వాడి వేడిగా ఉంటుందా..! | telangana assembly session started | Sakshi
Sakshi News home page

వాడి వేడిగా ఉంటుందా..!

Published Wed, Sep 30 2015 10:03 AM | Last Updated on Sun, Apr 7 2019 3:47 PM

telangana assembly session started

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు బుధవారం ప్రారంభమయ్యాయి. ముందు నిర్ణయించినట్లుగానే ప్రశ్నోత్తరాలు పక్కకు పెట్టి రైతుల ఆత్మహత్యల విషయంపైనే ప్రధాన చర్చ ప్రారంభించారు. మంగళవారం మొత్తం కూడా ఇదే అంశంపై వాడివేడిగా చర్చ జరిగిన విషయం తెలిసిందే. అయితే, మంగళవారం నాటి సమావేశంలో అధికార పక్షం కాస్త ఓపిగ్గానే వున్నా నేడు మాత్రం ప్రతిపక్షాలను ధీటుగా ఎదుర్కోవాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది. ముఖ్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీశ్ రావులు ప్రతిపక్షాలకు గట్టి బదులిచ్చే అవకాశం ఉంది.

మంగళవారంనాటి సమావేశాల్లో ప్రారంభంలోనే వికారుద్దీన్ ఎన్ కౌంటర్ విషయంపైనే చర్చ జరపాలని మజ్లిస్ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ ఝలక్ ఇచ్చిన విషయం తెలిసిందే. దాంతోపాటు రైతుల ఆత్మహత్యలపై చర్చ ప్రారంభించినప్పుడు కూడా అక్బరుద్దీన్ అదే స్థాయిలో గొంతు పెంచారు. రైతులు విషయంలో ఈ ప్రభుత్వం ఏం చేయలేకపోతుందని, మాటలకే పరిమితమవుతుందని గట్టిగా స్వరం వినిపించారు. ఈ క్రమంలో ఓసారి కేటీఆర్, అక్బరుద్దీన్కు మధ్య వాడివేడి మాటల యుద్ధం నెలకొంది కూడా. ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా అంతకుముందు అక్బరుద్దీన్ విషయంలో జోక్యం చేసుకొని సర్ది చెప్పారు. ఈ నేపథ్యంలో బుధవారం నాటి సమావేశాల్లో అలాంటి పరిస్థితి ఉండకూడదని ప్రభుత్వానిదే పైచేయిగా చేయాలని అధికార పక్షం సర్వత్రా సిద్ధమైనట్లు తెలుస్తోంది. ప్రస్తుతానికి సమావేశం ప్రారంభమై రైతుల ఆత్మహత్యల అంశంపై చర్చ జరుగుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement