శ్రీశైలం నీటి పంపకాల్లో సీమకు అన్యాయం
- హంద్రీనీవాకు మాత్రమే 7 టీఎంసీలు కేటాయింపు
- తెలుగుగంగ, ఎస్‌ఆర్‌బీసీలకు మొండిచేయి
- బోర్డుకు నీరు కావాలని ప్రతిపాదించని ప్రభుత్వం
- పట్టిసీమ నీరు డెల్టాకు.. డెల్టా వాటా నీరు సీమకు ఇస్తామన్న ప్రభుత్వం
- ప్రకటనకే పరిమితమైన బాబు హామీ
- సీమలో రబీ ఆయకట్టు లేనట్లే
పట్టిసీమ నుంచి కృష్ణా డెల్టాకు ఎంత నీరు తరలిస్తామో అంతే మొత్తం నీటిని రాయలసీమ సాగునీటి కాల్వలకు ఇస్తాం. శ్రీశైలం జలాశయం నుంచి చుక్క నీరు కూడా దిగువకు తీసుకుపోం. - గత రెండేళ్లుగా చంద్రబాబు హామీ ఇది.
కర్నూలు సిటీ: ఖరీఫ్ ఆయకట్టుకు మాత్రమే నీరిచ్చి రబీని ఎండబెట్టేందుకు ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తోంది. ఈ ఏడాది శ్రీశైలం ప్రాజెక్టుకు ఆగస్టు మొదటి వారం వరకు ఎగువ నుంచి చుక్కనీరు చేరని పరిస్థితి. ఆ తర్వాత కృష్ణానది పరీవాహక ప్రాంతంలో కురిసిన వర్షాలతో రెండు వారాలకే జలాశయం కనీస నీటి మట్టానికి చేరుకుంది. ఆ సమయంలో మొదట కృష్ణా పుష్కరాల కోసమని, ఆ తర్వాత తాగునీటి కోసం అధికారం చేతిలో ఉండడంతో కృష్ణానది యాజమాన్య బోర్డు అనుమతిచ్చిన దాని కంటే అదనంగా నీటిని దిగువకు తరలించారు. ఫలితంగా నేడు రాయలసీమ రబీ సాగుకు దూరమవుతోంది. ఇటీవల కృష్ణా జలాల పంపకాలు కూడా ప్రభుత్వ కుట్రకు అద్దం పడుతోంది. ప్రస్తుతం శ్రీశైలంలో 868 అడుగుల నీటి మట్టం, 135 టీఎంసీల నీరు ఉంది. వెలుగోడులో 11.5 టీఎంసీలు ఉండగా కడపకు 5 టీఎంసీలు, తెలుగుగంగ కింద స్టాండింగ్ క్రాప్‌నకు 3 టీఎంసీలు పోగా.. మిగిలిన 3 టీఎంసీలు తాగునీటి అవసరాలకు వినియోగించనున్నారు.
నీటి పంపకాల్లో అన్యాయం
రెండు తెలుగు రాష్ట్రాల ఉమ్మడి ప్రాజెక్టు అయిన శ్రీశైలం జలాశయం నీటి పంపకాల్లో రాయలసీమకు మరోసారి అన్యాయం జరిగింది. ప్రాజెక్టులు 150 టీఎంసీల నీటిని విడతల వారీగా దిగువకు తీసుకెళ్లే కుట్ర జరుగుతోంది. ఇప్పటికే 51 టీఎంసీలను అనుమతులు లేకుండా సాగర్‌కు తరలించారు. మరో 60 టీఎంసీల నీటిని వచ్చే ఏడాది జనవరి, ఫిబ్రవరిలో తీసుకెళ్లేందుకు అధికార పార్టీ ఎత్తుగడ వేస్తోంది. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నీటి పంపకాల్లో ఒక్కో ప్రాంతానికి ఒక్కో విధంగా నిర్ణయాలు తీసుకుంటుండడంతో సీమ జిల్లాలకు తీవ్ర అన్యాయం జరుగుతోంది. ఇంత జరుగుతున్నా టీడీపీ నేతలు ఒక్కరు కూడా స్పందించకపోవడం చూస్తే ఈ ప్రాంత ఆయకట్టుదారులపై వారికున్న ప్రేమ అర్థమవుతోంది.
సీమ సాగునీటి కాల్వల కింద రబీ ఆయకట్టు లేనట్లే!
శ్రీశైలం ప్రాజెక్టు ద్వారా తెలుగుగంగ, శ్రీశైలం కుడి కాలువ కింద కర్నూలు జిల్లాలో 1.08 లక్షలు, కడపలో 1.67 లక్షలు, నెల్లురులో 2.54 లక్షలు, చిత్తూరు జిల్లాలో 0.46 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. ఎస్‌ఆర్‌బీసీ కింద కర్నూలులో 1.60 లక్షలు, కడపలో 30వేల ఎకరాల ఆయకట్టు ఉంది. ఇందులో ప్రస్తుతం తెలుగుగంగ కింద 3లక్షలు, ఎస్‌ఆర్‌బీసీ కింద 1.14 లక్షల ఎకరాలకు మాత్రమే సాగునీరు అందుతుంది. రబీలో ఆరుతడి పంటలు సాగు చేసేందుకూ శ్రీశైలంలో నీరు అందుబాటులో ఉంది. అయితే ప్రభుత్వం కృష్ణాడెల్టాకు సాగు నీరు ఇచ్చేందుకు మాత్రమే కృష్ణాబోర్డుకు ప్రతిపాదించింది. సీమలోని హంద్రీనీవాకు మాత్రమే 7 టీఎంసీల నీరు ఇచ్చేందుకు అనుమతులు తీసుకున్నారు. ఈ నీరంతా అనంతపురం జిల్లాకేనని చెబుతున్నారు. వాస్తవానికి ఇప్పటికే 20 టీఎంసీలకు పైగా కృష్ణాజలాలు తరలించారు. కానీ కర్నూలు జిల్లాకు మాత్రం 3 టీఎంసీలు కూడా ఇవ్వకపోవడం గమనర్హం.
రబీకి నీరివ్వలేం
ఖరీఫ్‌లో సాగు చేసిన పంటలకు మాత్రమే నీరిస్తాం. రబీకి నీరు ఇవ్వలేమని ఇప్పటికే తెలుగుగంగ, ఎస్‌ఆర్‌బీసీ ఎస్‌ఈలు ఆయా గ్రామాల రైతులకు తెలిపేలా ఆదేశించాం. 6.6 టీఎంసీల నీరు అవసరమని ప్రభుత్వం ద్వారా ప్రతిపాదించాం. ఇప్పటికే మా ఇంజినీర్లు గ్రామాల్లో డప్పు వేయిస్తున్నారు. దిగువకు నీరు వదిలితే నీటి మట్టం తగ్గుతుందని, ఆ తర్వాత సాగు చేసిన పంటలకు నీరు ఇవ్వలేమని ఈ నిర్ణయం తీసుకున్నాం. – నారాయణరెడ్డి, సీఈ