జిల్లాలో 10 వేల ఈ పోస్ మెషీన్లు
జిల్లాలో 10 వేల ఈ పోస్ మెషీన్లు
Published Wed, Nov 23 2016 7:23 PM | Last Updated on Mon, Sep 4 2017 8:55 PM
డిసెంబర్ మొదటి వారానికి ఏర్పాటు
వీటి కోసం 3,500 దరఖాసులు
జన్‌ధన్ ఖాతాదారులకు రుపే కార్డులు
కలెక్టర్ అరుణ్‌కుమార్
కాకినాడ సిటీ : జిల్లాలో డిసెంబర్ మొదటి వారానికి 10 వేల ఈ పోస్ మెషీన్లను అందుబాటులోకి తేనున్నట్టు కలెక్టర్ హెచ్.అరుణ్‌కుమార్ తెలిపారు. ప్రజల లావాదేవీలు అధికంగా ఉండే జనరల్ స్టోర్స్, మెడికల్ స్టోర్స్, ఎరువుల దుకాణాలు, వైన్ షాపులు తదితర దుకాణాల్లో ఈ మెషీన్లను బ్యాంకులు అందుబాటులోకి తేనున్నాయని చెప్పారు. కలెక్టరేట్‌లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నగదు కొరత నివారణకు తీసుకుంటున్న చర్యలను వివరించారు. నగదు రహిత లావాదేవీల పట్ల ప్రజలను ఆకర్షితులను చేసేందుకు ఈ పోస్ మెషీన్లను గ్రామ, మండల స్థాయిల్లో అన్ని రకాల వ్యాపారులు ఏర్పాటు చేసుకునేలా ప్రోత్సహిస్తున్నామన్నారు. ఇప్పటి వరకూ వ్యాపారుల నుంచి ఈ మెషీన్ల కోసం సుమారు 3,500 దరఖాస్తులు వచ్చాయని చెప్పారు. ఎస్‌బీఐ, ఎస్‌బీహెచ్, ఆంధ్రాబ్యాంక్‌ల ద్వారా ఈ నెల 27లోగా వాటిని ఆయా వ్యాపార సంస్థల్లో నెలకొల్పనున్నారని తెలిపారు. జిల్లాలో జన్‌ధన్ ఖాతాలు తెరిచిన వారిలో చాలా మంది రూపే డెబిట్ కార్డును తీసుకోలేదని, వారందరికి వాటిని పంపిణీ చేసి నగదు రహిత లావాదేవీలకు వినియోగించుకునేలా చైతన్యపరుస్తామన్నారు. నగదు కొరత నేపథ్యంలో ప్రజల ఇబ్బందుల నివారణకు జిల్లా స్థాయిలో అధికారులు, బ్యాంకర్లతో ఏర్పాటు చేసిన ప్రత్యేక సమన్వయ కమిటీ ఎప్పటికప్పుడు సమీక్షించి యుద్ధ ప్రాతిపదికన అవసరమైన చర్యలు తీసుకుంటోందని తెలిపారు.
Advertisement