పనిచేయని ఏటీఎంలు
వరుస సెలవులతో మూడు రోజులపాటు జిల్లాలోని బ్యాంకులన్నీ మూతపడగా.. చాలా ఏటీఎంలు ’అవుటాఫ్ సర్వీస్’, ’నో క్యాష్’ బోర్డుల్ని తగిలించుకుని నగదు కోసం వచ్చిన జనాన్ని వెక్కిరించాయి. సోమవారం జిల్లాలో దాదాపు అన్ని ఏటీఎంలు మూతపడ్డాయి. ఏలూరు నగరంలోని మూడు ఏటీఎంలలో బ్యాంకర్లు నగదు నింపినా రెండు గంటల్లోనే అవికూడా మూతపడ్డాయి
తెరుచుకోని ఏటీఎంలు
సొమ్ములొచ్చాయంటున్న బ్యాంకర్లు
నేటి నుంచి పంపిణీ చేస్తామని, కొరత తీరుతుందని ప్రకటన
సాక్షి ప్రతినిధి, ఏలూరు :
వరుస సెలవులతో మూడు రోజులపాటు జిల్లాలోని బ్యాంకులన్నీ మూతపడగా.. చాలా ఏటీఎంలు ’అవుటాఫ్ సర్వీస్’, ’నో క్యాష్’ బోర్డుల్ని తగిలించుకుని నగదు కోసం వచ్చిన జనాన్ని వెక్కిరించాయి. సోమవారం జిల్లాలో దాదాపు అన్ని ఏటీఎంలు మూతపడ్డాయి. ఏలూరు నగరంలోని మూడు ఏటీఎంలలో బ్యాంకర్లు నగదు నింపినా రెండు గంటల్లోనే అవికూడా మూతపడ్డాయి. తాడేపల్లిగూడెంలో ఎస్‌బీఐ ఏటీఎం ఒకటి పనిచేయగా, తణుకులో ప్రైవేటు బ్యాంకు ఏటీఎం పనిచేసింది. జిల్లా వ్యాప్తంగా డబ్బులు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఏలూరు సమీప మండలాల ప్రజలు నగరానికి వచ్చి ఏటీఎంల చుట్టూ తిరిగినా ఫలితం లేకపోవడంతో ఉసూరుమంటూ ఇంటిముఖం పట్టారు. భీమవరంలో ఒక్క ఏటీఎంలోనూ సొమ్ము లేదు. ప్రతిచోట ’నో క్యాష్’ బోర్డులు దర్శనమిచ్చాయి. శని, ఆది, సోమవారం ఏటీఎంలకు కూడా సెలవు ప్రకటించినట్లయ్యింది. సెలవు రోజుల్లో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయించి నగదు బట్వాడా చేసేందుకు కలెక్టర్ కాటంనేని భాస్కర్ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. 34 రోజులుగా ప్రజలు నగదు కోసం ఇబ్బందులు పడుతున్నప్పటికీ ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకపోవడంతో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. వరసగా మూడు రోజులు సెలవలు రావడంతో మంగళవారం బ్యాంకుల వద్ద హడావిడి ఎక్కువ ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. జనం తాకిడికి సరిపడా డబ్బులు బ్యాంకులకు చేరకపోతే ప్రజాగ్రహం చవిచూడాల్సి వస్తుందని ఆందోళన చెందుతున్నారు. జిల్లాకు నగదు చేరుకుందని, పరిస్థితి ఒకట్రెండు రోజుల్లో పరిస్థితి చక్కబడే అవకాశం ఉందని బ్యాంకు అధికారులు చెబుతున్నారు. చిల్లర నోట్లతోపాటు రూ.2 వేల నోట్లు కూడా బ్యాంకులకు వచ్చాయని, అందువల్ల చిల్లర సమస్య తీరుతుందని చెబుతున్నారు. ఈ నోట్లు ఎంత మేరకు ప్రజలకు అందుతాయన్నదే ప్రశ్న.