఎంయూ గౌరవాధ్యక్షుడి పదవి నుంచి హరీశ్‌రావు తప్పుకోవడంతో.. మిగిలిన యూనియన్లు ఎన్నికలపై సీరియస్‌గా దృష్టి సారించాయి. మాజీ మంత్రి, ఉద్యమ నాయకుడి నిష్క్రమణతో ఈ సారి టీఎంయూకి తాము గట్టిపోటీ ఇస్తామని అంటున్నాయి. యూనియన్ల నేతలు రాష్ట్రవ్యాప్తంగా తమ అనుచరులకు ఎప్పటికçప్పుడు దిశానిర్దేశం చేస్తున్నారు. ఎçప్పుడు ఎన్నికలొచ్చినా సిద్ధంగా ఉండాలని సన్నద్ధం చేస్తున్నారు. మరోవైపు టీఎంయూ.. ఈసారీ తామే గెలిచేదని, హ్యాట్రిక్ సాధిస్తామని ధీమా వ్యక్తం చేస్తోంది.
ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికలెప్పుడు?
Published Mon, Feb 11 2019 2:57 AM | Last Updated on Mon, Feb 11 2019 2:57 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment